monsoon: రైతులకు శుభవార్త.. ఈ ఏడాది సాధారణ వర్షపాతం-india expected to receive normal monsoon rains in 2022 imd says ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Expected To Receive Normal Monsoon Rains In 2022 Imd Says

monsoon: రైతులకు శుభవార్త.. ఈ ఏడాది సాధారణ వర్షపాతం

HT Telugu Desk HT Telugu
May 31, 2022 01:17 PM IST

నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మంచి వర్షాన్నిస్తాయని భారత వాతావరణ శాఖ తన రెండో విడత అంచనాలు ప్రకటించింది. ఇంతకుముందు ఇచ్చిన అంచనాలను పెంచుతూ దీర్ఘకాలిక సగటులో 103 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

రైతులకు చల్లని కబురు తెచ్చిన ఐఎండీ
రైతులకు చల్లని కబురు తెచ్చిన ఐఎండీ (PTI)

న్యూఢిల్లీ, మే 31: రాబోయే నాలుగు నెలల్లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల వర్షపాతం 50 ఏళ్ల దీర్ఘ కాల సగటులో 103%గా ఉంటుందని, ఇది సాధారణ వర్షపాతాన్ని సూచిస్తోందని  చెబుతూ భారత వాతావరణ శాఖ తన రెండవ దశను అంచనాలను వెల్లడించింది. ఏప్రిల్‌లో విడుదల చేసిన మొదటి దశ లాంగ్ రేంజ్ ఫోర్‌కాస్ట్ సమయంలో రుతుపవన వర్షపాతం లాంగ్ పీరియడ్ యావరేజీ(ఎల్‌పిఎ)లో 99%గా ఉంటుందని అంచనా వేసింది. లాంగ్ పీరియడ్ యావరేజ్ 1971 నుండి 2020 మధ్య కాలంలో 87 సెం.మీ.గా ఉంది. 

రుతుపవన వర్షపాతం మధ్య భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని భార వాతావరణ విభాగం తెలిపింది. ఇది లాంగ్ పీరియడ్ యావరేజీలో 106% పైగా ఉంది. దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో లాంగ్ పీరియడ్ యావరేజీలో 106% పైగా ఉంటుంది. అలాగే ఈశాన్య భారతదేశం, వాయువ్య భారతదేశంలో ఎల్పీయేలో 96 నుండి 106% మధ్య వర్షాలు పడొచ్చు.

ప్రధానంగా వర్షాధారంగా ఉన్న వ్యవసాయ ప్రాంతాలను కలిగి ఉన్న రుతుపవనాల కోర్ జోన్‌లో రుతుపవన వర్షపాతం కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

‘లా నినా పరిస్థితులు రుతుపవనాలు ముగిసే వరకు కొనసాగుతాయని అంచనాలు చూపిస్తున్నందున మేం రుతుపవన నెలలలో వర్షపాతం పరిమాణం అంచనాలు పెంచాం. లా నినా పరిస్థితులు సాధారణ వర్షాలకు దోహదపడుతాయి..’ అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం.మోహపాత్ర అన్నారు.

జూన్‌లో వర్షపాతం సాధారణంగా ఉంటుందని, లాంగ్ పీరియడ్ యావరేజీలో 92 నుండి 108% మధ్య ఉంటుందని ఐఎండీ తెలిపింది. వాయువ్య, మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, ఉత్తర ద్వీపకల్పం, తూర్పులోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా మే 29న ఆదివారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయి.

గత మూడేళ్లు సాధారణ వర్షపాతాన్ని ఇచ్చిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతాన్ని ఇస్తాయని ఐఎండీ తెచ్చిన ఈ చల్లని కబరు రైతులకు సంతోషాన్నిస్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్