RBI Repo rate : డిసెంబరు నాటికి రెపో రేటు 5.9 శాతానికి.. ఫిచ్ అంచనా-fitch expects rbi to raise interest rates to 5 9 pc by decemberend ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Fitch Expects Rbi To Raise Interest Rates To 5.9 Pc By December-end

RBI Repo rate : డిసెంబరు నాటికి రెపో రేటు 5.9 శాతానికి.. ఫిచ్ అంచనా

Praveen Kumar Lenkala HT Telugu
Jun 14, 2022 05:35 PM IST

డిసెంబరు నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 5.9 శాతానికి పెంచుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘ఫిచ్ రేటింగ్స్’ సంస్థ అంచనా వేసింది.

ఫిచ్ రేటింగ్స్ ఏజెన్సీ కార్యాలయం
ఫిచ్ రేటింగ్స్ ఏజెన్సీ కార్యాలయం (REUTERS)

ద్రవ్యోల్భణం రేటు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబరు మాసాంతానికి రెపో రేటును మరో ఒక శాతం వరకూ.. అంటే 5.9 శాతానికి పెంచుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది.

ట్రెండింగ్ వార్తలు

అధ్వాన్నమైన బాహ్య పరిస్థితులు, కమాడిటీ ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ద్రవ్యవిధానంలో కాఠిన్య పరిస్థితులు భారత ఆర్థిక పరిస్థితికి సవాలుగా మారాయని ఫిచ్ రేటింగ్స్ తన ప్రపంచ ఆర్థిక దృక్పథాన్ని ఆవిష్కరించింది.

‘ద్రవ్యోల్భణం రేటు పెరుగుతున్న పరిస్థితుల్లో ఆర్‌బీఐ రెపో రేటును డిసెంబరు 2022 నాటికి 5.9 శాతానికి, 2023 చివరి నాటికి 6.15 శాతానికి (ఇంతకుముందు ఈ అంచనా 5 శాతంగా ఉంది..) పెంచుతుందని అంచనా వేస్తున్నాం..’ అని ఫిచ్ తెలిపింది. 

మే నెలలో అకస్మాత్తుగా జరిపిన సమావేశంలో ఆర్బీఐ 40 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచింది. అలాగే గతవారం మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. మొత్తంగా 4 శాతంగా ఉన్న రెపో రేటును 4.9 శాతానికి పెంచింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ద్రవ్యోల్భణం 6.7 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

మే నెలలో రీటైల్ ఇన్‌ఫ్లేషన్ 7.04 శాతంగా ఉంది. అలాగే మే నెలలో హోల్‌సేల్ ప్రైస్ ఆధారిత ఇన్‌ఫ్లేషన్ రికార్డుస్థాయిలో 15.88 శాతానికి పెరిగింది.

‘ద్రవ్యోల్భణం 8 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. ఇది కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ లోని అన్ని కేటగిరీలకు విస్తరించింది. ఇది వినియోగదారులకు తీవ్రమైన సవాలు విసిరింది.. గడిచిన మూడు నెలల్లో ఆహార ద్రవ్యోల్భణం సగటున 7.3 శాతం పెరిగింది. అలాగే వైద్య బిల్లులు కూడా అదే రీతిలో పెరిగాయి..’ అని ఫిచ్ తెలిపింది.

కోవిడ్-19 మహమ్మారి అనంతరం వినియోగం పుంజుకున్నందున ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి కాస్త ఇంప్రూవ్ అవుతుందని ఫిచ్ అంచనావేసింది.

‘మా మార్చి నెల అంచనా 4.8 శాతంతో పోలిస్తే.. జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 4.1 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందని మేం ఇప్పుడు అంచనావేస్తున్నాం. ఇంతకుముందు 8.5 శాతంగా ఉంటుందని అంచనా వేశాం. దీనిని 7.8 శాతానికి తగ్గించాం..’ అని ఫిచ్ పేర్కొంది.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.

రెండు సంవత్సరాల తరువాత భారత సార్వభౌమ రేటింగ్ నెగెటివ్ నుంచి స్టేబుల్‌గా మార్చుతూ ఫిచ్ గత వారం తన రేటింగ్‌ను పెంచింది. వేగంగా పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థ, మధ్యకాలిక వృద్ధి తదితర అంశాల కారణంగా ఫిచ్ ఈ రేటింగ్ ఇచ్చింది. 

ఇటీవలికాలంలో పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ పన్ను తగ్గించినప్పటికీ, రుణాలపై అధిక వడ్డీ రేట్లు వినియోగదారులను ప్రభావితం చేస్తాయని ఫిచ్ పేర్కొంది. అధ్వాన్నంగా మారుతున్న బాహ్య వాతావరణం, కమాడిటీ ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా కఠినమవుతున్న ద్రవ్య విధానాలు, సరఫరా అంతరాయాలు తదితర అంశాలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతిబంధకంగా మారాయని ఫిచ్ తెలిపింది.

హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్భణం దాదాపు 16 శాతానికి చేరుకుందని, అంతిమంగా అధిక వ్యయాలు వినియోగదారుడిపై పడతాయని ఫిచ్ ప్రస్తావించింది.

రీటైల్, హోటళ్లు, రవాణా తదితర రంగాల్లో ఆంక్షలు సడలినందున వినియోగదారులు అధికంగా ఖర్చు చేస్తారని, ఇది 2022లో సుస్థిర ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని ఫిచ్ అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి రేటును 0.6 శాతం మేర తగ్గిస్తూ 2.9 శాతంగా మార్చింది. 

IPL_Entry_Point

టాపిక్