IND vs PAK T20 World Cup: విరాట్ కోహ్లి సూప‌ర్ ఇన్నింగ్స్ - పాకిస్థాన్‌ను ఓడించిన టీమ్ ఇండియా-t20 world cup ind vs pak india beat pakistan by four wickets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  T20 World Cup Ind Vs Pak India Beat Pakistan By Four Wickets

IND vs PAK T20 World Cup: విరాట్ కోహ్లి సూప‌ర్ ఇన్నింగ్స్ - పాకిస్థాన్‌ను ఓడించిన టీమ్ ఇండియా

Nelki Naresh Kumar HT Telugu
Oct 23, 2022 05:32 PM IST

IND vs PAK T20 World Cup: ఆదివారం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా నాలుగు వికెట్ల‌ తేడాతో విజ‌యాన్ని సాధించింది. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య సూప‌ర్ బ్యాటింగ్‌తో టీమ్ ఇండియాను గెలిపించారు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

IND vs PAK T20 World Cup: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సూప‌ర్ 12 రౌండ్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా అద్భుత విజ‌యాన్ని అందుకున్న‌ది. నాలుగు వికెట్ల తేడాతో సూప‌ర్ విక్ట‌రీని సొంతం చేసుకున్న‌ది. ఈ మ్యాచ్‌లో 30 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ టీమ్ ఇండియాను విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య స‌మ‌యోచిత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. విరాట్ కోహ్లి 53 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు, ఆరు ఫోర్ల‌తో 82 ర‌న్స్ చేయ‌గా పాండ్య 40 ప‌రుగులు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు న‌ష్ట‌పోయి 159 ర‌న్స్ చేసింది.హార్దిక్ పాండ్య‌, అర్ష‌దీప్‌సింగ్ త‌లో మూడు వికెట్ల‌తో రాణించారు. 160 టార్గెట్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌తో మొద‌లుపెట్టిన టీమ్ ఇండియా ఆదిలోనే షాక్ త‌గిలింది. రెండో ఓవ‌ర్‌లోనే ఓపెన‌ర్ కె.ఎల్ రాహుల్ ఔట‌య్యాడు. రాహుల్ 4 ర‌న్స్ చేశాడు. రోహిత్ శ‌ర్మ కూడా విఫ‌ల‌మ‌య్యాడు.

సూప‌ర్ ఫామ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ రెండు ఫోర్లు కొట్టి జోరుమీద క‌నిపించాడు. కానీ అత‌డిని హ‌రీస్ రౌఫ్ ఔట్‌చేశాడు. ఆ త‌ర్వాత అక్ష‌ర్ ప‌టేల్ కూడా త‌క్కువ స్కోరుకే ఔట్ కావ‌డంతో 31 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా క‌ష్టాల్లో ప‌డింది. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య క‌లిసి ఇండియా ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో చెల‌రేగారు.

ఈ క్ర‌మంలో విరాట్ కోహ్లి 43 బాల్స్‌లో హాఫ్ సెంచ‌రీ పూర్తిచేసుకున్నాడు. చివ‌ర‌లో మూడు ఓవ‌ర్ల‌లో 48 ర‌న్స్ చేయాల్సిరావ‌డంతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెల‌కొంది. షాహిన్ అఫ్రీది వేసిన 18వ ఓవ‌ర్‌లో కోహ్లి రెండు ఫోర్లు, పాండ్య ఓ ఫోర్ కొట్ట‌డంతో 17 ర‌న్స్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో 75 బాల్స్‌లో 100 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని పూర్తిచేసుకున్నారు కోహ్లి, పాండ్య‌.

19వ ఓవ‌ర్ హ‌రీస్ రౌఫ్ క‌ట్టుదిట్ట‌గా వేయ‌డంతో తొలి మూడు బంతుల‌కు కోహ్లి, పాండ్య సింగిల్స్ మాత్ర‌మే తీశారు. నాలుగో , ఐదో బంతుల్లో కోహ్లి వ‌రుస‌గా రెండు సిక్స‌ర్లు కొట్ట‌డంతో ఆ ఓవ‌ర్‌లో 15 ర‌న్స్ వ‌చ్చాయి. చివ‌రి ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా తొలి బంతికే పాండ్య ఔట్ కావ‌డంతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెల‌కొంది.

36 బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు ఒక ఫోర్‌తో పాండ్య 40 ర‌న్స్ చేశాడు. రెండో బంతికి సింగిల్‌, మూడో బాల్‌కు 2 ర‌న్స్ వ‌చ్చాయి. నాలుగో బాల్‌ను కోహ్లి సిక్స్ కొట్టాడు. అది నో బాల్‌గా తేల‌డంతో ఇండియా ల‌క్ష్యం మూడు బాల్స్‌లో ఏడు ప‌రుగులుగా మారింది. త‌ర్వాతి బాల్‌కు మూడు ర‌న్స్ వ‌చ్చాయి.

రెండు బాల్స్‌లో 2 ర‌న్స్ చేయాల్సి ఉన్న త‌రుణంలో కార్తిక్ ఔట్ కావ‌డంతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెల‌కొంది. త‌ర్వాత బాల్‌ను న‌వాజ్ వైడ్ వేయ‌డంతో స్కోర్ స‌మ‌మైంది. చివ‌రి బాల్‌కు అశ్విన్ ఫోర్ కొట్టాడు. విరాట్ కోహ్లి 53 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు, ఆరు ఫోర్ల‌తో 82 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో న‌వాజ్, రౌఫ్ త‌లో రెండు వికెట్లు తీశారు.

WhatsApp channel