Aus vs SL: స్టాయినిస్‌ విధ్వంసం.. శ్రీలంకను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా-aus vs sl in t20 world cup marcus stoinis 17 ball fifty gives australia a big win over sri lanka ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Aus Vs Sl In T20 World Cup Marcus Stoinis 17 Ball Fifty Gives Australia A Big Win Over Sri Lanka

Aus vs SL: స్టాయినిస్‌ విధ్వంసం.. శ్రీలంకను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

Hari Prasad S HT Telugu
Oct 25, 2022 08:28 PM IST

Aus vs SL: స్టాయినిస్‌ విధ్వంసం సృష్టించడంతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతుల్లో ఓటమి తర్వాత కచ్చితంగా భారీ విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో ఆసీస్‌ను గెలిపించాడు స్టాయినిస్‌.

పెర్త్ లో సునామీ సృష్టించిన స్టాయినిస్
పెర్త్ లో సునామీ సృష్టించిన స్టాయినిస్ (AFP)

Aus vs SL: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ విశ్వరూపం చూపించాడు. శ్రీలంక బౌలర్లను ఉతికారేస్తూ టీ20 వరల్డ్‌కప్‌లో సునామీ సృష్టించాడు. అతడు కేవలం 18 బాల్స్‌లోనే 59 రన్స్‌ చేయడంతో శ్రీలంకను 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడించింది. లంక విధించిన 158 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేజ్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

చేజింగ్‌ను ఆస్ట్రేలియా మామూలుగానే మొదలుపెట్టింది. ఐదో ఓవర్‌లోనే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (11) ఔటయ్యాడు. ఆ తర్వాత మిచెల్‌ మార్ష్‌ (18), మ్యాక్స్‌వెల్‌ (23) కూడా పెద్దగా రాణించలేకపోయారు. అయితే ఇదంతా తుఫాను ముందు ఉండే ప్రశాంతత అని శ్రీలంక బౌలర్లు గ్రహించలేకపోయారు. 13వ ఓవర్‌లో క్రీజులో అడుగుపెట్టిన స్టాయినిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

మొత్తం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. వచ్చీ రాగానే 13వ ఓవర్లో ఒక ఫోర్‌, 14వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన అతడు.. హసరంగ వేసిన 15వ ఓవర్లో 6, 4, 6 కొట్టాడు. 16వ ఓవర్లో మూడు సిక్స్‌లతో చెలరేగాడు. ఈ క్రమంలో కేవలం 17 బాల్స్‌లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక 17వ ఓవర్‌ మూడో బంతికి సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

ఈ విజయంతో గ్రూప్‌ 1లో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే వాళ్ల నెట్‌ రన్‌రేట్‌ ఇంకా మైనస్‌లోనే ఉంది. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంకల తర్వాత ఆస్ట్రేలియా ఉంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఏకంగా 89 రన్స్‌తో ఓడిపోవడం ఆసీస్‌ను దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు స్టాయినిస్‌ విధ్వంసంతో శ్రీలంకపై మంచి విజయాన్నే సొంతం చేసుకున్నా.. తర్వాత ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, ఐర్లాండ్‌లపై కూడా ఇలాంటి ప్రదర్శనలే చేయాల్సి ఉంది. అయితే ఇంగ్లండ్ రూపంలో ఆస్ట్రేలియాకు మరో పెద్ద గండం పొంచే ఉంది.

అంతకుముందు శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ నిస్సంక 40 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. చివర్లో చరిత్‌ అసలంక 25 బాల్స్‌లోనే 38 రన్స్‌ చేయడంతో శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 రన్స్‌ చేసింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 9 వికెట్లతో గెలిచిన శ్రీలంక.. ఆస్ట్రేలియాపై ఓడటం వాళ్ల సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది.

WhatsApp channel