అక్రమంగా డబ్బు సంపాదిస్తే ఏమవుతుందో తెలుసా?-do you know what happens when you earn money illegally
Telugu News  /  Rasi Phalalu  /  Do You Know What Happens When You Earn Money Illegally?
అక్రమంగా సంపాదిస్తే జేబులో నిప్పులు పోసుకున్నట్టే (ప్రతీకాత్మక చిత్రం)
అక్రమంగా సంపాదిస్తే జేబులో నిప్పులు పోసుకున్నట్టే (ప్రతీకాత్మక చిత్రం) (PTI)

అక్రమంగా డబ్బు సంపాదిస్తే ఏమవుతుందో తెలుసా?

26 May 2023, 11:12 ISTHT Telugu Desk
26 May 2023, 11:12 IST

అక్రమంగా డబ్బు సంపాదిస్తే ఏమవుతుందో తెలుసా? ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వర రావు ఏమన్నారో చదవండి.

మన చుట్టూ చాలా మందిని చూస్తూ ఉంటాం. అక్రమ మార్గాల ద్వారా, మోసం చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. పైగా అలాంటి పనులు మనం చేయకపోతే చేత గాని వాడంటారు. నిజానికి అక్రమంగా, అవినీతితో డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు నిప్పులు తెచ్చి జేబులో వేసుకున్నట్టేనని ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. ‘అక్రమంగా చేసిన ఆర్జన కాల్చేస్తుంది. ధార్మికంగా నువ్వు తెచ్చుకున్న 4 రూపాయలు శాంతిగా ఉంచుతాయి. జీవితంలో సుఖం అన్న మాటకు అర్థం శాంతి మాత్రమే. సంతోషంగా ఉండడం అన్నదానికి నీ ఇంట్లో ఉన్న సాధన సంపత్తికి సంబంధం ఉండదు..’ అని వివరించారు.

సుఖం అంటే ఇదే

‘నులక మంచం వేసుకుని, మామిడి చెట్టు కింద పడుకుని తలకింద చేయి పెట్టుకుని గయోపాఖ్యానం చదువుకుంటూ, ఆకాశంలో పౌర్ణమి చంద్రుడిని చూడడంలోనే సంతోషం ఉంటుంది. ఆ పక్కనే ఉన్న ఆవుదూడను చూస్తుంటే, అది మధ్యమధ్యలో వచ్చి కాలును నాకుతుంటే ఎంత సంతోషం. ఏసీలో పడుకున్నా ఎక్కడ ఏ ఐటీ రైడ్స్ జరుగుతాయో అని హడలిపోయి నిద్ర పట్టని వాడితో పోలికా? దేని వల్ల శాంతి? మానసికంగా వచ్చేదే తప్ప.. భౌతికంగా ఉండే పరికరాల వల్ల వచ్చేది కాదు. అలా ఉంటే సంతోషంగా ఉంటారని అనుకోవడం తప్పు..’ అని చాగంటి ప్రవచించారు.

‘సంతోషం శాశ్వతత్వం పొందేది కేవలం ధార్మిక మార్గాల వల్లే. ఇవ్వాళ కొందరు ఐశ్వర్యవంతులు ఉన్నారు. వారి వెనక ఎవరు ఉంటారో తెలుసా? ధార్మిక మార్గంలో నడిచి, పేదరికంలో మగ్గి, అప్పుడు కూడా భగవత్ నామ స్మరణలో తరించిన వారుంటారు. వారి తండ్రి, పూర్వీకులు చేసిన పుణ్యం అది. వారు పడ్డ కష్టం అది. వారు అంత కష్టపడి తెచ్చిన ఆ ద్రవ్యంతో కోట్లకు పడగలెత్తేలా చేసింది. రాబోయే తరాలకు కూడా సంతోషం ఎక్కడ ఉంటుంది అంటే.. ధర్మం విస్మరించకుండా ద్రవ్యం సంపాదించడంలో ఉంటుంది..’ అని చాగంటి వివరించారు.

‘ఓ పెంకుటింట్లో ఉన్న తండ్రి తన పిల్లలతో కలిసి శివాలయం వెళ్లి దీపం వెలిగించి చంద్రశేఖరాష్టకం చదవడంలో ధర్మాచరణ ఉంటుంది. పరుపుల కింద, గోడల్లో డబ్బులు దాచిన వారు సుఖపడుతున్నారనుకోకండి. అవి అనుభవించేందుకు ఇంట్లో మనుషులు కూడా ఉండరు. తలగడ తడిచిపోయేంత కన్నీళ్లు తప్ప ఏవీ మిగలవు. జీవితంలో ఎంత ఎదిగినా నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలి. అలా చేస్తే వారి సంతానం ధార్మికంగా ఎదిగి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది..’ అని తన ప్రవచనంలో చెప్పారు.

‘ధర్మం ధర్మ ఫలాన్ని ఇస్తుంది. అధర్మం అధర్మ ఫలాన్ని ఇస్తుంది. అప్పుడు ఏడుస్తారు. అందువల్ల ఓర్పుతో ధర్మాన్ని ఆచరించాలి..’ అని ప్రవచించారు.

టాపిక్