Roger Federer Earnings: కెరీర్‌లో ఫెదరర్‌ సంపాదన ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!-federer earnings in the career is mind boggling ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Federer Earnings In The Career Is Mind Boggling

Roger Federer Earnings: కెరీర్‌లో ఫెదరర్‌ సంపాదన ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

ఆల్ టైమ్ టెన్నిస్ గ్రేట్స్ లో ఒకడు రోజర్ ఫెదరర్
ఆల్ టైమ్ టెన్నిస్ గ్రేట్స్ లో ఒకడు రోజర్ ఫెదరర్ (AP)

Federer Earnings: కెరీర్‌లో టెన్నిస్‌ గ్రేట్‌ రోజర్‌ ఫెదరర్‌ సంపాదన మామూలుగా లేదు. కోర్టు లోపల, బయట అతని సంపాదనకు ప్రత్యర్థులెవరూ దరిదాపుల్లో కూడా లేరు.

Federer Earnings: కళాత్మకమైన ఆటకు పెట్టింది పేరు స్విస్‌ మాస్టర్‌ రోజర్‌ ఫెదరర్‌. టెన్నిస్‌ కోర్టులో రాకెట్‌తో అతడు చేసిన మ్యాజిక్‌ కొన్ని తరాల పాటు నిలిచిపోతుంది. స్టైలిష్‌ ఫోర్‌హ్యాండ్‌ షాట్లు, సింగిల్‌ హ్యాండ్‌ బ్యాక్‌హ్యాండ్‌ షాట్లు, కచ్చితమైన సర్వీస్‌లు, బేస్‌లైన్‌ షాట్లు మరే ప్లేయర్‌కూ సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫెడెక్స్‌ 24 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు గురువారం (సెప్టెంబర్ 15) గుడ్‌బై చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

2003లో 20 ఏళ్ల వయసులో తొలి వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచిన అతడు.. ఆ తర్వాత ఎవరికీ సాధ్యం కాని రీతిలో గ్రాస్‌కోర్టుపై ఆధిపత్యం చెలాయించి 8 టైటిల్స్‌ సొంతం చేసుకున్నాడు. 2001 వింబుల్డన్‌లో పీట్‌ సంప్రాస్‌ 31 వరుస విజయాల రికార్డును అధిగమించిన ఫెదరర్‌కు ఆ తర్వాత తిరుగు లేకుండా పోయింది. ఫెదరర్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ కూడా 2021లోనే తనకెంతో ఇష్టమైన వింబుల్డన్‌లోనే ఫెదరర్‌ ఆడటం విశేషం.

ఫెదరర్‌ సంపాదన..కళ్లు చెదరడం ఖాయం

ఫెదరర్‌ ఆల్‌టైమ్‌ టెన్నిస్‌ గ్రేట్స్‌లో ఒకడు. నదాల్‌, జోకొవిచ్‌లాంటి ప్లేయర్స్‌ వచ్చిన తర్వాత టెన్నిస్‌ కోర్టులో ఫెడెక్స్‌ జోరు తగ్గిందేమో కానీ సంపాదనలో మాత్రం ఆ ఇద్దరూ ఈ స్విస్‌ మాస్టర్‌ దరిదాపుల్లోకి కూడా రారు. ఫెదరర్‌ ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. అతని రికార్డును నదాల్, జోకొవిచ్‌ దాటేశారు. అయితే కోర్టు లోపల, బయట కలిపి అతని సంపాదనకు మాత్రం చాలా దూరంలోనే ఉండిపోయారు.

41 ఏళ్ల ఫెదరర్‌ తన కెరీర్‌లో ప్రైజ్‌మనీగా 13.1 కోట్ల డాలర్లు సంపాదించాడు. అయితే కోర్టు లోపల కంటే బయటే అతని సంపాదన ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఎండార్స్‌మెంట్లు, ఇతర బిజినెస్‌లతో ఫెడెక్స్‌ ఇప్పటి వరకూ 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8 వేల కోట్లు)కుపైగా సంపాదించినట్లు ఫోర్బ్స్‌ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ప్రతి ఏటా టెన్నిస్‌ కోర్టు బయట ఫెదరర్‌ సంపాదన 9 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఈ రిపోర్ట్‌ తెలిపింది.

ఫెదరర్‌.. 17 ఏళ్ల పాటు అత్యధిక మొత్తం అందుకుంటూ..

ఫెదరర్‌ తన కెరీర్‌లో ఏకంగా 17 ఏళ్ల పాటు అత్యధిక మొత్తం అందుకుంటున్న టెన్నిస్‌ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. పన్నులు, ఏజెంట్ల ఫీజులు కలిపితే తన కెరీర్‌లో ఫెడెక్స్‌ మొత్తం సంపాదన 110 కోట్ల డాలర్లు. ఇది టెన్నిస్‌ కోర్టులో అతని ప్రధాన ప్రత్యర్థులైన నదాల్‌ (50 కోట్ల డాలర్లు), జోకొవిచ్ (47 కోట్ల డాలర్లు)ల కంటే రెట్టింపు కావడం విశేషం.

ప్రపంచంలో 100 కోట్ల డాలర్ల మైల్‌స్టోన్‌ అందుకున్న ఏదో అథ్లెట్‌ రోజర్‌ ఫెదరర్‌. అతడు కాకుండా లెబ్రాన్‌ జేమ్స్‌, ఫ్లాయిడ్‌ మేవెదర్‌, లియోనెల్‌ మెస్సీ, ఫిల్‌ మికెల్‌సన్‌, క్రిస్టియానో రొనాల్డో, టైగర్‌ వుడ్స్‌లు కూడా తమ కెరీర్‌లలో 100 కోట్ల డాలర్ల సంపాదన మార్క్‌ను అందుకున్నారు. తన కెరీర్‌ ఓ రేంజ్‌లో ఉన్న సమయంలో ఫెదరర్‌ ఓ ఎగ్జిబిషన్‌, స్పెషల్‌ టోర్నీమెంట్స్‌కు ఆడే సమయంలో ఒక్కో ఈవెంట్‌కు 20 లక్షల డాలర్లు సంపాదించేవాడు.

WhatsApp channel

టాపిక్