Roger Federer Farewell Match: చిరకాల ప్రత్యర్థి నదాల్‌తో కలిసి చివరి మ్యాచ్ ఆడనున్న ఫెదరర్!
Roger Federer Farewell Match: చిరకాల ప్రత్యర్థి నదాల్‌తో కలిసి తన కెరీర్‌లో చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడే అవకాశం కోసం చూస్తున్నట్లు టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ చెప్పాడు. లేవర్ కప్ తర్వాత అతడు రిటైరవుతున్న విషయం తెలిసిందే.
Roger Federer Farewell Match: టెన్నిస్‌లో రోజర్ ఫెదరర్, రఫేల్ నదాల్ మధ్య ఎన్ని గొప్ప మ్యాచ్‌లు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరూ టెన్నిస్ కోర్టులో తలపడుతున్నారంటే టెన్నిస్ ఫ్యాన్స్‌కు పండగలా ఉండేది. అయితే ఈ గొప్ప ప్రత్యర్థులు ఇప్పుడు కలిసి ఆడే అవకాశం ఉంది. రోజర్ ఫెదరర్‌కు తన ప్రొఫెషనల్ కెరీర్‌లో ఇదే చివరి మ్యాచ్ కానుండటం విశేషం.
లేవర్ కప్ 2022లో భాగంగా నదాల్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఫెదరర్ చెప్పాడు. అదే జరిగితే తనకెంతో ప్రత్యేకమైన విషయం అవుతుందని అతనన్నాడు. ఈ టోర్నీ తర్వాత తాను రిటైరవుతున్నట్లు సెప్టెంబర్ 15నే ఫెడెక్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ స్విస్ మాస్టర్ మీడియాతో మాట్లాడాడు. ఈ లేవర్ కప్‌లో తాను సింగిల్స్ మ్యాచ్ ఆడబోవడం లేదని కూడా స్పష్టం చేశాడు.
టీమ్ యూరప్ తరఫున టోర్నీ బరిలో దిగుతున్న ఫెదరర్.. డబుల్స్ మ్యాచ్‌లో తలపడనున్నాడు. ఇందులో ఒకటే డబుల్స్ మ్యాచ్‌లో ఆడనున్న అతడు.. ఈ మ్యాచ్ తర్వాత తాను తప్పుకుంటానని, తన స్థానంలో మ్యాటియో బెరెటిని వస్తాడని చెప్పాడు. టెన్నిస్‌లోనే కాదు అసలు స్పోర్ట్స్ హిస్టరీలో నిలిచిపోయే గొప్ప ప్రత్యర్థుల్లో ఫెదరర్, నదాల్ కచ్చితంగా ఉంటారు. ఈ ఇద్దరూ కెరీర్‌లో 40 సార్లు తలపడ్డారు. కోర్టులో ప్రత్యర్థులే అయినా.. బయట మాత్రం వీళ్లు మంచి ఫ్రెండ్స్.
ఫెడెక్స్ రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలోనూ నదాల్ ఓ మనసుకు హత్తుకునే సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది తనకెంతో బాధాకరమైన రోజని అతడన్నాడు. ఇక ఇప్పుడు నదాల్‌తోనే కలిసి ఆడే క్షణం కోసం ఫెడెక్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. నదాల్‌తోపాటు ముర్రే, జోకొవిచ్‌లతోనూ అతడు కలిసి ఆడే అవకాశం ఉంది.
అయితే ఈ జోడీ విషయంలో తుది నిర్ణయం మాత్రం టీమ్ కెప్టెన్ జాన్ బోర్గ్‌కే వదిలేస్తున్నట్లు ఫెదరర్ చెప్పాడు. నదాల్‌తో కలిసి ఆడే అవకాశం వస్తే మాత్రం చాలా ప్రత్యేకమైన సందర్భం అవుతుందని ఫెడెక్స్ అభిప్రాయపడ్డాడు. తమ కెరీర్‌లు మొత్తం ఇద్దరం మంచి సంబంధాలను కొనసాగించామని, ఇది టెన్నిస్‌లోనే కాదు మిగతా స్పోర్ట్స్ ప్రపంచానికి కూడా మంచి సందేశమని రోజర్ చెప్పాడు.
నదాల్‌తో కలిసి ఆడే అవకాశం వస్తుందో రాదో తెలియదు కానీ.. వస్తే మాత్రం చాలా గొప్ప విషయమని అన్నాడు. ఒకవేళ ఈ ఇద్దరూ కలిసి ఆడితే ఆ మ్యాచ్ వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 23) జరగనుంది. అయితే 2017లో జరిగిన లేవర్ కప్‌లోనూ తొలిసారి ఈ ఇద్దరూ కలిసి ఆడారు. ఆ మ్యాచ్‌లో సామ్ క్వెరీ, జాక్ సాక్‌లను వీళ్లు ఓడించారు.