Shoaib Akhtar on Team India: ఇండియా తీస్ మార్ ఖాన్ ఏమీ కాదు.. వాళ్లూ ఓడిపోతారు: అక్తర్
Shoaib Akhtar on Team India: ఇండియా తీస్ మార్ ఖాన్ ఏమీ కాదు.. వాళ్లూ ఓడిపోతారంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు. జింబాబ్వే చేతుల్లో పాక్ ఓడిన తర్వాత అతడీ కామెంట్స్ చేశాడు.
Shoaib Akhtar on Team India: టీ20 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే చేతుల్లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత ఆ టీమ్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ టీమ్‌తోపాటు ఇండియన్ టీమ్‌నూ శపిస్తూ కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ సూపర్ 12లోనే ఇంటిదారి పడితే.. ఇండియా సెమీఫైనల్లో ఓడిపోతుందని అక్తర్ అనడం గమనార్హం.
జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ ఓటమిని ఆ టీమ్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది చాలా అవమానకరం అంటూ వసీం అక్రమ్, షోయబ్ మాలిక్, వకార్ యూనిస్, మిస్బావుల్ హక్‌లాంటి మాజీ క్రికెటర్లంతా తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా అక్తర్ కూడా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ పాక్ బోర్డు పెద్దలు, మేనేజ్‌మెంట్, సెలక్టర్లు.. ఇలా ఎవరినీ వదిలి పెట్టలేదు. అదే సమయంలో ఇండియన్ టీమ్ కూడా అజేయమైనదేమీ కాదని అనడం విశేషం.
"నేను ఇంతకుముందే చెప్పాను పాకిస్థాన్ ఈ వారమే తిరిగి వచ్చేస్తుందని. ఇక ఇండియా వచ్చే వారం సెమీఫైనల్ ఆడిన తర్వాత వచ్చేస్తుంది. వాళ్లేమీ తీస్ మార్ ఖాన్ కాదు. కాకపోతే మేము మరింత దారుణం" అని అక్తర్ అన్నాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన ఇండియా, ఆ తర్వాత నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి గ్రూప్ 2లో టాప్‌లో ఉంది. అక్తర్ అన్నట్లు జింబాబ్వే చేతుల్లో ఓడిన తర్వాత పాకిస్థాన్ సెమీస్ ఆశలు మరింత సన్నగిల్లాయి.
"ఈ స్థాయిలో విజయాలు సాధించాలంటే ఈ మిడిలార్డర్ సరికాదని నేను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. ఇంకా ఏం చెప్పాలి? పాకిస్థాన్‌కు ఓ చెత్త కెప్టెన్ ఉన్నాడు. రెండో గేమ్‌లోనే పాకిస్థాన్ వరల్డ్‌కప్ నుంచి బయటకు వచ్చేసింది. జింబాబ్వేతో ఓడిపోయింది. బాబర్‌ను మూడోస్థానంలో రమ్మని చెప్పాను. వినలేదు. షహీన్ అఫ్రిది ఫిట్‌నెస్‌లో లోపం ఉంది. కెప్టెన్సీలో లోపం ఉంది" అని అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పీసీబీ ఛైర్మన్‌కు మెదడు లేదు: అక్తర్
ఇక పాక్ క్రికెట్ బోర్డు పెద్దలనూ అక్తర్ వదల్లేదు. వాళ్లకు మెదడు లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. "మీరు ఎలాంటి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నారు? మీరు మరీ జింబాబ్వే చేతుల్లో ఓడిపోయారు. మీ క్రికెట్ పతనమవుతోందని అర్థం కావడం లేదా? మేనేజ్‌మెంట్‌కి, పీసీబీ ఛైర్మన్‌కు మెదడు లేదు. మనం నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఆడించాలి. ముగ్గురినే ఆడిస్తున్నారు. మంచి మిడిలార్డర్ కావాలి. కానీ మీరు ఇంకేదో ఎంపిక చేస్తున్నారు" అని అక్తర్ మండిపడ్డాడు.
ఇక ఫకర్ జమాన్ స్థానంలో షాన్ మసూద్‌ను ఆడించడంపై కూడా అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. "30 గజాల సర్కిల్‌ను ఉపయోగించుకోవడానికి ఇద్దరు మంచి ఓపెనర్లు కావాలి. ఫకర్ జమాన్ అక్కడే ఉన్నాడు. అతన్ని ఉపయోగించుకోలేదు. అతడు బ్యాక్‌ఫుట్ ప్లేయర్. ఆస్ట్రేలియాలో ఆడగలడు.
ఇది చాలా అవమానకరంగా ఉంది. చివరికి మీడియాను ఎదుర్కొనేది మీరు కాదు మేము. మేము ఇండియాలో కూర్చొని మాట్లాడాలి. ప్రపంచానికి సమాధానాలు ఇవ్వాలి. ఇప్పుడు మేమేం సమాధానం చెప్పాలి? ప్లాన్ లేదు. మిడిలార్డర్ లేదు. ఓపెనర్లు లేరు. జింబాబ్వే లెంత్ బాల్స్ వేస్తే గెలుస్తుందని చెప్పాను. నాకు ఈ టీమ్‌పై నమ్మకం లేదు" అని అక్తర్ స్పష్టం చేశాడు.