Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది: ఒకే దశలో పోలింగ్: కీలక అంశాలు ఇవే-karnataka assembly election on may 10 counting on may 13 check full details of schedule ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Karnataka Assembly Election On May 10 Counting On May 13 Check Full Details Of Schedule

Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది: ఒకే దశలో పోలింగ్: కీలక అంశాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 29, 2023 12:36 PM IST

Karnataka Assembly Election Schedule: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‍ను ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇవే.

Karnataka Elections: కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది: ఒకే దశలో పోలింగ్ (Photo: HT Photo)
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది: ఒకే దశలో పోలింగ్ (Photo: HT Photo)

Karnataka Assembly Election Schedule: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెరలేచింది. కర్ణాటక ఎలక్షన్ షెడ్యూల్‍ను భారత ఎన్నికల సంఘం (Election Commission of India) బుధవారం ప్రకటించింది. ఢిల్లీలోని ఈసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) ఎన్నికల తేదీలను వెల్లడించారు. కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకు మే 10వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఏప్రిల్ 13వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. అధికార భారతీయ జనతా పార్టీ (BJP), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ (Congress) మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. ప్రాబల్యమున్న స్థానాల్లో సత్తాచాటి ప్రభుత్వ ఏర్పాటులో మళ్లీ కీలక పాత్ర పోషించాలని జేడీఎస్ (JDS) లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్‍తో పాటు మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే

Karnataka Assembly Election Schedule: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 13వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.

  • ఏప్రిల్ 13 - ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
  • ఏప్రిల్ 20 - నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ
  • ఏప్రిల్ 21 - నామినేషన్ల పరిశీలన
  • ఏప్రిల్ 24 - నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు
  • మే 10 - పోలింగ్
  • మే 13 - ఓట్ల లెక్కింపు

కర్ణాటక ఎన్నికల్లో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయాల్సి ఉందని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఇందులో మహిళా ఓటర్లు 2.59 కోట్లు ఉన్నారని చెప్పారు. ఇక, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. తొలిసారి ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని సీఈసీ చెప్పారు.

అధికారం చేతులు మారిందిలా..

Karnataka Assembly Elections: 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ చీఫ్ కుమార స్వామి.. సీఎం పీఠం ఎక్కారు. అయితే కొందరు రెబల్ ఎమ్మెల్యేను ఆకర్షించిన బీజేపీ.. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారును పడగొట్టి.. అధికారం చేపట్టింది. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‍కు 70, జేడీఎస్‍కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, 2021లో ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను తొలగించిన బీజేపీ అధిష్టానం.. బస్వరాజు బొమ్మైను సీఎంగా చేసింది. ప్రస్తుతం బొమ్మై సీఎంగా ఉన్నారు.

సీఎం అభ్యర్థి ఎవరు..!

Karnataka Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని వెల్లడించలేదు. మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం రేసులో ప్రధానంగా ఉన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇటీవలే 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ వెల్లడించింది. బీజేపీ హయాంలో రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, అన్ని విషయాల్లో ఆ పార్టీ విఫలమైందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని ప్రచారం చేస్తోంది.

బీజేపీ పెద్దల ఫోకస్

కాగా, ఇటీవలే ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్‍ను బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తొలగించింది. ఆ రిజర్వేషన్‍ను లింగాయత్‍లు, ఒక్కలిగళలు విభజించింది. ఈ నిర్ణయంపై చాలా విమర్శలు వస్తున్నాయి. అలాగే, ఇటీవల లంచం తీసుకున్న కేసులో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మడల్ విరూపాక్షప్ప అరెస్ట్ అయ్యారు. ఇది కూడా కాషాయ పార్టీకి ఇబ్బందిగా మారింది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత కూడా కషాయ దళంలో ఆందోళన పెంచుతోంది.

అయితే, కర్ణాటకపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ పెద్దలంతా దృష్టి సారించారు. ఇప్పటికే ఈ ఏడాది చాలాసార్లు కర్ణాటకలో పర్యటించారు మోదీ, అమిత్ షా. చాలా అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. మాండ్యలో మెగా రోడ్ షో కూడా నిర్వహించారు. ఇక నుంచి భారీగా ప్రచారం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

జేడీఎస్ మళ్లీ..

Karnataka Assembly Elections 2023: మరోవైపు, కుమార స్వామి నేతృత్వంలోని జనతా దళ్ సెక్యూలర్ (JDS) మరోసారి కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‍లకు అధికారం చేపట్టేందుకు కావాల్సిన సీట్లు రాకపోవచ్చని, దీంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ మళ్లీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు.

IPL_Entry_Point