Pathan on Kohli: కోహ్లితో జాగ్రత్త.. ఆస్ట్రేలియన్లకు పఠాన్ వార్నింగ్
Pathan on Kohli: కోహ్లితో జాగ్రత్త అంటూ ఆస్ట్రేలియన్లకు ఇర్ఫాన్ పఠాన్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడున్న కోహ్లి పూర్తి భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పాడు.
Pathan on Kohli: ఇండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు ఆస్ట్రేలియన్లకు వార్నింగ్ ఇచ్చాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. విరాట్ కోహ్లి పూర్తి భిన్నమైన వెర్షన్ ఇప్పుడు చూస్తున్నామని, కొన్నాళ్లుగా అతని సెంచరీల కరువు కూడా తీరిపోయిందని అన్నాడు. అంతేకాదు కోహ్లి తర్వాత ఈ ఫైనల్లో నాలుగో స్థానంలోని బ్యాటర్ చాలా కీలకమని స్పష్టం చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు పఠాన్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడాడు. "ఇతడు పూర్తి భిన్నమైన విరాట్ కోహ్లి. అతడు ఎన్నో పరుగులు చేశాడు. అందులో సందేహం లేదు. అతడు టెస్టుల్లో, టీ20లలో వన్డేల్లో సెంచరీలు చేశాడు. అతని సెంచరీల కరువు కూడా తీరిపోయింది. విరాట్ కోహ్లి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్ లో 25 వేలకుపైగా పరుగులు చేశాడు. అతడు ఎలా చేశాడు? తన సామర్థ్యాలపై ఉన్న విశ్వాసంతోనే. కోహ్లి డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్ కు దిగిన సమయంలో నాలుగో స్థానంలో వచ్చే బ్యాటర్ చాలా కీలకం" అని పఠాన్ చెప్పాడు.
గతేడాది ఆసియా కప్ నుంచి విరాట్ మళ్లీ గాడిలో పడిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ లో రెండున్నరేళ్ల తర్వాత సెంచరీ చేయడంతోపాటు ఆ తర్వాత కూడా టెస్టులు, వన్డేల్లోనూ తన సెంచరీల కరువు తీర్చుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లోనూ రెండు వరుస సెంచరీలు బాదాడు. ఇండియా తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన సమయంలో కోహ్లినే కెప్టెన్ గా ఉన్నాడు.
ఇక ఈ ఫైనల్ వచ్చే సమయానికి అతడు టాప్ ఫామ్ లో ఉన్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియాతో అతని రికార్డు అదిరిపోయేలా ఉంది. ఇప్పటి వరకూ 24 మ్యాచ్ లలో 48.27 సగటుతో 1979 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు ఉన్నాయి. నిజానికి టెస్టుల్లో ఆస్ట్రేలియాపైనే విరాట్ కు అత్యుత్తమ రికార్డు ఉంది. దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియా అతనికి ఎలా అడ్డుకట్ట వేస్తుందన్నది చూడాలి.
సంబంధిత కథనం