Wasim Akram: వన్డే క్రికెట్‌ను మొత్తం రద్దు చేయాలి: వసీం అక్రమ్‌ సంచలన వ్యాఖ్యలు-one day cricket should be scrapped says wasim akram ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wasim Akram: వన్డే క్రికెట్‌ను మొత్తం రద్దు చేయాలి: వసీం అక్రమ్‌ సంచలన వ్యాఖ్యలు

Wasim Akram: వన్డే క్రికెట్‌ను మొత్తం రద్దు చేయాలి: వసీం అక్రమ్‌ సంచలన వ్యాఖ్యలు

Hari Prasad S HT Telugu
Jul 21, 2022 02:25 PM IST

Wasim Akram: ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వన్డే క్రికెట్‌కు అనూహ్యంగా గుడ్‌బై చెప్పిన తర్వాత ఈ ఫార్మాట్‌పై మరోసారి చర్చ మొదలైంది. అయితే తాజాగా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ చేసిన కామెంట్స్‌ సంచలనం రేపుతున్నాయి.

వన్డే క్రికెట్ బోర్ కొడుతోందంటున్న వసీం అక్రమ్
వన్డే క్రికెట్ బోర్ కొడుతోందంటున్న వసీం అక్రమ్ (BCCI Twitter)

న్యూఢిల్లీ: వన్డే క్రికెట్‌పై మరోసారి సీరియస్‌ చర్చ మొదలైంది. బెన్‌ స్టోక్స్‌ రిటైర్మెంట్‌తో చాలా మంది మాజీ క్రికెటర్లు బిజీ షెడ్యూల్‌పై స్పందించారు. రవిశాస్త్రిలాంటి వాళ్లు కొందరు ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేయాలని సూచించారు. అయితే తాజాగా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ మాత్రం మొత్తానికి వన్డే ఫార్మాట్‌నే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తుండటం గమనార్హం.

వసీం అక్రమ్‌ తన కెరీర్‌లో 356 వన్డేలు ఆడటంతోపాటు 1992 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్‌లో సభ్యుడు కావడం విశేషం. అంతేకాదు ఈ ఫార్మాట్‌లో మురళీధరన్‌ తర్వాత అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌ అతడు. అలాంటి వ్యక్తి చేసిన ఈ కామెంట్స్‌ ఆసక్తి రేపుతున్నాయి. వన్డే క్రికెట్‌ సాగదీసినట్లుగా కనిపిస్తోందని అతడు అంటున్నాడు. టెలిగ్రాఫ్‌కు చెందిన వానీ అండ్‌ టఫర్స్‌ క్రికెట్‌ క్లబ్‌ పాడ్‌కాస్ట్‌లో అక్రమ్‌ ఈ కామెంట్స్‌ చేశాడు.

"ఓ కామెంటేటర్‌గా కూడా ఇప్పుడు వన్డే క్రికెట్‌ అంటే సాగదీసినట్లే అనిపిస్తోంది. ముఖ్యంగా టీ20లు వచ్చిన తర్వాత. టీ20 చాలా ఈజీగా కేవలం నాలుగు గంటల్లోనే ముగిసిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా లీగ్స్‌ జరుగుతున్నాయి. చాలా డబ్బు కూడా వస్తోంది. ఆధునిక క్రికెట్‌లో ఇది సహజమే. టీ20 లేదంటే టెస్ట్‌ క్రికెట్‌. వన్డే క్రికెట్‌ అంతమవుతోంది. వన్డే క్రికెట్‌ ఆడటం ప్లేయర్‌కు చాలా అలసటగా అనిపిస్తోంది. టీ20ల తర్వాత వన్డేలు రోజుల తరబడి సాగుతున్న ఫీలింగ్‌ కలుగుతోంది. అందుకే ప్లేయర్స్‌ చిన్న ఫార్మాట్ల వైపు చూస్తున్నారు. లాంగర్‌ ఫార్మాట్‌ అంటే టెస్ట్‌ క్రికెటే" అని వసీం అక్రమ్‌ అన్నాడు.

బెన్‌ స్టోక్స్‌ వన్డే క్రికెట్‌ నుంచి రిటైరవడం బాధగా ఉన్నా.. అతనితో తాను ఏకీభవిస్తున్నట్లు అక్రమ్‌ చెప్పాడు. మరి వన్డేలను మొత్తంగా రద్దు చేయాలా అని అడిగితే.. "అదే అనుకుంటున్నాను. ఇంగ్లండ్‌లో వన్డేలకు కూడా స్టేడియాలు ఫుల్‌ అవుతాయి. కానీ ఇండియా, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికాలలో వన్డే క్రికెట్‌కు స్టేడియాలు నింపడం కష్టం. ఏదో ఆడుతున్నామంటే ఆడుతున్నాం అన్నట్లుగా ప్లేయర్స్‌ వన్డే క్రికెట్‌ ఆడుతున్నారు" అని అక్రమ్‌ అనడం విశేషం.

తన వరకూ టెస్ట్‌ క్రికెటే అత్యుత్తమమని అన్నాడు. "టెస్ట్‌ క్రికెట్‌లోనే మజా ఉంటుంది. నేను టెస్ట్‌లు ఆడటానికే మొగ్గు చూపేవాడిని. వన్డేలు సరదాగా అనిపించినా ఓ ప్లేయర్‌గా మీకు గుర్తింపు వచ్చేది టెస్టులతోనే. డబ్బు ముఖ్యమే అయినా క్రికెట్‌లో గ్రేటెస్ట్‌ ప్లేయర్స్‌గా గుర్తింపు పొందాలంటే టెస్ట్‌ క్రికెటే సరైనది" అని అక్రమ్‌ స్పష్టం చేశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం