Sonia NGOs : సోనియా గాంధీ ఎన్జీవోలకు విదేశీ విరాళాల స్వీకరణ అనుమతుల రద్దు….-home ministry cancels fcra licences of 2 ngos headed by sonia gandhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Home Ministry Cancels Fcra Licences Of 2 Ngos Headed By Sonia Gandhi

Sonia NGOs : సోనియా గాంధీ ఎన్జీవోలకు విదేశీ విరాళాల స్వీకరణ అనుమతుల రద్దు….

HT Telugu Desk HT Telugu
Oct 23, 2022 01:25 PM IST

Sonia NGOsసోనియా సారథ్యంలో ఉన్న రెండు ఎన్జీవోలకు విదేశీ విరాళాల స్వీకరణ అనుమతులు రద్దు చేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది. విదేశీ విరాళాలను దుర్వినియోగం చేయడం, ఆడిట్ పత్రాల్లో అవకతవకలను గుర్తించిన కేంద్రం రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌ (RGF) , రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్‌ల (RGCT) అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

సోనియా నేతృత్వంలోని ఎన్టీవోలకు విదేశీ విరాళాల స్వీకరణ లైసెన్సుల రద్దు
సోనియా నేతృత్వంలోని ఎన్టీవోలకు విదేశీ విరాళాల స్వీకరణ లైసెన్సుల రద్దు (HT_PRINT)

Sonia NGOs కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరిట నిర్వహిస్తున్న రెండు స్వచ్ఛంధ సంస్థలకు విదేశీ విరాళాలను స్వీకరించేందుకు ఉన్న అనుమతులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రెండు ట్రస్టులకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద జారీ చేసిన అనుమతుల్ని కేంద్ర హోంశాఖ రద్దు చేసింది.

ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ (RGF), రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (RGCT)కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అనుమతులు రద్దు చేస్తున్నట్లు హోంశాఖ అధికారులు తెలిపారు. 2020లో హోంశాఖ ఏర్పాటు చేసిన ఇంటర్నల్‌ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా తాజా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ట్రస్టులకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ తప్పనిసరి. నిధుల దుర్వినియోగం అభియోగాలపై రెండు సంస్థలకు అనుమతులు రద్దు చేశారు.

సోనియా నేతృత్వంలోని ట్రస్టులకు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ విరాళాల నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు చలామణి (PMLA) వంటి నేరాలను కమిటీ గుర్తించింది. ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం జులై 2020లో ఏర్పాటు చేసింది. ఆదాయ పన్ను, పీఎంఎల్‌ఏ, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల్ని ఉల్లంఘిం చినట్లుగా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది.

ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌పైనా దర్యాప్తు నిర్వహించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దర్యాప్తు కమిటీలో హోంశాఖ, ఆర్థికశాఖ, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు చెందిన పలువురు అధికారులు ఉన్నారు. ట్రస్టుల కార్యకలాపాలపై క్షుణ్ణంగా అధ్యయనం జరిపారు. 2020లో గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సమయంలో బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆర్‌జీఎఫ్‌పై పలు ఆరోపణలు చేశారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే కొన్ని అధ్యయనాలు చేపట్టడానికి 2005- 2009 మధ్య ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందాయని ఆరోపించారు.

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు మెహుల్‌ ఛోక్సీ వంటి వారి నుంచి అప్పట్లో ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు నిధులు అందాయని, వాటిని ఆర్‌జీఎఫ్‌కు మళ్లించారన్నారు. ఆర్‌జీఎఫ్‌ వైబ్‌సైట్‌లోని 2005- 06 వార్షిక నివేదిక ప్రకారం, ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందించిన దేశాల జాబితాలో చైనా కూడా ఉంది.

రాజీవ్‌ గాందీ ఫౌండేషన్‌ RGFను 1991లో స్థాపించారు. ట్రస్టు వెబ్‌సైట్‌ ప్రకారం విద్య, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికత, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు మద్దతుగా పనిచేస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మోంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా, సుమన్‌ దూబే, అశోక్‌ గంగూలీ ఆర్‌జీఎఫ్‌కు ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు.

రాజీవ్‌గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌ను 2002లో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేయడమే లక్ష్యంగా దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఈ ట్రస్టు యూపీ, హరియాణాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థలు ఢిల్లీలోని పార్లమెంటు కాంప్లెక్స్‌కు సమీపంలో ఉన్న జవహర్‌ భవన్‌ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు వచ్చిన విరాళాలు లంచాలుగా వచ్చాయని బీజేపీ ఆరోపిస్తోంది. చైనా-భారత్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య కార్యక్రమాల కోసం నిధులు వచ్చాయని ఆరోపిస్తోంది. 2005-06 మధ్య కాలంలో పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా నుంచి ఆర్జీఎఫ్‌కు నిధు అందినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

IPL_Entry_Point