Haris Rauf on Kohli sixes: ఆ సిక్స్‌లు కొట్టింది కోహ్లి కాబట్టి బాధ లేదు.. అతని రేంజే వేరు కదా: రవూఫ్‌-haris rauf on kohli sixes says he would have hurt if those were hit by karthik or hardik ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Haris Rauf On Kohli Sixes Says He Would Have Hurt If Those Were Hit By Karthik Or Hardik

Haris Rauf on Kohli sixes: ఆ సిక్స్‌లు కొట్టింది కోహ్లి కాబట్టి బాధ లేదు.. అతని రేంజే వేరు కదా: రవూఫ్‌

Hari Prasad S HT Telugu
Dec 01, 2022 11:58 AM IST

Haris Rauf on Kohli sixes: ఆ సిక్స్‌లు కొట్టింది కోహ్లి కాబట్టి బాధ లేదని, అదే కార్తీక్‌ లేదా హార్దిక్‌ కొట్టి ఉంటే బాధపడేవాడినని పాకిస్థాన్‌ బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ అనడం విశేషం. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 19వ ఓవర్‌ చివరి రెండు బాల్స్‌కు విరాట్‌ సిక్స్‌లు బాదిన విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (Getty Images)

Haris Rauf on Kohli sixes: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఎవరూ అంత త్వరగా మరచిపోరు. ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి పోరాటాన్నీ మరవలేము. అసాధ్యమనుకున్న మ్యాచ్‌లో టీమిండియాను అతడు ఒంటిచేత్తో గెలిపించిన తీరు అద్భుతం. అందులోనూ ఎంతో ఒత్తిడిలో 19వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్స్‌లు మలచిన తీరు అత్యుద్భుతం.

ట్రెండింగ్ వార్తలు

అప్పటి వరకూ చాలా బాగా బౌలింగ్‌ చేసిన హారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో ఈ రెండు సిక్స్‌లు కొట్టడంతో పాక్‌ ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింది. ఇక ఈ రెండింట్లో మొదటిది నేరుగా బౌలర్‌ తలపై నుంచి కొట్టిన షాట్‌ అయితే టోర్నీకే హైలైట్‌. ఆ మ్యాచ్‌లో విరాట్‌ 53 బాల్స్‌లో 82 రన్స్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా రెండు సిక్స్‌ల గురించి రవూఫ్‌ స్పందించాడు.

"వరల్డ్‌కప్‌లో కోహ్లి ఆడిన తీరు చూస్తే అదీ అతని క్లాస్‌ అనిపిస్తుంది. అతడు ఆడే షాట్లు ఎలాంటివో మనకు తెలుసు. అతడు కొట్టిన ఆ రెండు సిక్స్‌లు చూస్తే.. నా బౌలింగ్‌లో మరే ఇతర ప్లేయర్‌ అలాంటి షాట్లు కొట్టలేడు. అదే దినేష్‌ కార్తీక్‌ లేదంటే హార్దిక్‌ పాండ్యా ఆ సిక్స్‌లు కొట్టి ఉంటే బాధపడేవాడిని. కానీ కోహ్లి కొట్టాడు కాబట్టి సరే. అతని క్లాస్‌, రేంజ్‌ వేరు" అని రవూఫ్‌ అనడం గమనార్హం.

ఆ మ్యాచ్‌లో ఇండియా గెలవాలంటే చివరి 12 బాల్స్‌లో 31 రన్స్‌ అవసరమయ్యాయి. ఈ పరిస్థితుల్లో రవూఫ్‌ బాల్‌ అందుకున్నాడు. మొదటి నాలుగు బాల్స్‌ అద్భుతంగా వేసి కేవలం 3 రన్స్ ఇచ్చాడు. ఇక పాక్‌ గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో చివరి రెండు బాల్స్‌ను కోహ్లి సిక్సర్లుగా మలిచాడు. ఇవే మ్యాచ్‌ను మలుపు తిప్పాయి.

తాను ఆ సమయంలో కోహ్లికి అలాంటి బాల్‌ ఎందుకు వేయాల్సి వచ్చిందో కూడా రవూఫ్‌ వివరించాడు. "చివరి ఓవర్‌ నవాజ్‌ వేయాల్సి ఉండటంతో కనీసం 20కిపైగా రన్స్‌ అయినా ఉండాలని అనుకున్నాను. నేను 4 బాల్స్‌లోనే 3 రన్స్‌ ఇవ్వడంతో చివరి 8 బాల్స్‌కు 28 రన్స్‌ అవసరమయ్యాయి.

అప్పటికే మూడు స్లో బాల్స్‌ వేశాను. అందుకే కోహ్లిని బోల్తా కొట్టించాలంటే బ్యాక్‌ ఆఫ్‌ లెంత్‌ స్లో బాల్‌ బెటరనుకొని అలాగే వేశాను. కానీ ఆ లెంత్‌లోనూ కోహ్లి సిక్స్‌ కొడతాడని ఊహించలేదు. అదీ అతని క్లాస్. నా ప్లాన్‌, దానిని అమలు చేయడం సరిగ్గానే ఉన్నా.. ఆ షాట్‌ రేంజ్‌ అలాంటిది" అని విరాట్‌ను ఆకాశానికెత్తాడు రవూఫ్‌.

WhatsApp channel