PM on Venkaiah Naidu: వెంకయ్య మాటలు.. పీడిత తాడిత వర్గాలకు ప్రేరణ: మోదీ-pm hails naidu s witty one lines as rs bids farewell to vice president ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm On Venkaiah Naidu: వెంకయ్య మాటలు.. పీడిత తాడిత వర్గాలకు ప్రేరణ: మోదీ

PM on Venkaiah Naidu: వెంకయ్య మాటలు.. పీడిత తాడిత వర్గాలకు ప్రేరణ: మోదీ

HT Telugu Desk HT Telugu
Aug 08, 2022 01:49 PM IST

ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగాలు పీడిత తాడిత వర్గాలకు ప్రేరణగా నిలిచాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాన మంత్రి ప్రసంగం సమయంలో ఒక దశలో వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు.

రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. వీడ్కోలు సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తున్న వేళ వెంకయ్య నాయుడి దరహాసం
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. వీడ్కోలు సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తున్న వేళ వెంకయ్య నాయుడి దరహాసం (PTI)

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరకు వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం సందర్భంగా రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగించారు.

‘భారతదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి స్వాతంత్య్ర భారతంలో పుట్టినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణం..’ అని పేర్కొన్నారు.

‘ఉపరాష్ట్రపతిగా మీరు చేసిన ప్రసంగాలు, మీరు మాట్లాడిన ప్రతి మాట యువతను, మహిళలను, సమాజంలోని పీడిత, తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి. ఈ ఐదేళ్లలో మీరు చేసిన ప్రసంగాల్లో సింహభాగం యువతను, యువ శక్తిని ఉద్దేశించి చేయడం ప్రేరణాత్మకం. మాటల మాంత్రికుడిగా మీరు ప్రయోగించే పదజాలం, ఏక వాక్య ప్రయోగాలు, ప్రేరణాత్మక వాక్య ప్రయోగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే..’ అని పేర్కొన్నారు.

‘మీ మార్గదర్శనంలో పనిచేసే అవకాశం నాకు దక్కింది. దీంతోపాటు సన్నిహితంగా మీతో కలిసి పనిచేసే అవకాశం కూడా నాకు దక్కింది. అందుకు గర్వపడుతున్నాను. దేశం పట్ల మీకున్న ప్రేమ, గౌరవాభిమానాలకు కృతజ్ఞుడిని..’ అని ప్రధాని అన్నారు.

‘పార్టీ, ప్రభుత్వం మీకు ఏయే బాధ్యతలను అప్పగించినా వాటిని ఎంతో చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వహించి.. నాలాంటి కార్యకర్తలందరికీ మీరు మార్గదర్శకంగా నిలిచారు..’ అని మోదీ ప్రశంసించారు. 

‘మాతృభాష పట్ల మీ అభిరుచి అభినందనీయం, ఆదర్శనీయం. దాదాపుగా మీరు మాట్లాడిన ప్రతి సందర్భంలో మాతృభాషను కాపాడుకోవడం, ప్రోత్సహించడంపై మీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. విద్యార్థి నాయకుడిగా మీరు ప్రారంభించిన ప్రస్థానం, మీ జీవితంలో సాధించిన మైలురాళ్లు చాలా ప్రత్యేకమైనవి. రాజకీయంగా కూడా మీ జీవనం పారదర్శకంగా సాగింది. ఎన్నో విలువలను నిజజీవితంలో అమలుచేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు..’ అని మోదీ అన్నారు.

రాజ్యసభ పనితీరు మెరుగైంది..

‘మీ హయాంలో రాజ్యసభ పనితీరు ఎంతగానో మెరుగుపడింది. సభ్యుల హాజరు గణనీయంగా పెరిగింది. మీ మార్గదర్శనంలో ఎన్నో బిల్లులు విజయవంతంగా ఆమోదమయ్యాయి. అంతేకాదు. రాజ్యసభ సచివాలయాన్ని, కాగిత రహిత వ్యవస్థను ప్రోత్సహించడం వంటి ఎన్నో కార్యక్రమాలకు మీరు బీజం వేశారు. ధర్మం, కర్తవ్యంతో మార్గదర్శనం చేశారు. సభాకార్యక్రమాల విషయంలో, సభలో సభ్యుల ప్రవర్తన, బాధ్యత తదితర విషయాల్లో మీ అనుభవాలను చెబుతూ.. ప్రేమగా హెచ్చరించినా.. మొట్టికాయలు వేసినా.. మార్గదర్శనం చేసినా అది మీకే చెల్లింది..’ అని మోదీ అన్నారు.

‘చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం అనే విషయంలో మీరు చేసిన మార్గదర్శనం మా అందరికీ స్ఫూర్తిదాయకం. అన్ని పార్టీల ఎంపీలకు సరైన అవకాశాలిస్తూ.. వారి అనుభవం సభకు ఎలా అవసరమో నిరంతరం చెబుతూ వచ్చారు. ఇవాళ అందరూ మీకు వీడ్కోలు చెప్పేందుకు సభకు హాజరవడం మీ పై ఉన్న గౌరవానికి సంకేతం. మీరు చూపిన బాట.. అనుసరించిన విధానాలు.. ఈ స్థానంలో కూర్చునేవారికి మార్గదర్శనం చేస్తాయి..’ అని అన్నారు.

‘మీరు దేశం కోసం, పార్లమెంటరీ వ్యవస్థకోసం చేసిన కృషికి, మార్గదర్శనానికి ప్రధానమంత్రిగా, పార్లమెంటు సభ్యులందరి తరపున ధన్యవాదాలు చెబుతున్నాను..’ అని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.

IPL_Entry_Point

టాపిక్