Bumrah Replacement: బుమ్రాను ఆ పేసర్‌తో భర్తీ చేసిన ముంబయి.. పంత్ స్థానంలో యువ కీపర్‌కు దిల్లీ ఛాన్స్-mumbai indians announce jasprit bumrah replacement
Telugu News  /  Sports  /  Mumbai Indians Announce Jasprit Bumrah Replacement
బుమ్రా స్థానంలో సందీప్ వారియర్ ఎంపిక
బుమ్రా స్థానంలో సందీప్ వారియర్ ఎంపిక

Bumrah Replacement: బుమ్రాను ఆ పేసర్‌తో భర్తీ చేసిన ముంబయి.. పంత్ స్థానంలో యువ కీపర్‌కు దిల్లీ ఛాన్స్

31 March 2023, 17:14 ISTMaragani Govardhan
31 March 2023, 17:14 IST

Bumrah Replacement: జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమవడంతో ముంబయి ఇండియన్స్ జట్టు అతడి స్థానంలో తమిళనాడు పేసర్‌కు అవకాశం కల్పించింది. అలాగే దిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్‌గా అభిషేక్ పోరెల్‌ను ఎంపిక చేసింది.

Bumrah Replacement: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా ఈ టోర్నీతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అతడు దూరం కానున్నాడు. దీంతో ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు బుమ్రా స్థానాన్ని ఓ దేశవాళీ పేసర్‌తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడు ఫాస్ట్ బౌలర్ సందీప్ వారియర్‌ను బుమ్రా స్థానంలో తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2023 మొత్తానికి దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో సందీప్ వారియర్‌ను తీసుకుంది ముంబయి. గతేడాది జరిగిన రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున సందీప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 6 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్‌లో ముంబయి దృష్టిని ఆకర్షించాడు. అతడి కనీస ధర రూ.50 లక్షలకు ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది. తన కెరీర్‌లో ఓ టీ20 మ్యాచ్, 5 ఐపీఎల్ మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు సందీప్. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 68 టీ20ల్లో 62 వికెట్లు తీశాడు.

ఇదే సమయంలో దిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా రిషభ్ పంత్ స్థానంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్‌ను భర్తీ చేసింది. పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్‌ను తీసుకుంది. ఇప్పటికే కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను నియమించిన దిల్లీ.. తాజాగా వికెట్ కీపర్‌ను భర్తీ చేసింది. అభిషేక్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బెంగాల్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను దిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడి కనీస ధర రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. గతేడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అభిషేక్ బరోడా తరఫున 695 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఓ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు అభిషేక్.