KL Rahul Replacement: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాహుల్ స్థానంలో సాహా ఆడించాలి.. భారత మాజీ పేసర్ స్పష్టం-bcci urged to name saha for wtc final replacement for kl rahul ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul Replacement: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాహుల్ స్థానంలో సాహా ఆడించాలి.. భారత మాజీ పేసర్ స్పష్టం

KL Rahul Replacement: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాహుల్ స్థానంలో సాహా ఆడించాలి.. భారత మాజీ పేసర్ స్పష్టం

Maragani Govardhan HT Telugu
May 07, 2023 08:33 PM IST

KL Rahul Replacement: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో కేఎల్ రాహుల్ స్థానంలో వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేయాలనే వాదనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాహుల్ గాయంతో దూరమైన తరుణంలో సాహాను ఆడించాలని పలువురు మాజీలతో పాటు నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.

వృద్ధిమాన్ సాహా
వృద్ధిమాన్ సాహా

గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఆదివారం నాడు లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో అర్ధ సెంచరీతో చెలరేగిన సాహాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న సాహాను మళ్లీ టెస్టు జట్టులోకి తీసుకోవాలనే పిలుపులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఐపీఎల్ సహా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు దూరమైన తరుణంలో అతడి స్థానంలో సాహాను భర్తీ చేయాలని భారత మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ అభిప్రాయపడ్డారు.

ట్విటర్ వేదికగా తన స్పందన తెలియజేసిన గణేష్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాహుల్ స్థానంలో సాహాను ఆడించాలని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా పలువురు నెటిజన్లు, క్రీడాభిమానులు కూడా ఇదే విధంగా స్పందిస్తున్నారు. సాహా ప్రస్తుతం ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడుతున్నాడని, కాబట్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‍‌లో ఆడించాలని అంటున్నారు.

లండన్ ఓవల్ వేదికగా వచ్చే నెల 7 నుంచి 11 వరకు ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతుంది భారత్. ఈ మ్యాచ్‌కు సాహాకు ఇప్పటికే అజింక్య రహానేను ఎంపిక చేశారు సెలక్టర్లు. అలాగే రెగ్యూలర్ వికెట్ కీపర్ రాహుల్ గాయపడగా.. కేఎస్ భరత్ ప్రత్యామ్నాయంగా ఉన్నాడు. అయితే ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడు పెద్దగా రాణించలేదు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సాహాను తీసుకోవాలనే వాదనలు పెరుగుతున్నాయి.

ఆదివారం నాడు లక్నోతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సాహా.. 43 బంతుల్లోనే 81 పరుగులతో అదరగొట్టాడు. అంతేకాకుండా 20 బంతుల్లోనే అర్ధశతకంతో సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా శుభ్‌మన్ గిల్‌‌తో కలిసి 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది ఈ జోడీ. గుజరాత్ నిర్దేశించిన 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక లక్నో పరాజయం పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులే చేసింది. క్వింటన్ డికాక్(70), కైల్ మేయర్స్(48) మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ భారీ లక్ష్య ఛేదనలో మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో ఓటమి చెందింది.

WhatsApp channel