War Zone | జాగ్వార్, పాంథర్‌ను వదిలేసి రాలేనంటున్న ఏపీ వైద్యుడు
అతను ఉక్రెయిన్‌లో ఓ డాక్టర్.. స్వస్థలం ఆంధ్రప్రదేశ్. ఓ జాగ్వార్‌ను తీసుకొచ్చుకున్నాడు.. దానికి 'యాశా' అని పేరు పెట్టుకుని తన ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. దీనికితోడు ఓ బ్లాక్ పాంథర్.. మరో 4 కుక్కలను జత చేశాడు. ఓ వైపు ఉద్యోగం, మరోవైపు వీటి సంరక్షణ.. అంతేనా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టాడు. ఇంతవరకు హ్యాపీ లైఫ్! కానీ రష్యా - ఉక్రెయిన్ వార్తో సరికొత్త సమస్య వచ్చిపడింది ఈ తెలుగు వైద్యుడికి..!

గిరికుమార్ పాటిల్... ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు వాసి. మెడిసిన్ చదివేందుకు 2007లో ఉక్రెయిన్‌కి వెళ్లాడు. వైద్య విద్య పూర్తయిన తర్వాత అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డాడు. ప్రస్తుతం ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌గా పనిచేస్తున్నాడు. అయితే జంతువులంటే గిరికుమార్‌కు చాలా ఇష్టం. కొద్దిరోజుల కిందట ఓ జూలో గాయపడిన జాగ్వార్‌ను అధికారుల అనుమతితో దత్తత తీసుకున్నాడు. దానికి ‘యాశా’ అని పేరు పెట్టాడు. తాను ఉండే ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. యాశాకి తోడు కోసం ఓ బ్లాక్ పాంథర్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. మరో నాలుగు కుక్కలను కూడా వీటికి జత చేశాడు.
నా చివరి శ్వాస వరకు వాటితోనే..
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులంతా స్వదేశానికి చేరుకుంటున్నారు. రష్యా బాంబుల దాడితో అక్కడి పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. అయితే ఏపీకి చెందిన గిరికుమార్ మాత్రం.. తన పెంపుడు జంతువులను వదిలేసి రాలేనని తేల్చి చెబుతున్నాడు. వాటిని తన పిల్లలుగా పేర్కొంటున్నాడు. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వాటి జీవితాలను అగాథంలో పడేయలేనని అంటున్నాడు. ప్రస్తుతం తన ఇంటి కింద ఉన్న ఓ బంకర్‌లో భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నాడు.
జంతువులకు ఆహారం తీసుకొచ్చేందుకు మాత్రమే బయటకు వస్తున్నాడు గిరికుమార్. ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల్లో తిరిగి ఇంటికి రావాలని ఏపీలోని కుటుంబీకులు వేడుకుంటున్నారు. కానీ గిరి కుమార్ రాలేనని బదులిస్తున్నాడు. ‘నా కుటుంబం నన్ను తిరిగి రావాలని కోరుతోంది. కానీ నా ప్రాణాలు కాపాడుకోవడానికి నా పెంపుడు జంతువులను ప్రమాదంలో పడేయలేను. చుట్టుపక్కల బాంబుల మోత మోగుతోంది. నా జంతువులు భయపడుతున్నాయి. సరిగా తినడంలేదు. వాటిని వదిలేసి రాలేకపోతున్నాను. అవి నా పిల్లలు, చివరి శ్వాస వరకు వాటితోనే ఉంటా’ అంటూ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో గిరికుమార్ స్పష్టం చేశాడు.
వాటి తరలింపునకు అనుమతించండి..
ఉక్రెయిన్ - రష్యా వార్తో భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ చేపట్టింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది. అయితే కొందరు తాము పెంచుకుంటున్న పెట్స్‌ను కూడా వెంట తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన పెంపుడు జంతువులను కూడా భారత్‌కు తరలించేందుకు ప్రభుత్వం అనుమతించాలని గిరికుమార్ కోరుతున్నాడు. తన విజ్ఞప్తి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆకాంక్షిస్తున్నాడు.
JAGUAR KUMAR TELUGU పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు గిరికుమార్. 80వేలకు పైగా సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు. తన పెంపుడు జంతువులైనా జాగ్వర్, పాంథర్ గురించి తరచూ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తుంటారు.
టాపిక్