Pakistan Semifinal Hopes: సౌతాఫ్రికా చేతిలో ఇండియా ఓడితే పాకిస్థాన్‌ ఇంటికే!-pakistan semifinal hopes are now in the hands of india as the team want us to beat south africa ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pakistan Semifinal Hopes Are Now In The Hands Of India As The Team Want Us To Beat South Africa

Pakistan Semifinal Hopes: సౌతాఫ్రికా చేతిలో ఇండియా ఓడితే పాకిస్థాన్‌ ఇంటికే!

Hari Prasad S HT Telugu
Oct 28, 2022 12:44 PM IST

Pakistan Semifinal Hopes: సౌతాఫ్రికా చేతిలో ఇండియా ఓడితే పాకిస్థాన్‌ ఇంటికెళ్లిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిన పాక్‌.. ఇప్పుడు సెమీస్‌ చేరాలంటే తాను గెలవడంతోపాటు ఇతర టీమ్స్ వైపు ఆశగా చూడాల్సి ఉంది.

పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు ఇండియా చేతుల్లో..
పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు ఇండియా చేతుల్లో.. (PTI)

Pakistan Semifinal Hopes: టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో ఇండియా చేతుల్లో ఓడిపోయిన పాకిస్థాన్‌.. ఇప్పుడు అదే ఇండియన్‌ టీమ్‌ గెలవాలని ప్రార్థిస్తోంది. సౌతాఫ్రికాతో ఆదివారం (అక్టోబర్‌ 30) ఇండియా తన మూడో మ్యాచ్‌ ఆడనుంది. ఇందులో ఒకవేళ ఇండియా ఓడిపోతే మాత్రం పాకిస్థాన్‌ పనైపోయినట్లే.

ట్రెండింగ్ వార్తలు

అందుకే ఆ టీమ్‌ మన గెలుపు కోసం చూస్తోంది. ఇంతకీ పాకిస్థాన్‌కు ఇప్పటికీ సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉందా? సౌతాఫ్రికా చేతుల్లో ఇండియా ఓడిపోతే పాక్‌ టీమ్‌కు వచ్చే నష్టమేంటి? గ్రూప్‌ 2లో ఎవరి సెమీస్‌ అవకాశాలు ఎలా ఉన్నాయి?

ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే..

టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ చివరి బంతి వరకూ పోరాడినా ఓటమి తప్పలేదు. అయితే రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడటం ఇప్పుడా టీమ్‌ కొంప ముంచుతోంది. ఇప్పటి వరకూ గ్రూప్‌ 2లో పాయింట్ల ఖాతా తెరవని పాకిస్థాన్‌ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్ ఉన్నాయి.

ఇందులో సౌతాఫ్రికాతో మ్యాచ్‌ పాకిస్థాన్‌కు నిజంగా సవాలే. ఆ టీమ్‌పై గెలవడం అంత సులువు కాదు. ఒకవేళ మూడు మ్యాచ్‌లు గెలిచినా కూడా పాకిస్థాన్‌ గరిష్ఠంగా ఆరు పాయింట్లతో ఉంటుంది. ఇప్పుడు ఇండియా, సౌతాఫ్రికా, జింబాబ్వే టీమ్స్‌లో ఏవైనా రెండు టీమ్స్‌ తాము ఆడబోయే తర్వాతి మూడు మ్యాచ్‌లలో రెండు గెలిస్తే పాకిస్థాన్ ఇంటికెళ్లిపోవాల్సిందే.

ఒకవేళ పాకిస్థాన్‌ తాను ఆడబోయే మూడు మ్యాచ్‌లూ గెలిచి, పై మూడు టీమ్స్‌లో ఒక టీమ్‌ మాత్రమే రెండు గెలిస్తే అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఈ విషయంలో ఇండియా, సౌతాఫ్రికాల కంటే పాకిస్థాన్‌ చాలా వెనుకబడి ఉంది. అందుకే ఆదివారం మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఇండియా గెలవాలని పాకిస్థాన్‌ కోరుకుంటోంది. ఇదొక్కటే కాదు బంగ్లాదేశ్‌, జింబాబ్వేలను కూడా ఓడించి ఇండియా టాప్‌లో ఉండాలని పాక్‌ ప్రార్థించాల్సి ఉంటుంది.

అదే సమయంలో అటు జింబాబ్వే టీమ్‌ బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌లో కనీసం ఒక టీమ్‌ చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. సాంకేతికంగా చూస్తే పాకిస్థాన్‌ ఈ వరల్డ్‌కప్‌లో సెమీస్‌ అవకాశాలు ఇంకా ఉన్నాయి. అయితే అది అంత సులువైన పని మాత్రం కాదు. మిగతా టీమ్స్ గెలుపోటముల సంగతి తర్వాత కానీ.. పాక్‌ టీమ్‌ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై గెలవడం కూడా పెద్ద సవాలే.

గ్రూప్‌ 2లో ఇంకా మిగిలి ఉన్న మ్యాచ్‌లు

అక్టోబర్‌ 30 - బంగ్లాదేశ్‌ vs జింబాబ్వే, నెదర్లాండ్స్‌ vs పాకిస్థాన్‌, ఇండియా vs సౌతాఫ్రికా

నవంబర్‌ 2 - జింబాబ్వే vs నెదర్లాండ్స్‌, ఇండియా vs బంగ్లాదేశ్‌

నవంబర్‌ 3 - పాకిస్థాన్‌ vs సౌతాఫ్రికా

నవంబర్‌ 6 - సౌతాఫ్రికా vs నెదర్లాండ్స్‌, పాకిస్థాన్ vs బంగ్లాదేశ్‌, ఇండియా vs జింబాబ్వే

WhatsApp channel