Covid 4th Wave : దిల్లీలో కొవిడ్ ఫోర్త్ వేవ్.. పాజిటివిటీ రేటుపై ఆందోళన ఎందుకంటే?-corona fourth wave in delhi here is why positivity rate is worrisome ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Corona Fourth Wave In Delhi Here Is Why Positivity Rate Is Worrisome

Covid 4th Wave : దిల్లీలో కొవిడ్ ఫోర్త్ వేవ్.. పాజిటివిటీ రేటుపై ఆందోళన ఎందుకంటే?

Anand Sai HT Telugu
Aug 04, 2022 08:40 AM IST

దేశ రాజధానిలో కరోనా విజృంభిస్తోంది. చాలా రోజులుగా దిల్లీలో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతోంది. దీంతో కొవిడ్ ఫోర్త్ వేవ్ పై ఆందోళన మెుదలైంది. పాజిటివిటీ రేటుతో భయం అవసరమా? అంటే అవసరమే. ఎందుకో కింద వివరాలు తెలుసుకోండి.

దిల్లీలో కరోనా కేసులు
దిల్లీలో కరోనా కేసులు

దిల్లీలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ రాజధానిలో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతోంది. బుధవారంనాడు 2,073 కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారం సంఖ్యలతో పోలిస్తే 37 శాతం పెరుగుదల. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రోజువారీ పాజిటివిటీ రేటు 11.64 శాతంగా ఉండటం మరింత ఆందోళనకరం.

చివరిసారిగా జనవరి 24న పాజిటివిటీ రేటు ఈ స్థాయిలో ఉంది. ఆ సమయంలో పాజిటివిటీ రేటు 11.79 శాతానికి వెళ్లింది. ఆ సమయంలోనే.. కరోనా ఫోర్త్ వేవ్ పై భయాలు ఉన్నాయి. కానీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉండేది. కొవిడ్ సెకండ్ వేవ్ తో పోల్చుకుంటే.. కేసుల పెరుగుదల ప్రాణాంతకం కాదు. కానీ పాజిటివిటీ రేటు పెరుగుదల ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

బుధవారం నాటికి దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 19,60,172కి చేరాయి. తాజాగా 5 మరణాలతో వైరస్ కారణంగా మృతుల సంఖ్య 26,321కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు అనేది ప్రతిరోజూ పాజిటివ్‌గా పరీక్షించే వ్యక్తుల శాతం. బుధవారం, 17,815 మందికి వైరస్ కోసం పరీక్షించగా వారిలో 2,073 మంది పాజిటివ్ వచ్చింది.

రోజువారీ పాజిటివిటీ రేటు పెరగడం అనేది.. జనాభాలో వైరస్ ప్రాబల్యం ఎంత ఎక్కువ అవుతుందో.. చెప్పే ముఖ్యమైన సూచికలలో ఒకటి. రెండో వేవ్ సమయంలో ప్రతిరోజూ వేలాది మందికి కరోనా వైరస్ పరీక్షలు చేశారు. పాజిటివిటీ రేటు 30 శాతానికి చేరుకుంది. కానీ ఇప్పుడు మరీ తక్కువ మందికి.. టెస్టులు చేసినా.. వారిలో చాలామందికి వైరస్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది.

పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంటే మహమ్మారి నియంత్రణలో ఉందని చెబుతారు. 5-10 శాతం మధ్య ప్రమాదకరంగా సూచిస్తారు. కానీ 10 శాతం మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కొవిడ్ ఫోర్త్ వేవ్ ఆ? అని ప్రశ్నలు మెుదలవుతున్నాయి. పాజిటివిటీ రేటు 10 శాతం మార్కును దాటకుండా చూసుకోవాలి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.

IPL_Entry_Point