Ireland vs England: టీ20 వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. ఇంగ్లండ్‌కు ఐర్లాండ్‌ షాక్‌-ireland vs england in t20 world cup as title favorites england face defeat in hands of ireland ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ireland Vs England In T20 World Cup As Title Favorites England Face Defeat In Hands Of Ireland

Ireland vs England: టీ20 వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. ఇంగ్లండ్‌కు ఐర్లాండ్‌ షాక్‌

Hari Prasad S HT Telugu
Oct 26, 2022 02:41 PM IST

Ireland vs England: టీ20 వరల్డ్‌కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఈసారి టైటిల్‌ ఫేవరెట్లలో ఒకరిగా భావిస్తున్న ఇంగ్లండ్‌కు పసికూన ఐర్లాండ్‌ షాక్‌ ఇచ్చింది. దీంతో గ్రూప్‌ 1లో సెమీస్‌ పోరు రసవత్తరంగా మారింది.

ఇంగ్లండ్ ను మట్టి కరిపించిన తర్వాత ఐర్లాండ్ ప్లేయర్స్ సంబరాలు
ఇంగ్లండ్ ను మట్టి కరిపించిన తర్వాత ఐర్లాండ్ ప్లేయర్స్ సంబరాలు (AP)

Ireland vs England: ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌ సంచలనాల పరంపర కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో రెండుసార్లు ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను ఇంటిదారి పట్టించిన ఆ టీమ్‌.. తాజాగా ఫేవరెట్స్‌లో ఒకటైన ఇంగ్లండ్‌నే మట్టి కరిపించింది. బుధవారం (అక్టోబర్‌ 26) మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌ను 5 పరుగుల తేడాతో ఐర్లాండ్ చిత్తు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ముందుగానే ముగించారు. 158 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. వర్షం కారణంగా మ్యాచ్‌ను ముందుగానే ముగించే సమయానికి 14.3 ఓవర్లలో 5 వికెట్లకు 105 రన్స్‌ చేసింది. ఆ సమయానికి ఇంగ్లండ్‌ ఐదు పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాపార్డర్‌ విఫలమవడం ఆ టీమ్‌ కొంప ముంచింది.

ఓపెనర్‌, కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ డకౌట్ కాగా.. మరో ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ కేవలం 7 రన్స్‌ చేశాడు. బెన్‌ స్టోక్స్‌ (6), హ్యారీ బ్రూక్‌ (18) కూడా విఫలమయ్యారు. డేవిడ్‌ మలన్‌ (35) మాత్రమే కాస్త పోరాడాడు. మ్యాచ్‌ ముగిసే సమయానికి మొయిన్‌ అలీ 24, లివింగ్‌ స్టోన్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది.

ఈ సమయంలో మళ్లీ వర్షం కురిసి 15 నిమిషాల తర్వాత కూడా ఆగకపోవడంతో అంపైర్ల ఇక మ్యాచ్‌ను ఆపేశారు. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతుల్లో దారుణంగా ఓడిన ఐర్లాండ్‌.. ఈ మ్యాచ్‌లో సంచలన విజయంతో ఇంగ్లండ్‌ సెమీస్‌ అవకాశాలకు దెబ్బ కొట్టింది. ప్రస్తుతం గ్రూప్‌ 1లో ఇంగ్లండ్‌ 2 మ్యాచ్‌లలో ఒకటి గెలిచి, మరొకటి ఓడిపోయి 2 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది.

న్యూజిలాండ్‌ టాప్‌లో, శ్రీలంక రెండోస్థానంలో కొనసాగుతున్నాయి. మరో ఫేవరెట్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా నాలుగోస్థానంలో ఉంది. ఇప్పుడీ ఇద్దరి మధ్య మ్యాచ్‌ ఆసక్తి రేపుతోంది. వీళ్లలో విజేతకే సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్‌ శుక్రవారం జరగనుంది.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ఐర్లాండ్‌ మొదట బ్యాటింగ్ చేసి 19.2 ఓవర్లలో 157 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్‌ ఆండీ బాల్‌బిర్నీ 47 బాల్స్‌లో 62 రన్స్‌ చేసి టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. లోర్కాన్‌ టక్కర్‌ 34 రన్స్‌ చేశాడు.

WhatsApp channel