Australia vs England: రూఫ్‌ ఉన్న స్టేడియం ఉంది కదా.. ఎందుకు వాడరు: నిర్వాహకులపై మైకేల్‌ వాన్‌ సీరియస్‌-australia vs england in t20 world cup as michael vaughan asks why do not you use roof at mcg ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Australia Vs England In T20 World Cup As Michael Vaughan Asks Why Do Not You Use Roof At Mcg

Australia vs England: రూఫ్‌ ఉన్న స్టేడియం ఉంది కదా.. ఎందుకు వాడరు: నిర్వాహకులపై మైకేల్‌ వాన్‌ సీరియస్‌

Hari Prasad S HT Telugu
Oct 28, 2022 02:41 PM IST

Australia vs England: మెల్‌బోర్న్‌ లో రూఫ్‌ ఉన్న స్టేడియం ఉంది కదా.. ఎందుకు వాడరు అంటూ టీ20 వరల్డ్‌కప్‌ నిర్వాహకులపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సీరియస్‌ అయ్యాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడటంపై అతడు ఇలా స్పందించాడు.

వర్షం కారణంగా బురదగా మారిన మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్
వర్షం కారణంగా బురదగా మారిన మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (AFP)

Australia vs England: టీ20 వరల్డ్‌కప్‌ను వర్షం వెంటాడుతూనే ఉన్న విషయం తెలుసు కదా. కీలకమైన మ్యాచ్‌లు వర్షం కారణంగా పూర్తిగా రద్దవడం లేదంటే ఫలితాలు తారుమారు కావడం జరుగుతున్నాయి. శుక్రవారం (అక్టోబర్‌ 28) మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)లో జరగాల్సిన ఆఫ్ఘనిస్థాన్‌, ఐర్లాండ్‌ మ్యాచ్ పూర్తిగా రద్దయింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ కూడా ఆ తర్వాత రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ తీవ్రంగా స్పందించాడు. మెల్‌బోర్న్‌ లో రూఫ్‌ ఉన్న మరో స్టేడియం ఉంది కదా ఎందుకు వాడరు అని మొదట ట్వీట్‌ చేశాడు. "ఆస్ట్రేలియాలో ఇది వర్షాకాలం. మెల్‌బోర్న్‌ లో రూఫ్‌ ఉన్న మరో స్టేడియం ఉంది. దానిని ఈ సమయంలో ఉపయోగిస్తే మంచిదే కదా" అని వాన్‌ మొదట ట్వీట్ చేశాడు. ఇక రెండు గంటల తర్వాత మరో ట్వీట్‌లో ఎంసీజీని ఎందుకు పూర్తిగా కప్పి ఉంచలేదని ప్రశ్నించాడు.

"శ్రీలంకలో భారీ వర్షాలు కురిసిన సమయంలో గ్రౌండంతా కప్పి ఉంచుతారు. తర్వాత మ్యాచ్‌ను త్వరగా ప్రారంభించగలుగుతారు. మరి ఎంసీజీలో మాత్రం గత రెండు రోజులుగా గ్రౌండ్‌ మొత్తాన్ని ఎందుకు కప్పి ఉంచలేదు" అని వాన్‌ ప్రశ్నించాడు. వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య మ్యాచ్‌ చాలా కీలకం కానుంది. ఈ రెండు టీమ్స్‌కు ఈ మ్యాచ్‌ జరగడం చాలా ముఖ్యం.

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతుల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ చేతుల్లో షాకింగ్‌ ఓటమితో ఇంగ్లండ్‌.. ఇప్పుడు ప్రతి మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడం రెండు జట్ల సెమీస్‌ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. నిజానికి శుక్రవారం మెల్‌బోర్న్‌లో 75 నుంచి 95 శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నదని అక్కడి వాతావరణ శాఖ ముందు నుంచే హెచ్చరిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో మెల్‌బోర్న్‌ లో రూఫ్‌ ఉన్న మరో స్టేడియం (డాక్ లాండ్స్) ఉన్నా కూడా ఎందుకు ఉపయోగించుకోరు అని మైకేల్‌ వాన్‌ ప్రశ్నిస్తున్నాడు. అంతేకాకుండా రెండు రోజులుగా గ్రౌండ్‌ మొత్తం కప్పి ఉంటే వర్షం ఆగిపోగానే త్వరగా మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించే వీలుంటుందన్నది అతని వాదన. అలా చేయకపోవడాన్ని కూడా వాన్‌ ప్రశ్నించాడు.

WhatsApp channel