Afghanistan vs Ireland: టీ20 వరల్డ్‌కప్‌లో మరో మ్యాచ్ వర్షార్పణం
Afghanistan vs Ireland: టీ20 వరల్డ్‌కప్‌లో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఒక్క బాల్ కూడా పడకుండానే మెల్‌బోర్న్‌లో జరగాల్సిన ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ మ్యాచ్ రద్దయింది.
Afghanistan vs Ireland: టీ20 వరల్డ్‌కప్‌ను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. ముఖ్యంగా మెల్‌బోర్న్‌లో జరగాల్సిన మ్యాచ్‌లపై ఈ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా శుక్రవారం (అక్టోబర్ 28) ఆప్ఘనిస్థాన్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండానే రద్దు చేయాల్సి వచ్చింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో అంపైర్లకు మరో మార్గం లేకుండా పోయింది.
దీంతో ఆఫ్ఘన్, ఐర్లాండ్ టీమ్స్ చెరొక పాయింట్‌ను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ వరుసగా రెండో మ్యాచ్‌ను వర్షానికి కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతుల్లో ఓడిన ఆ టీమ్.. తర్వాత న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉండగా ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇప్పుడు మూడు మ్యాచ్‌లలో రెండు పాయింట్లతో ఆఫ్ఘన్ టీమ్ గ్రూప్ 1లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది.
అటు ఐర్లాండ్ ఏకంగా రెండోస్థానానికి దూసుకెళ్లడం విశేషం. ఆ టీమ్ ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంక చేతుల్లో తొలి మ్యాచ్‌లోనే ఓడినా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలవడం, ఈ మ్యాచ్ రద్దు కావడంతో మూడు పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. న్యూజిలాండ్ టాప్‌లో కొనసాగుతోంది. ఇక ఈ గ్రూప్‌లో చావోరేవో తేల్చుకోబోతున్నాయి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీమ్స్.
శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన వాళ్లు టోర్నీలో ముందడుగు వేస్తారు. ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇంగ్లండ్ నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉండటం ఆ టీమ్‌కు కాస్త కలిసొచ్చే విషయం. అందుకే డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ఓడితే దాదాపు టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోయినట్లే. అయితే ఈ మ్యాచ్ కూడా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లోనే జరగాల్సి ఉండటంతో.. వరుణుడు ఎంత వరకూ కరుణిస్తాడన్నది చూడాలి.