Supreme Court on freebies : `ఫ్రీబీస్‌`పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు-concern is spending public money the right way supreme court on election freebies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Concern Is Spending Public Money The Right Way: Supreme Court On Election Freebies

Supreme Court on freebies : `ఫ్రీబీస్‌`పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Sudarshan Vaddanam HT Telugu
Aug 17, 2022 06:24 PM IST

ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీలు ఇచ్చే హామీల‌పై సుప్రీంకోర్టు బుధ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు హామీలు ఇవ్వ‌కుండా రాజ‌కీయ పార్టీల‌ను తాము నిరోధించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు (HT_PRINT)

Supreme Court on freebies : తాను సంప్ర‌దాయ‌వాదిన‌ని, శాస‌న వ్య‌వ‌స్థ ప‌రిధిలోకి చొచ్చుకుపోవడానికి తాను వ్య‌తిరేక‌మ‌ని ఈ పిటిష‌న్‌ను విచారిస్తున్న ధ‌ర్మాస‌నానికి నేతృత్వం వ‌హిస్తున్న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వ్యాఖ్యానించారు.

Supreme Court on freebies : ప్రజాధ‌నంపైన‌నే ఆందోళ‌న‌

ఉచితాల(freebie) పేరుతో ప్రజాధ‌నం వృధా కాకూడ‌ద‌నే త‌మ ఉద్దేశ‌మ‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌కూడ‌ద‌న్న‌ది కూడా త‌మ ఉద్దేశం కాద‌ని స్ప‌ష్టం చేసింది. ఏది న్యాయ‌మైన హామీ? ప్రజాధ‌నాన్ని స‌రిగ్గా ఖ‌ర్చు చేసే మార్గాలేంటి? అనేవే త‌మ ముందున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌ల‌ని పేర్కొంది. ``ప్ర‌జాధ‌నాన్ని స‌రిగ్గా ఖ‌ర్చు చేయ‌డంపై భిన్నాభిప్రాయాలున్నాయి. freebieల‌ను కొంద‌రు అన‌వ‌స‌ర ఖ‌ర్చు అంటారు. మ‌రికొంద‌రు సంక్షేమం అంటారు. ఏది నిజం. ఇది నిజంగా సంక్లిష్ట‌మైన ప్ర‌శ్న‌. ఈ విష‌యంపై మీ అభిప్రాయాల‌ను మాతో పంచుకోండి. సంపూర్ణ అధ్య‌య‌నం, స‌మ‌గ్ర చ‌ర్చ అనంత‌రం ఏ చేయాల‌నేది మేం నిర్ణ‌యిస్తాం `` అని కోర్టు వ్యాఖ్యానించింది.

Supreme Court on freebies : పిల్ ఏంటి?

ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేసే నిర్హేతుక‌మైన ఎన్నిక‌ల హామీల‌ను ఇచ్చే రాజ‌కీయ పార్టీల రిజిస్ట్రేష‌న్‌ను ర‌ద్దు చేసేలా ఆదేశాలివ్వాల‌ని కోరుతూ సీనియ‌ర్ న్యాయ‌వాది అశ్విని ఉపాధ్యాయ దాఖ‌లు చేసిన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం విచార‌ణ సంద‌ర్భంగా బుధ‌వారం సుప్రీంకోర్టు పై వ్యాఖ్య‌లు చేసింది. ఈ పిటిష‌న్‌ను సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ హిమ కోహ్లీ, జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి విచారిస్తున్నారు. బుధ‌వారం వాద‌న‌ల అనంత‌రం కేసును ఆగ‌స్ట్ 22కు వాయిదా వేశారు. ఈ పిల్‌ను వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్‌, డీఎంకే, ఆప్ పార్టీలు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యాయి.

Supreme Court on freebies : ఉచిత హామీ(freebie) అంటే ఏమిటి?

అస‌లు ఉచితంగా ఇస్తామ‌నే హామీల విష‌య‌లో స్ప‌ష్ట‌త అవ‌స‌ర‌మ‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ freebie ని నిర్దిష్టంగా నిర్వ‌చించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పేర్కొంది. `ఉచిత విద్య‌ను ఫ్రీబీ అనొచ్చా? ప్ర‌జ‌ల‌కు తాగునీరు ఉచితంగా అందించ‌డాన్ని, క‌నీస విద్యుత్ అవ‌స‌రాలు తీర్చ‌డాన్ని ఉచితం (freebie) అని భావించ‌వ‌చ్చా? freebie కు, సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌ధ్య తేడా ఏంటి? ఉచితంగా ఎల‌క్ట్రానిక్ డివైజెస్‌ను ఇవ్వ‌డాన్ని, ఉచితంగా క‌న్సూమ‌ర్ గూడ్స్‌ను ఇవ్వ‌డాన్ని, సంక్షేమ కార్య‌క్ర‌మంగా నిర్వ‌చించ‌వ‌చ్చా?.. వీట‌న్నింటిపై స‌మ‌గ్ర అధ్య‌య‌నం అవ‌స‌రం` అని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. అలాగే, ఉపాధి హామీ ప‌థ‌కం వంటి వాటి వ‌ల్ల ప్ర‌జ‌లు గౌర‌వ‌నీయ జీవ‌నం గ‌డ‌ప‌డానికి వీలైంద‌ని గుర్తుచేశారు. కొన్ని పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం లేద‌ని సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point