IPL 2023 CSK vs GT: నేటి నుంచి ఐపీఎల్ సమరం షురూ - గుజరాత్, చెన్నైలలో బోణీ చేసేది ఎవరో?
IPL 2023 CSK vs GT: ఐపీఎల్ 2023 సమరం శుక్రవారం (నేటి) నుంచి మొదలుకానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌లో బోణీ చేసేది ఎవరన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
IPL 2023 CSK vs GT: క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరోసారి ఐపీఎల్ సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్... చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. సమ ఉజ్జీల మధ్య తొలి మ్యాచ్ జరగనుండటంతో బోణీ ఎవరు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
గత కొంతకాలంగా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. శుభ్‌మన్ గిల్, రాహుల్ తెవాతియా లాంటి హిట్టర్లతో గుజరాత్ బలంగా ఉంది. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తోన్నాయి. వికెట్ కీపర్‌లలో భరత్‌తో పోలిస్తే ఐపీఎల్‌లో మంచి రికార్డ్ ఉన్న వృద్ధిమన్ సాహనే ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్ పరంగా షమీ, అల్జరీ జోసెఫ్‌లతో పాటు ఎవరికి స్థానం దక్కుతుందన్నది చూడాల్సిందే.
మరోవైపు చెన్నైఎక్కువగా ఆల్‌రౌండర్లతో నిండిపోయింది. డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబాటి రాయుడు, మోయిన్ అలీ, స్టోక్స్ లాంటి యువ, సీనియర్ ఆటగాళ్లతో చెన్నై బలంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో అదరగొట్టిన జడేజా నుంచి గుజరాత్‌కు ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా కెప్టెన్ ధోనీ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తమన్నా, రష్మిక మందన్న
తొలి మ్యాచ్‌కు గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఐపీఎల్ ఆరంభ వేడుకలు మొదలుకానున్నాయి. ఈ వేడుకల్లో తమన్నా, రష్మిక మందన్నతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ డ్యాన్స్‌లతో అభిమానులను అలరించబోతున్నారు.
సింగర్ ఆర్జిత్ సింగ్ కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నాడు. అంతే కాకుండా డ్రోన్స్ సహాయంతో ఐపీఎల్ చిహ్నం ఆకాశంలో కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నట్లు సమాచారం.