Pakistan vs Zimbabwe T20 World Cup: పసికూనను తక్కువ అంచనా వేసిన పాక్.. ఒక్క పరుగు తేడాతో జింబాబ్వేపై ఓటమి
Pakistan vs Zimbabwe T20 World Cup: పెర్త్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది. పసికూనతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో పాక్ ఓటమి పాలైంది. ఫలితంగా ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూసింది.
Pakistan vs Zimbabwe T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇప్పటికే చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్.. తాజాగా పసికూన జింబాబ్వే చేతిలో కంగుతింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేనే విజయం వరించింది. నాటకీయపరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ ఈ టోర్నీలో రెండో పరాజయాన్ని చవిచూసింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. పాక్ బ్యాటర్ షాన్ మసూద్(44) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమైన వేళ.. జింబాబ్వే వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకుని విజయతీరాలకు చేరింది. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రజా మూడు వికెట్లతో విజృంభించగా.. మరో బౌలర్ బ్రాడ్ ఇవాన్స్ ఆకట్టుకున్నాడు.
131 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆది నుంచి నిలకడగా సాగిన వారి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బాబర్ ఆజం(4) ఔట్‌తో డీలా పడింది. జింబాబ్వే బౌలర్ బ్రాడ్ ఇవాన్స్.. బాబర్‌ను ఔట్ చేయడంతో పాక్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఓవర్లోనే కాసేపటికే ప్రమాదకర బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్(14) కూడా ముజరాబాని బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ కాసేపటికే ఇఫ్తికార్ అహ్మద్(5) కూడా జాంగ్వే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 36కే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది పాక్.
ఇలాంటి సమయంలో వన్డౌన్ బ్యాటర్ షాన్ మసూద్ పాకిస్థాన్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో బ్యాటర్ షాదాబ్ ఖాన్(17)తో కలిసి 52 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. క్రీజులో నిలవడానికి ప్రాధాన్యమిచ్చిన అతడు నిలకడగా రాణించాడు. స్కోరు బోర్డు నిలకడగా సాగుతుందనుకున్న తరుణంలో షాదాబ్‌ను ఔట్ చేసిన రజా.. ఆ తర్వాతి బంతికి ప్రమాదకర హైదర్ అలీని(0) కూడా ఎల్బీగా వెనక్కి పంపించాడు. ఆ కాసేపటికే షాదాబ్ ఖాన్‌ను కూడా ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.88/3 స్కోరుతో పటిష్ఠ స్థితిలో ఉన్న పాక్.. అప్పటి నుంచి ఇబ్బందుల్లో పడింది.
నాటకీయంగా ఆఖరు ఓవర్..
షాదాబ్ ఔటైన తర్వాతి వికెట్ కాపాడుకునే ప్రయత్నంలో పాక్ ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. చివర ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. క్రీజులో మహమ్మద్ నవాజ్(22), మహమ్మద్ వసీం(12) ఉన్నారు. బ్రాడ్ ఇవాన్స్ వేసిన ఆ ఓవర్ తొలిబంతికే నవాజ్ బౌండరీ దిశగా కొట్టగా ఫీల్డర్ అడ్డుగించడంతో 3 పరుగులు లభించాయి. అనంతరం రెండో బంతిని వసీం ఫోర్ కొట్టాడు. ఇంకేముంది మ్యాచ్ పాక్ వైపు మళ్లిందనే అందరూ అనుకున్నారు. చివరి నాలుగు బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా.. తదుపరి బంతికి సింగిల్ వచ్చింది. మూడు బంతుల్లో మూడు పరుగులు అవసరమైన సమయంలో తర్వాత బాల్ ఎలాంటి పరుగులు రాలేదు. ఫలితం 2 బంతుల్లో 3 పరుగులుగా మారింది. ఐదో బంతికి నవాజ్ ఎర్విన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. షాహిన్ అఫ్రిదీ(1) రెండు పరుగులకు ప్రయత్నించి సింగిల్ మాత్రమే తీసి రనౌట్ అవుతాడు. దీంతో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ చివరకు విజయం పసికూన జింబాబ్వేనే వరించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్(31) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీం జూనియర్ 4 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ 3 వికెట్లతో రాణించాడు. అయితే స్వల్ప లక్ష్యాన్నే నిర్దేశించినప్పటికీ చివరి వరకు పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది జింబాబ్వే.
సంబంధిత కథనం