Inflation | ద్రవ్యోల్బణంపై భయం.. ప్రజలకు ఇక అవే దిక్కు..!
దేశంలో ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో పెరుగుతోంది. కాగా.. పెరుగుతున్న ధరలను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. సాధారణంగా కొనుగోలు చేసే వాటి కన్నా.. చౌకగా దొరికే వాటిని ఎంచుకుంటున్నారు.
India inflation rate | నానాటికి పెరిగిపోతున్న ధరలతో భారతీయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా టూత్ పేస్టు నుంచి సబ్బుల వరకు అన్ని ధరలు పెరుగుతుండటంతో ప్రజలు గుండెలు పట్టుకుని కూర్చుంటున్నారు. ఫలితంగా ప్రత్యామ్నాయం, చౌకగా దొరికే వస్తువులవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నట్టు డేటా సూచిస్తోంది. ఫలితంగా దిగ్గజ ఎఫ్ఎంసీజీ సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పడిపోతోంది.
ట్రెండింగ్ వార్తలు
పెంచక తప్పడం లేదు.. కానీ..
ముడిసరకు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫలితంగా ఎఫ్ఎంసీజీ సంస్థల మార్జిన్లపై ప్రభావం పడుతోంది. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఆయా సంస్థలు.. తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. అలా.. డిటర్జెంట్ల నుంచి బల్బుల వరకు అన్ని ధరలు పెరిగిపోయాయి. హిందుస్థాన్ యూనిలివర్, మారికో, డాబర్, ఇమామీ, బ్రిటానియా వంటి సంస్థలు కొన్ని నెలల వ్యవధిలోనే తమ ఉత్పత్తుల ధరలను దాదాపు 30శాతం పెంచేశాయి.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయి. సరఫరా వ్యవస్థ దెబ్బతింది. చివరికి అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో ఎగిసిపడుతోంది. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం 18శాతానికి చేరింది. యూకేలో అది 7శాతంగా ఉంది. ఇక భారత్లో.. ద్రవ్యోల్బణం.. గత నెలలో 6.95గా నమోదైంది. ఇది 17 నెలల గరిష్ఠం. ధరలను పెంచడం కంపెనీలకు తప్పడం లేదు. కానీ వాటిని తట్టుకునే శక్తి మాత్రం ప్రజల దగ్గర ఉండటం లేదు. అందుకే ప్రజలు ఇతర మార్గాలను, పొదుపు చేసే విధానాలను ఎంచుకుంటున్నారు. దీని వల్ల కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతోంది. గ్రామీణ భారతంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
మధ్య తరగతి కుటుంబాలపైనే ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే.. వారి నెలవారీ బడ్జెట్లో ఎక్కువ భాగం.. నిత్యావసర వస్తువుల కోసమే కేటాయిస్తుంటారు.
ఇలా.. ధరలు పెంచితే ఒక బాధ.. పెంచకపోతే ఒక బాధ అన్నట్టుగా ఉంది సంస్థల వ్యవహారం. అదే సమయంలో పెంచిన ధరలను తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులకు త్వరలో ముగింపు పడాలని, ద్రవ్యోల్బణం దిగిరావాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్ని వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం
పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. ఈ నెల నుంచే వర్తింపు..
April 06 2022