Neeraj Chopra Diamond League Final: నీరజ్ చోప్రా కొత్త చరిత్ర.. డైమండ్‌ లీగ్‌ టైటిల్ సొంతం-neeraj chopra creates history by winning the diamond league title ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Neeraj Chopra Diamond League Final: నీరజ్ చోప్రా కొత్త చరిత్ర.. డైమండ్‌ లీగ్‌ టైటిల్ సొంతం

Neeraj Chopra Diamond League Final: నీరజ్ చోప్రా కొత్త చరిత్ర.. డైమండ్‌ లీగ్‌ టైటిల్ సొంతం

Hari Prasad S HT Telugu
Sep 09, 2022 09:38 AM IST

Neeraj Chopra Diamond League Final: నీరజ్ చోప్రా కొత్త చరిత్ర సృష్టించాడు. డైమండ్‌ లీగ్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచి ఇప్పటి వరకూ ఏ ఇండియన్‌ అథ్లెట్‌కూ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు.

తిరుగులేని నీరజ్ చోప్రా
తిరుగులేని నీరజ్ చోప్రా (AP)

Neeraj Chopra Diamond League Final: ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వేదికలపై ఈ బళ్లెం వీరుడి జోరు కొనసాగుతూనే ఉంది. డైమండ్‌ లీగ్‌ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్‌ జావెలిన్‌ త్రోయర్‌గా నిలిచాడు. అంతకుముందు అసలు డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు క్వాలిఫై అయిన తొలి భారతీయుడిగా నిలిచిన అతడు.. ఇప్పుడు ఏకంగా టైటిల్‌ గెలిచి ఆశ్చర్యపరిచాడు.

నీరజ్‌ చోప్రా.. ఫేవరెట్స్‌కు షాకిచ్చిన హీరో

గురువారం రాత్రి జరిగిన జ్యూరిక్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో జావెలిన్‌ను 88.44 మీటర్ల దూరం విసిరి నీరజ్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. తన రెండో ప్రయత్నంలో నీరజ్‌ జావెలిన్‌ను ఇంత దూరం విసిరాడు. నిజానికి ఫైనల్స్‌లో నీరజ్‌ తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఫౌల్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే రెండో ప్రయత్నంలో తన నాలుగో వ్యక్తిగత బెస్ట్‌ అయిన 88.44 మీటర్ల దూరం సాధించాడు.

ఆ తర్వాతి ప్రయత్నాల్లో ఇంత కన్నా తక్కువ దూరాలతోనే సరిపెట్టుకున్నా.. టైటిల్‌ సాధించడానికి ఇదే సరిపోయింది. ఫైనల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నీరజ్‌ చోప్రా.. ఇతర ఫేవరెట్స్‌, తన ప్రధాన ప్రత్యర్థులకు షాకిచ్చాడు. నీరజ్‌ ప్రధాన ప్రత్యర్థి, ఒలింపిక్స్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ అయిన జాకబ్‌ వాద్లెచ్‌ తన నాలుగో ప్రయత్నంలో 86.94 మీటర్ల దూరం విసిరాడు. అయితే నీరజ్‌ను మాత్రం అధిగమించలేకపోయాడు.

నీరజ్‌ చోప్రా.. గాయం నుంచి కోలుకొని..

కామన్వెల్త్‌ గేమ్స్‌ కంటే ముందు గాయంతో దూరమైన నీరజ్‌ చోప్రా నెల రోజుల పాటు ఈవెంట్స్‌కు దూరంగా అన్నాడు. అయితే గత నెలలో లాసానె డైమండ్‌ లీగ్‌ సిరీస్‌లో 89.08 మీటర్ల విసిరి జ్యూరిక్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. అప్పుడే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా అతడు నిలిచాడు. ఇక ఫైనల్స్‌లో తొలి ప్రయత్నం ఫౌల్‌ కాగా.. రెండో ప్రయత్నంలో విసిరిన 88.44 మీటర్ల త్రోనే అతనికి టైటిల్‌ సాధించి పెట్టింది.

ఇక మూడో ప్రయత్నంలోనూ నీరజ్‌ 88 మీటర్ల దూరం విసిరాడు. కాంపిటిషన్‌ ముగిసిన తర్వాత ఇది రెండో బెస్ట్‌గా నిలవడం విశేషం. నీరజ్‌ తన నాలుగో ప్రయత్నంలో 86.11, ఐదో ప్రయత్నంలో 87, ఆరో ప్రయత్నంలో 83.6 మాటర్ల దూరం విసిరాడు. వాద్లెచ్‌ 86.94 మీటర్లతో రెండోస్థానంలో నిలవగా.. జర్మనీకి చెందిన జూలియన్‌ వెబర్‌ 83.73 మీటర్లతో మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు.

WhatsApp channel

టాపిక్