Telugu News  /  Rasi Phalalu  /  Karthika Masam 2022 Special Story On Khseerabdhi Dwadashi
క్షీరాబ్ది ద్వాదశి 2022
క్షీరాబ్ది ద్వాదశి 2022

క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఇదే.. ఈరోజు అలా చేస్తే చాలా మంచిదట..

05 November 2022, 10:42 ISTGeddam Vijaya Madhuri
05 November 2022, 10:42 IST

Karthika Masam 2022 : అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినాన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. కార్తీకమాసంలో ఈరోజుకు ఎనలేని విశిష్టత ఉంది. కార్తీకమాసంలో ఇది అత్యంతం పవిత్రమైనదిగా చెప్తారు. అలాంటి క్షీరాబ్ధి ద్వాదశిరోజు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Karthika Masam 2022 : కార్తీకమాసంలో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి అని పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. నేడే కార్తీకమాసం శుక్లపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజునే అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినంగా చెప్తారు. ఇది పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని, యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ఈరోజు ప్రాచుర్యం పొందింది.

ట్రెండింగ్ వార్తలు

దేవదానవులు అమృతం కోసం చేపట్టిన క్షీరసాగర మథనం ఈ రోజునే ముగిసిందని పురాణం చెబుతోంది. సాగర మథనంలో హాలాహలం, కామధేనువు, కల్పవృక్షం, ఉచ్చెశ్రవం, ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్టదంతం, సార్వభౌమం, సుప్రతీకం అనే అష్టదిగ్గజాలు, కౌస్తుభమణి ఉద్భవించిన తరువాత శ్రీమహాలక్ష్మి అవతరించారు. దేవదానవులు అమృతం కోసం కలహిస్తుండగా శ్రీహరి జగన్మోహనిగా అవతరించి దానిని పంచాడు. అందుకే ఈరోజు ఆలయాల్లో స్వామిని మోహినీ రూపంలో అలంకరించి.. క్షీరసుగంధ ద్రవ్య మిళితమైన దానిని (అమృతం) ప్రసాదంగా పంచుతారు.

శ్రీమహాలక్ష్మిని హరి ఈ తిథినాడే పరిణయమాడారు. అప్పటి నుంచి ఏటా ఆ తిథి నాడు లక్ష్మీనారాయణుల కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జగజ్జననికి క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలాయకును నీరాజనం అని నీరాజం పట్టారు అన్నమాచార్య. పీఠాధిపతులు, పరివ్రాజకులు, యోగులు, మునులు చాతుర్మాస్యదీక్షను ఈ తిథి నాడే విరమిస్తారు కనుక 'యోగీశ్వర ద్వాదశి' అని, అత్యంత పుణ్యప్రదమైనది కావడంతో 'పావన ద్వాదశి' అని, శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతంగా బృందావనం చేరిన తిథి కాబట్టి 'బృందావన ద్వాదశి' అని కూడా దీనిని పిలుస్తారు.

ఈ ద్వాదశి పూజలను దేశంలోని వివిధ ప్రాంతాలలో ఒక్కొక్క విధంగా నిర్వహిస్తారు. తెలుగునాట ఆ రోజు సాయంకాలంవేళ తులసికోటలో కాయలతో కూడిన ఉసిరి కొమ్మను ఉంచి పూజిస్తారు. ఉసిరిని విష్ణు స్వరూపంగా, తులసిమొక్కను లక్ష్మీస్వరూపిణిగా భావించి పూజిస్తారు. ఉసిరి కొమ్మను తులసి మొక్క పక్కన ఉంచి దీపారాధన చేస్తారు. మహారాష్ట్రలో శ్రీకృష్ణ విగ్రహానికి, తులసి మొక్కకు పెళ్లి చేస్తారు. తులసి మొక్క మొదట్లో చెరకు ముక్క ఉంచి.. పసుపుతో తడిపిన వస్త్రాలు, గాజులు వంటివి తులసి మొక్కకు కడతారు. ఈ మాసంలో ప్రత్యేకించి శుద్ధ ద్వాదశినాడు అంబరీష గాథను పారాయణం చేయాలని పెద్దలు చెబుతారు.

దుర్వాసముని అంబరీషుడిపై రాక్షసుడిని ప్రయోగించగా అంబరీషుడు విష్ణువును ప్రార్థించడంతో.. ఆయన వదిలిన సుదర్శనం ఆ మునిని వెంటాడుతుంది. దాంతో శరణుకోరిన మునితో 'తానుసైతం చక్రాయుధాన్ని ఉపసంహరించలేన'ని హరి చెప్తాడు. ముని తరపున అంబరీషుడే ప్రార్థించడంతో సుదర్శనం శాంతిస్తుంది. భగవంతుడి కంటే ఆయన దివ్యాయుధుల కంటే భక్తి భావనే గొప్పదని చాటే ఈ గాథను ఏకాదశినాడు చోటు చేసుకుంది. అందుకే ఉపవాసదీక్ష మరునాడు అంబరీష కథను పారాయణం చేయాలని అంటారు. అలా ధ్యానం చేసినవారికి ఎలాంటి కష్టాలు కలగవని, విష్ణుసాయుజ్యం కలుగుతుందని దుర్వాసుడు వరమిస్తాడు.

తిరుమలలో కైశిక ద్వాదశి

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి క్షీరాబ్ది ద్వాదశి నాడు నిర్వహించే ఉత్సవాన్ని 'కైశిక ద్వాదశి ఆస్థాన' ఉత్సవం అంటారు. తిరుమలేశుడు మూలమూర్తిగా, మలయప్పస్వామిగా, భోగ, ఉగ్ర, కొలువు శ్రీనివాసమూర్తులుగా అర్చనలు అందుకుంటున్న సంగతి భక్తకోటికి విదితమే. ఎన్నడూ గర్బాలయం దాటి వెలుపలికి రాని ఉగ్ర శ్రీనివాస మూర్తి ఒక్క కైశిక ద్వాదశి నాడు మాత్రం సూర్యోదయానికి పూర్వమే (ఉదయం 4.30-5.30) గర్బాలయం నుంచి శ్రీదేవిభూదేవి సమేతంగా బయలుదేరి నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. తిరిగి ఆలయానికి చేరిన తరువాత ఆయనకు నైవేద్యం సమర్పించి, కైశిక ద్వాదశీ ఆస్థానం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయంలో స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

ద్వాదశి నాడు క్షీరాబ్ది వ్రతాన్ని ఆచరించి.. విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, తులసికి కల్యాణం చేస్తారు. 'కార్తీకే తులసీపత్రం విష్ణవే యోదదాతి చ గవామయుతదానస్య ఫలమాప్నోతి నిశ్చితమ్' (కార్తికంలో తులసితో విష్ణువును అర్చిస్తే, పదివేల ఆవుల దానం చేసిన పుణ్య ఫలం దక్కుతుంది) అని బ్రహ్మపురాణం చెబుతోంది. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణయమాడారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ