వన్డే క్రికెట్‌లో టీమ్స్ ఛేజ్ చేసిన రికార్డు స్కోర్లు ఇవే
ODI Cricket.. 1990ల్లో అయితే ఓ వన్డే మ్యాచ్‌లో 300 పరుగులు చేయడం అంటే చాలా పెద్ద అచీవ్‌మెంట్. కానీ 2000 తర్వాత క్రికెట్‌లో వేగం పెరిగింది. దీంతో 300 కాదు కదా.. టీమ్స్ ఎన్నోసార్లు 400 స్కోర్లను కూడా దాటాయి. ఈ స్కోర్లను తర్వాత బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఛేజ్ చేసిన సందర్భాలు ఈ రెండు దశాబ్దాల్లో చాలానే నమోదయ్యాయి.
క్రికెట్‌లో ఓ టీమ్ చేసిన స్కోరును మరో టీమ్ ఛేజ్ చేయడం ఎప్పుడూ థ్రిల్లింగానే ఉంటుంది. అందులోనూ భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లలో ఆ మజానే వేరు. ఇప్పుడంటే టీ20లు వచ్చిన తర్వాత వన్డేలు కూడా బోర్ కొడుతున్నాయి కానీ.. నిజానికి ఈ ఫార్మాట్‌లోనూ భారీ స్కోర్లను టీమ్స్ ఛేదించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముందు బ్యాటింగ్ చేసిన టీమ్స్ పెద్ద స్కోరు చేసేసి.. ఇంత స్కోరు ఛేజ్ చేయడం ఇక ప్రత్యర్థి వల్ల కాదులే అనుకొని బోల్తా పడ్డాయి.
ట్రెండింగ్ వార్తలు
2000వ సంవత్సరం తర్వాత క్రికెట్‌లో వేగం పెరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్సే కాదు.. 300, 400కుపైగా స్కోర్లను తర్వాత బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఛేజ్ చేసిన సందర్భాలు ఈ రెండు దశాబ్దాల్లో చాలానే నమోదయ్యాయి. ఆ రికార్డు ఛేజింగ్‌ల గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.
1. రికార్డు చేజ్ 438 పరుగులు
వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఓ టీమ్ ఛేజ్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. 15 ఏళ్ల కిందట ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అప్పటికి వన్డేల్లో రికార్డు స్కోరు 434 పరుగులు చేసింది. సగం మ్యాచ్ ముగిసే సరికే ఇక ఆస్ట్రేలియాదే విజయం అని చాలా మంది ఫిక్సయ్యారు. కానీ చరిత్రను తిరగరాసింది సౌతాఫ్రికా టీమ్.
సొంతగడ్డ (జోహన్నెస్‌బర్గ్)పై జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిబ్స్ 111 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇక ఓపెనర్ గ్రేమ్ స్మిత్ 55 బంతుల్లో 90 పరుగులు చేశాడు. దీంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సౌతాఫ్రికా అంత భారీ లక్ష్యాన్ని ఛేదించింది. 15 ఏళ్లుగా ఆ రికార్డు అలా చెక్కు చెదరకుండా ఉంది.
2. అవే టీమ్స్.. ఈసారి 372 పరుగులు
సరిగ్గా పదేళ్ల తర్వాత ఆ రెండు టీమ్స్ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) మధ్యే జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో రెండో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు నమోదైంది. ఈసారి కూడా సౌతాఫ్రికానే ఆ రికార్డు సృష్టించింది. 2016లో సొంతగడ్డ (డర్బన్)పై జరిగిన ఈ వన్డేలో సౌతాఫ్రికా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా మ్యాచ్‌ను ముగించింది.
ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో 50 ఓవర్లలో 371 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించినా వరుసగా వికెట్లు కోల్పోయింది. 215 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సందర్భంలో ఆరో నంబర్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కేవలం 79 బంతుల్లో 118 పరుగులు చేశాడు. దీంతో అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేజ్ చేసింది.
3. ఇంగ్లండ్ రికార్డు 364 పరుగులు
ఇక వన్డేల్లో మూడో అత్యధిక లక్ష్యఛేదన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2019లో వెస్టిండీస్‌తో వారి సొంతగడ్డ (బ్రిడ్జ్‌టౌన్)పై జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. క్రిస్ గేల్ (135) సెంచరీతో 50 ఓవర్లలో 360 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను జేసన్ రాయ్, జో రూట్ సెంచరీలు గట్టెక్కించాయి. ఈ మ్యాచ్‌లో మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 364 పరుగులు చేసి విజయం సాధించింది. రాయ్ 85 బంతుల్లో 123, జో రూట్ 97 బంతుల్లో 102 పరుగులు చేశారు.
4. మళ్లీ ఆస్ట్రేలియా.. ఈసారి ఇండియా
మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్లు చేయడం ఆస్ట్రేలియాకు అలవాటే. కానీ ఆ భారీ స్కోర్లను కూడా కాపాడుకోలేక చేతులెత్తేయడం ఆ టీమ్‌కు అలవాటుగా మారింది. వన్డేల్లో నాలుగు సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్ రికార్డు ఇండియా పేరిట ఉండగా.. ఆ రికార్డు ఛేజ్‌ను ఆస్ట్రేలియాపైనే చేసింది. 2013లో జైపూర్‌లో జరిగిన వన్డేలో ఇండియా 362 పరుగులు చేసి విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 50 ఓవర్లలో 5 వికెట్లకు 359 పరుగులు చేసింది. ఆ టీమ్ తరఫున ఏకంగా ఐదుగురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. అయితే ఇంతటి స్కోరును మన బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉఫ్‌మని ఊదేశారు. ఈ ఇద్దరూ సెంచరీలు చేయడంతో ఇండియా కేవలం 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ 141, విరాట్ సరిగ్గా 100 పరుగులు చేశారు. కోహ్లి కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం.
5. 359 పరుగులు.. మళ్లీ ఇంగ్లండే
ఆ రికార్డు ఛేజ్‌ను ఇంగ్లండ్.. పాకిస్థాన్‌పై సాధించింది. 2019లో బ్రిస్టల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఓపెనర్ ఇమాముల్ హక్ (151) సెంచరీతో 50 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (128) సెంచరీ, మరో ఓపెనర్ జేసన్ రాయ్ 75 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ 44.5 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్ చేసింది. వన్డే క్రికెట్ రికార్డు ఛేజింగ్‌లలో ఇది ఐదో స్థానంలో ఉంది.
సంబంధిత కథనం