Partha Chatterjee: కుట్రకు బలయ్యానన్న పార్థా ఛటర్జీ-sacked bengal minister partha chatterjee claims of being framed and victim of conspiracy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sacked Bengal Minister Partha Chatterjee Claims Of Being Framed And Victim Of Conspiracy

Partha Chatterjee: కుట్రకు బలయ్యానన్న పార్థా ఛటర్జీ

HT Telugu Desk HT Telugu
Jul 29, 2022 04:00 PM IST

Partha Chatterjee: తాను కుట్రకు బలయ్యానని బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ వ్యాఖ్యానించారు.

Partha Chatterjee and SSC scam case: కోల్‌కతాలో బీజేపీ మద్దతుదారుల నిరసన ర్యాలీ
Partha Chatterjee and SSC scam case: కోల్‌కతాలో బీజేపీ మద్దతుదారుల నిరసన ర్యాలీ (PTI)

కోల్‌కతా, జూలై 29: తనను కుట్రపూరితంగా ఇరికిస్తున్నారని పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ అన్నారు. మంత్రివర్గం నుంచి తొలగించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దర్యాప్తులో భాగంగా ఈడీ రూ. 50 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకుంది. ‘నన్ను ఇరికించారు. కుట్రకు బలయ్యాను..’ అని పార్థ ఛటర్జీ అన్నారు.

అరెస్టయిన బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ.. తృణమూల్ కాంగ్రెస్ నుండి కూడా సస్పెండయ్యారు. అతని స్నేహితురాలు అర్పితా ముఖర్జీ కూడా ‘కుట్రలో బాధితురాలిని..’ అని మరో సందర్భంలో పేర్కొన్నారు.

‘పార్థా ఛటర్జీని తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, జాతీయ ఉపాధ్యక్షుడు, మరో మూడు పదవుల నుంచి తొలగించాం. విచారణ జరిగే వరకు అతన్ని సస్పెండ్ చేస్తున్నాం..’ అని అభిషేక్ బెనర్జీ తెలిపారు.

టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ మరకలు అంటకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. పార్థా ఛటర్జీని గురువారం మంత్రి పదవి నుంచి తప్పించింది. వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

‘ఎవరైనా తప్పు చేస్తే తృణమూల్ కాంగ్రెస్ వారిని వదిలే ప్రసక్తే లేదు. అవినీతి విషయంలో సహనం చూపే పరిస్థితే ఉండదు. అవినీతిపై విచారణ జరిగే వరకు పార్థా ఛటర్జీ సస్పెన్షన్‌లో ఉంటారు..’ అని అభిషేక్ బెనర్జీ అన్నారు.

పార్థా ఛటర్జీ ముఖ్యమంత్రికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరుంది. ముఖ్యమంత్రి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తర్వాత పార్టీ శ్రేణిలో మూడో నేతగా పేరుంది.

శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తర్వాత పార్థా ఛటర్జీ మమతా బెనర్జీకి నాలుగుసార్లు కాల్ చేశారు. ఆమె అతని కాల్స్ తీసుకోలేదు.

ఈడీ విచారణలో స్పష్టమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్టీ తనను తాను రక్షించుకోవడానికి పార్థా ఛటర్జీని వదిలేశారని రాజకీయ పరిశీలకులు చెప్పారు.

టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఈడీ విచారణ వల్ల నష్టాలను తగ్గించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ ఎత్తుగడ వేస్తోందని వారు తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) కుంభకోణంలో పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శనివారం అరెస్టు చేసింది.

‘అవినీతిని సహించేది లేదు. అయితే దర్యాప్తు సంస్థ విచారణను గడువులోగా పూర్తి చేయాలి. శారద కేసులో కూడా ఏమీ జరగలేదు. ఇది కేవలం కాలయాపన మాత్రమే. కాలపరిమితితో కూడిన విచారణ జరగాలి..’ అని అభిషేక్ బెనర్జీ అన్నారు.

‘డబ్బు రికవరీ అయింది ఎవరి ఇంటి నుంచి? ఈ విషయంతో సంబంధం ఉన్న వారిపై మేం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నేను దీనిని ఊహాజనిత రీతిలో చెబుతున్నాను. పార్థా ఛటర్జీ బిజెపిలోకి వెళితే రెండు నెలల తర్వాత ఆయన క్లీన్ చీట్ అందుకుంటారు. ఆయన టీఎంసీలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి..’ అని అభిషేక్ బెనర్జీ అన్నారు.

భారీ మొత్తంలో డబ్బు రికవరీ అయ్యిందని అంగీకరించిన అభిషేక్ బెనర్జీ ‘ఈ విషయంలో ఏడు రోజుల్లోనే స్పందించిన ఏకైక పార్టీ టీఎంసీ’ అని అన్నారు.

38 టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నాయకుడు, నటుడు మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన మండిపడ్డారు.

‘మిథున్ చక్రవర్తికి బెంగాల్‌లో ఎన్ని అసెంబ్లీ సీట్లు, జిల్లాలు ఉన్నాయో కూడా తెలియదు. అతను పెద్ద నాయకుడిని అయ్యానని గొప్పగా చెప్పుకోవాలనుకుంటున్నాడు..’ అని అభిషేక్ బెనర్జీ అన్నారు.

మాజీ విద్యా మంత్రికి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన కోల్‌కతా నివాసం నుండి రూ. 21 కోట్ల నగదు, రూ. 1 కోటి విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పార్థా ఛటర్జీ అరెస్ట్ అయ్యారు. పార్థ ఛటర్జీని అరెస్టు చేసినప్పటి నుండి ఈడీ పలు చోట్ల నగదు, బంగారు నిల్వలు, ఇతర అక్రమాస్తులను గుర్తించింది.

అర్పితా ముఖర్జీకి సంబంధించిన ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున అధికారుల బృందం అర్పితా ముఖర్జీ న్యూ టౌన్ నివాసానికి చేరుకుంది.

పశ్చిమ బెంగాల్‌లోని న్యూ టౌన్‌లోని చినార్ పార్క్‌లోని రాయల్ రెసిడెన్సీ ఫ్లాట్‌లోని ఆమె నివాసానికి సెంట్రల్ ఫోర్స్ సిబ్బందితో కలిసి అధికారులు చేరుకున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఉదయం అర్పితా ముఖర్జీకి చెందిన బెల్ఘారియా నివాసం నుండి సుమారు రూ. 27.90 కోట్ల నగదు సీజ్ చేశారు.

అంతకుముందు నార్త్ 24 పరగణాస్‌లోని బెల్ఘరియా క్లబ్ టౌన్‌లోని ఆమె తల్లి ఫ్లాట్, మరో మూడు ప్రాంగణాలను ఈడీ తనిఖీ చేసింది. బెల్గోరియాలోని అర్పితా ముఖర్జీకి చెందిన రెండు ఫ్లాట్లలో ఒకదాన్ని ఈడీ సీల్ చేసింది.

బాలిగంజ్‌లోని వ్యాపారవేత్త మనోజ్ జైన్ నివాసంలో కూడా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. జైన్ పార్థా ఛటర్జీకి సహాయకుడు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఛటర్జీ 2014లో ఉన్నత విద్య, పాఠశాల విద్య శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2021 వరకు అదే మంత్రిత్వ శాఖలో ఉన్నారు.

IPL_Entry_Point