Virat Kohli Rested: విరాట్‌ కోహ్లికి రెస్ట్‌.. సౌతాఫ్రికాతో మూడో టీ20 ఆడకుండానే ఇంటికి..-kohli rested from final t20i against south africa ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Kohli Rested From Final T20i Against South Africa

Virat Kohli Rested: విరాట్‌ కోహ్లికి రెస్ట్‌.. సౌతాఫ్రికాతో మూడో టీ20 ఆడకుండానే ఇంటికి..

Hari Prasad S HT Telugu
Oct 03, 2022 05:44 PM IST

Virat Kohli Rested: విరాట్‌ కోహ్లికి రెస్ట్‌ ఇచ్చారు. దీంతో సౌతాఫ్రికాతో మూడో టీ20 ఆడకుండానే అతడు ఇంటికెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి వెల్లడించారు.

సౌతాఫ్రికాతో చివరి టీ20కి దూరం కానున్న విరాట్ కోహ్లి
సౌతాఫ్రికాతో చివరి టీ20కి దూరం కానున్న విరాట్ కోహ్లి (AFP)

Virat Kohli Rested: సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఇండియా గెలిచిన విషయం తెలుసు కదా. ఆదివారం గౌహతిలో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో 2-0 లీడ్‌ సాధించింది. దీంతో పెద్దగా ప్రాధాన్యం లేని మూడో టీ20కి స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి రెస్ట్‌ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

దీంతో అతడు సోమవారం ఉదయమే గౌహతి నుంచి నేరుగా ముంబై వెళ్లిపోయాడు. మిగిలిన టీమ్‌ మూడో టీ20 కోసం ఇండోర్‌ వెళ్లింది. ఈ మ్యాచ్‌ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. మంగళవారం (అక్టోబర్‌ 4) ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఇండోర్‌లో చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈమ్యాచ్‌కు కోహ్లి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌కు తుది జట్టులో చోటు దక్కనుంది.

అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఈ నెల 6న ఇండియన్ టీమ్‌ ఆస్ట్రేలియా వెళ్లనుంది. మంగళవారం ఇండోర్‌లో మ్యాచ్‌ ముగిసిన తర్వాత వరల్డ్‌కప్‌ టీమ్‌లోని సభ్యులు అక్టోబర్‌ 6న ముంబై నుంచి బయలుదేరనున్నారు. విరాట్‌ కోహ్లి అదే రోజు నేరుగా ముంబైలోని టీమ్‌తో చేరనున్నాడు. రెండో టీ20లో కోహ్లి 28 బాల్స్‌లోనే 49 రన్స్‌ చేసి అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.

చివరి ఓవర్లో హాఫ్‌ సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. దినేష్‌ కార్తీక్‌కే పూర్తిగా స్ట్రైక్‌ ఇచ్చి బౌండరీలు బాదాల్సిందిగా కోహ్లి చెబుతున్న వీడియో వైరల్‌ అయింది. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన ఇండియా 237 రన్స్‌ చేయగా.. చేజింగ్‌లో సౌతాఫ్రికా 221 రన్స్‌ దగ్గర ఆగిపోయింది. 16 రన్స్‌ గెలిచి ఊపిరి పీల్చుకున్న టీమిండియా.. సిరీస్‌ను సొంతం చేసుకుంది.

ఆసియాకప్‌కు ముందు వెస్టిండీస్‌ టూర్‌కు చివరిసారి విరాట్‌ కోహ్లికి రెస్ట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న విరాట్‌కు రెస్ట్‌ ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. అయితే ఆసియా కప్‌లో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. అక్కడి నుంచి చెలరేగుతున్నాడు. 10 ఇన్నింగ్స్‌లో 141 స్ట్రైక్‌రేట్‌తో 404 రన్స్‌ చేశాడు. అందులో మూడు హాఫ్‌ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.

WhatsApp channel