IMF chief: వడ్డీ రేట్లు బాదండి.. దెబ్బకు ధరలు దిగిరావాలి.. ఐఎంఎఫ్ చీఫ్ సలహా
IMF chief: ధరలు సాధారణ స్థితికి చేరాలంటే వడ్డీ రేట్లు పెంచుతూ పోవాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా సెంట్రల్ బ్యాంకులకు బుధవారం సలహా ఇచ్చారు.
బెర్లిన్: ద్రవ్యోల్భణాన్ని సాధారణ స్థితికి తెచ్చే వరకూ వడ్డీ రేట్లు పెంచుతూ పోవాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ క్రిస్టాలినా సూచించారు. ధరలు ఇంకా తటస్థ స్థాయికి రాలేదని సెంట్రల్ బ్యాంకులకు సలహా ఇచ్చారు.
ట్రెండింగ్ వార్తలు
బెర్లిన్‌లో రాయిటర్స్ వార్తా సంస్థతో క్రిస్టాలినా మాట్లాడారు. గురువారం యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచబోతుందన్న అంచనాల మధ్య ఈ సలహా ఇచ్చారు. వడ్డీ రేట్ల పెంపు ద్వారా ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప్రభావం రావాలంటే 2024 వరకు ఆగాల్సి ఉంటుందని అన్నారు.
ద్రవ్యోల్భణం తటస్థ స్థాయికి చేరుకునేందుకు వడ్డీ రేట్లను పెంచాలని యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ యోచనగా ఉంది. ఈ చర్య వృద్ధిని నియంత్రించడం గానీ పెంచడం గానీ చేయదు. అయితే విధాన నిర్ణయాలు తీసుకునే వారు ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచడానికే మొగ్గు చూపుతున్నారు. యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచాలని అభిప్రాయపడుతున్నారు.
‘సాధారణ స్థాయికి చేరుకోవాలని చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో ఇంకా ఆ స్థితికి చేరుకోలేదు..’ అని జార్జీవా పేర్కొన్నారు.
‘ద్రవ్యోల్భణం అధిక స్థాయిలకు చేరినప్పుడు వృద్ధి మందగిస్తుంది. కానీ అధిక ద్రవ్యోల్భణం పేదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది..’ అని వ్యాఖ్యానించారు.
యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల వడ్డీ రేట్లు పెంచింది. ద్రవ్యోల్భణం యూరో జోన్‌లో సెప్టెంబరులో 9.9 శాతానికి పెరగడంతో సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఆహారం, ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి.
సెంట్రల్ బ్యాంకులు ఇంకా ఎంత కాలం వడ్డీ రేట్లు పెంచాలని భావిస్తున్నారని ప్రశ్నించగా జార్జీవా స్పందిస్తూ ‘అవి తీసుకున్న నిర్ణయాలకు 2024 నాటికి సెంట్రల్ బ్యాంకులు సానుకూల ప్రభావం చూసే అవకాశం కనిపిస్తోంది..’ అని వివరించారు.
సానుకూల ఫలితాలు వెలువడుతాయని, అయితే అవి అంత త్వరగా రావని, వాటి కోసం సహనం అవసరమని ఆమె అన్నారు.
సాధారణంగా వడ్డీ రేట్లు పెంచడం వల్ల డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయన్న అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ పోతాయి.
ఐఎంఎఫ్ అంచనాలు చూస్తే మరో ఏడాది పాటు వడ్డీ రేట్లు తగ్గేదేలే అనే పరిస్థితి కనిపిస్తోంది.