Mini IPL: సౌతాఫ్రికా లీగ్‌లోనూ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల హవా.. టీమ్స్‌ అన్నీ వాళ్లవే-mini ipl in south africa as ipl franchises grab all the teams says a report ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Mini Ipl In South Africa As Ipl Franchises Grab All The Teams Says A Report

Mini IPL: సౌతాఫ్రికా లీగ్‌లోనూ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల హవా.. టీమ్స్‌ అన్నీ వాళ్లవే

Hari Prasad S HT Telugu
Jul 19, 2022 02:51 PM IST

Mini IPL: వచ్చే ఏడాది జరగబోయే సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఓ మినీ ఐపీఎల్‌ కానుంది. ఎందుకో తెలుసా ఆ లీగ్‌లోని టీమ్స్‌ అన్నింటినీ కొనుగోలు చేసింది మన ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలే కావడం విశేషం.

సౌతాఫ్రికాలోనూ ఐపీఎల్ ను పోలిన లీగ్
సౌతాఫ్రికాలోనూ ఐపీఎల్ ను పోలిన లీగ్

కేప్‌టౌన్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ ప్రపంచానికి ఓ కొత్త దారిని చూపించింది. ఈ మెగా లీగ్‌ను చూసి ప్రతి క్రికెట్‌ దేశం తమ సొంత లీగ్‌ను ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే కరీబియన్‌ దీవులతోపాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌.. తమ తమ లీగ్‌లు నడిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సౌతాఫ్రికా కూడా ఈ లిస్ట్‌లో చేరడానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌ జరగనుంది.

అయితే అక్కడ కూడా ఐపీఎల్‌ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవిధంగా అది మినీ ఐపీఎల్‌ కానుంది. క్రిక్‌బజ్‌లో వచ్చిన రిపోర్ట్‌ ప్రకారం.. ఆ లీగ్‌లో అందుబాటులో ఉన్న ఆరు టీమ్స్‌ను మన ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలే దక్కించుకున్నాయి. ఈ నెల 13తో టీమ్స్‌ కోసం బిడ్డింగ్‌లు పూర్తయ్యాయి. మొత్తం 29 ఎక్స్‌ప్రెషన్స్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌లు వచ్చినా.. అందులో అత్యధిక మొత్తం మన ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల నుంచే వచ్చినట్లు సమాచారం.

టీమ్స్‌ దక్కించుకున్నది వీళ్లే

ముంబై ఇండియన్స్‌ ఓనర్‌ ముకేశ్‌ అంబానీ, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓనర్‌ ఎన్‌ శ్రీనివాసన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓనర్‌ పార్థ్‌ జిందాల్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్‌ మారన్‌, లక్నో టీమ్‌ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా, రాజస్థాన్‌ రాయల్స్‌ ఓనర్‌ మనోజ్‌ బడాలే అక్కడ అందుబాటులో ఉన్న ఆరు టీమ్స్‌ను సొంతం చేసుకున్నట్లు క్రిక్‌బజ్‌ తన రిపోర్ట్‌లో వెల్లడించింది.

ప్రస్తుతానికి క్రికెట్‌ సౌతాఫ్రికా నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నెలాఖరులోగా బిడ్లు గెలిచిన వాళ్ల పేర్లు ప్రకటించనున్నారు. అయితే ఇప్పటికే ఈ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు బిడ్లు గెలిచినట్లుగా సమాచారం అందినట్లు తెలుస్తోంది. అంతేకాదు వాళ్లను తమకు కావాల్సిన నగరాలను ఎంపిక చేసుకోవాలని కూడా క్రికెట్‌ సౌతాఫ్రికా అడిగినట్లు సమాచారం.

ఎవరికి ఏ సిటీ?

క్రిక్‌బజ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ముంబై ఇండియన్స్‌ టీమ్‌ సౌతాఫ్రికాలో కేప్‌టౌన్‌ను సొంతం చేసుకుంది. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతికి జోహన్నెస్‌బర్గ్‌ దక్కింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓనర్‌ జిందాల్‌.. ప్రిటోరియాలోని సెంచూరియన్‌ ఫ్రాంఛైజీని దక్కించుకున్నట్లు సమాచారం.

లక్నో టీమ్‌ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా డర్బన్‌ ఫ్రాంఛైజీ వైపు మొగ్గు చూపుతున్నారు. మిగిలిన రెండు టీమ్స్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్లయిన మారన్లు.. పోర్ట్‌ ఎలిజబెత్‌ను, రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌ పార్ల్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

WhatsApp channel