Gujarat Election 2022: ముగిసిన ‘తొలి దశ’ ఎన్నికల ప్రచారం.. బరిలో ప్రముఖులు-gujarat election 2022 campaigning ends for first phase polling details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gujarat Election 2022 Campaigning Ends For First Phase Polling Details

Gujarat Election 2022: ముగిసిన ‘తొలి దశ’ ఎన్నికల ప్రచారం.. బరిలో ప్రముఖులు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 29, 2022 10:37 PM IST

Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ జరిగే స్థానాల్లో ప్రచారం ముగిసింది. తొలి దశలో భాగంగా 89 స్థానాలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది.

Gujarat Election 2022: ముగిసిన ‘తొలి దశ’ ఎన్నికల ప్రచారం
Gujarat Election 2022: ముగిసిన ‘తొలి దశ’ ఎన్నికల ప్రచారం (Jagat Prakash Nadda Twitter)

Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తొలి దశ పోలింగ్ జరిగే స్థానాల్లో ప్రచార గడువు మంగళవారం (నవంబర్ 29) ముగిసింది. డిసెంబర్ 1వ తేదీన 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దక్షిణ గుజరాత్, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లోని ఈ స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. గతంలో అధికార బీజేపీ (BJP) , కాంగ్రెస్ (Congress) మధ్యే గుజరాత్‍లో పోటీ ఉండేది. అయితే ఈసారి ఆమ్‍ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP) దూసుకొచ్చింది. దీంతో గుజరాత్‍లో త్రిముఖ పోరు అనివార్యమైంది. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలకు గాను 181 చోట్ల అభ్యర్థులను ఆప్ నిలబెట్టింది.

ట్రెండింగ్ వార్తలు

తొలి దశలో ప్రముఖులు

Gujarat Election 2022: ఆమ్‍ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసూదాన్ గాధ్వీ పోటీ చేస్తున్న ఖంబాలియా స్థానానికి తొలి దశలోనే పోలింగ్ జరనుంది. బీజేపీ తరఫున ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కున్వర్జీ బాలవియా, మార్బీ వంతెన ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్న కాంతిలాల్ అమృతీయ, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా, గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా.. తొలి దశ పోలింగ్ జరిగే స్థానాల బరిలో ఉన్న ప్రముఖుల్లో కొందరిగా ఉన్నారు.

ముమ్మరంగా ప్రచారం

Gujarat Election 2022: తొలి దశ పోలింగ్ జరిగే 89 స్థానాల పరిధిలో బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‍తో పాటు బీజేపీకి చెందిన ప్రముఖ నేతలు ర్యాలీల్లో పాల్గొని, ప్రసంగాలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగానే ప్రచారం చేసింది. తొలి దశ పోలింగ్ 89 స్థానాల్లో జరగనుండగా.. జీజేపీ, కాంగ్రెస్ అన్ని చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఆప్ 88 స్థానాల్లో పోటీలో ఉంది. మొత్తంగా ఈ 89 అసెంబ్లీ స్థానాలకు 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Gujarat Elections 2022: గుజరాత్ ఎన్నికల వివరాలు

182 స్థానాలు ఉన్న గుజరాత్ శాసనసభకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1న తొలి దశలో 89 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అందుకే ఈ సీట్ల పరిధిలో ప్రచారం నవంబర్ 29న ముగిసింది. ఇక డిసెంబర్ 5న 93 సీట్లకు రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ స్థానాల పరిధిలో డిసెంబర్ 3 వరకు ప్రచార గడువు ఉంది. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడవుతాయి.

27 సంవత్సరాలుగా గుజరాత్‍లో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత అధికంగా ఉందని, తాము ఈసారి విజయం సాధిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే ఆమ్‍ఆద్మీ రాకతో సమీకరణాలు మారిపోయాయి. పోటీ కాస్త త్రిముఖం అయింది. అయితే మళ్లీ తాము అధికారం చేపట్టడం ఖాయం అని బీజేపీ కూడా బలంగానే భావిస్తోంది.

IPL_Entry_Point