Sri Rama Navami 2023 । శ్రీరామ నవమి మంగళకరం.. రామ నామ స్మరణ శుభకరం!
Sri Rama Navami 2023: శ్రీరామ నవమి తిథి, పూజా ముహూర్తం సమయాలు, రామ నవమి రోజున పాటించే ఆచారాలు, జపించాల్సిన శక్తివంతమైన రామ మంత్రాలు ఇక్కడ తెలుసుకోండి
Sri Rama Navami 2023: హిందువులకు అత్యంత పవిత్రమైన పండగలలో శ్రీరామ నవమి ఒకటి. లోకకళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం సాక్షాత్ శ్రీ మహా విష్ణువే.. శ్రీరాముడిగా మానవరూపంలో అవతరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో, అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో జన్మించాడు. రాముని జన్మదినోత్సవం సందర్భంగా శ్రీరామ నవమిని జరుపుకుంటారు. పదునాలుగేళ్లు అరణ్యవాసం, రావణ సంహారం అనంతరం సీతాసమేతంగా అయోధ్య చేరిన శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడైనాడు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ ముహుర్తాన్నే జరిగిందని భక్తుల విశ్వాసము.
ట్రెండింగ్ వార్తలు
శ్రీరామ నవమి తిథి, పూజా ముహూర్తం సమయాలు, రామ నవమి రోజున పాటించే ఆచారాలు, జపించాల్సిన శక్తివంతమైన రామ మంత్రాలు ఇక్కడ తెలుసుకోండి.
శ్రీ రామ నవమి 2023 తిథి, పూజా ముహూర్తం సమయాలు
త్రేతాయుగంలో శ్రీ రాముడు చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు అని పురాణాలు తెలియజేశాయి. కాబట్టి, దృక్ పంచాంగ్ ప్రకారం, శ్రీరాముడు జన్మించిన తిథి ఈ సంవత్సరం మార్చి 30న ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 1:40 వరకు ఉంటుంది. ఈరోజుతో చైత్ర నవరాత్రులు కూడా ముగుస్తాయి. కాగా, నవమి తిథి మార్చి 29న రాత్రి 9:07 గంటలకు ప్రారంభమై మార్చి 30న రాత్రి 11:30 గంటలకు ముగుస్తుంది.
శ్రీరామ నవమి రోజున భక్తులు సీతారాములను, హనుమతుండిని భక్తి శ్రద్ధలతో పూజించాలి, రామ నామ జపం చేస్తూ ఆరాధించాలి. రామాయణ పఠనం గానీ, శ్రవణం గానీ చేయాలి. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం, రామనవమి వేడుకలలో పాల్గొనడం, అన్నదానం వంటివి చేయడం ద్వారా శుభాలు కలుగుతాయి.
Sri Rama Mantras- శక్తివంతమైన శ్రీ రామ మంత్రాలు
శ్రీరామ నవమి రోజున భక్తిభావంతో రామ నామ స్మరణ చేయండి, ఈరోజున ఈ శక్తివంతమైన రామ మంత్రాలు పఠించడం ఎంతో పుణ్యం.
1. రామ మూల మంత్రం
ఓం శ్రీ రామాయ నమః
2. రామ తారక మంత్రం
శ్రీరామ జయ రామ జయ జయ రామ
3. రామ గాయత్రీ మంత్రం
ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి,
తన్నో రామ ప్రచోదయాత్ |
4. రామ ధ్యాన మంత్రం
ఓం అపాదమపహర్తారం దాతారం సర్వసంపదమ్
లోకాభిరామం శ్రీరామం భూయో-భూయో నమామ్యహమ్ |
5. కోదండ రామ మంత్రం
శ్రీరామ జయ రామ కోదండ రామ॥
Sri Rama Shlokas - శ్రీరామ శ్లోకాలు
- విష్ణు సహస్రకానికి సూక్ష్మరూపంగా చెప్పే శ్లోకం
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం దక్కును
2. ఈ శ్లోకం క్రమం తప్పకుండా పఠించాలి
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల శ్రీరామునికి తృప్తి కలుగుతుంది.
3. విజయాన్ని చేకూర్చే శ్లోకం
ఓం క్లీం నమో భగవతే రామచంద్రాయ సకలజన వశ్యకరాయ స్వాహా
క్రమం తప్పకుండా ఈ శ్లోకం జపించడం వల్ల జీవితంలో విజయం, సంతోషం కలుగుతుంది.
మీకు, మీ కుటుంబ సభ్యులకు హిందుస్తాన్ టైమ్స్- తెలుగు తరఫున శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
సంబంధిత కథనం