Video: “రూ.500 ఇచ్చి సభలకు ప్రజలు”: మాజీ సీఎంపై వీడియోతో బీజేపీ ఆరోపణలు-karnataka former chief minister siddaramaiah video went viral on social media bjp alleges offered money to people to attend rallies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Karnataka Former Chief Minister Siddaramaiah Video Went Viral On Social Media Bjp Alleges Offered Money To People To Attend Rallies

Video: “రూ.500 ఇచ్చి సభలకు ప్రజలు”: మాజీ సీఎంపై వీడియోతో బీజేపీ ఆరోపణలు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 03, 2023 07:59 AM IST

Siddaramaiah - Viral Video: సభకు ప్రజలను పిలిపించుకునేందుకు కాంగ్రెస్ డబ్బు పంచుతోందని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోను బీజేపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య (HT Photo)

Siddaramaiah - Viral Video: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) కు సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ప్రజలకు చెరో రూ.500 ఇచ్చి పార్టీ సభలకు తీసుకురావాలని నాయకులతో సిద్ధరామయ్య చెబుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో లీకై సోషల్ మీడియాలోకి రావటంతో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై కర్ణాటకలో రాజకీయ దుమారం మొదలైంది. అధికార భారతీయ జనతా పార్టీ (BJP) .. ఈ వీడియోను పోస్ట్ చేసి విమర్శలు చేసింది. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Siddaramaiah - Viral Video: ఈ వీడియో ఎప్పటిదో అన్న విషయంపై పూర్తి స్పష్టత లేదు. అయితే ఇటీవల బెళగావిలో సిద్దరామయ్య నిర్వహించిన ప్రజా ధ్వని బస్సు యాత్రలో ఇది జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జర్కిహోలీ, ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బల్కర్, ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోలీతో పాటు మరికొందరు ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది మేలోగా జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటికే కాంగ్రెస్ బస్సు యాత్ర చేస్తోంది.

ఇక ఈ వీడియోను బీజేపీ అస్త్రంగా చేసుకుంది. డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ నేతలు జనాలను పిలిపించుకుంటున్నారని.. కర్ణాటక బీజేపీ ఆరోపించింది. ఈ వీడియోను పాటు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ధనం పంచి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

మాకు ఆ అవసరం లేదు

Siddaramaiah - Viral Video: ఈ వీడియో, బీజేపీ ఆరోపణలపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. అది వాస్తవం కాదని అన్నారు. “ఇది నిజం కాదు. మేం ఎవరినీ ఆ విధంగా ప్రోత్సహించడం లేదు. మేం ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి పనులు మేం చేయం” అని శివకుమార్ అన్నారు.

“ఆశ్చర్యమేం లేదు”

ఈ వీడియోపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా స్పందించారు. “ప్రజలను రప్పించుకునేందుకు డబ్బులు పంచడం కాంగ్రెస్ సంప్రదాయం. ఇందులో కొత్తేం లేదు. ఆశ్చర్యపోయేందుకు ఏం లేదు. అది వారి సంప్రదాయం, ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. కాంగ్రెస్ ఇలాంటి పనులకు పాల్పడుతూనే ఉంటుంది.. కాకపోతే ఇప్పుడు బయటికి వచ్చింది” అని బొమ్మై అన్నారు.

Karnataka Assembly elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది మే నెలలోగా జరగాల్సి ఉంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. బీజేపీ అధికారం నిలుపుకునేందుకు పట్టుదలగా ఉంది. మళ్లీ పవర్‌లోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం కర్ణాటకపై ఫోకస్ చేసింది. ప్రచారం కూడా మొదలైపోయింది.

IPL_Entry_Point