AK Antony Son Quits: ఆ ట్వీట్‍ను తొలగించను.. పార్టీనే వీడుతున్నా: కాంగ్రెస్ నేత-ak antony son anil k antony resigned from congress after slamming bbc documentary series on pm modi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ak Antony Son Anil K Antony Resigned From Congress After Slamming Bbc Documentary Series On Pm Modi

AK Antony Son Quits: ఆ ట్వీట్‍ను తొలగించను.. పార్టీనే వీడుతున్నా: కాంగ్రెస్ నేత

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 25, 2023 11:46 AM IST

Anil K Antony Resigned: కాంగ్రెస్ నాయకుడు అనిల్ కే ఆంటోనీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సొంత పార్టీ నాయకులే తనను దూషించారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి అనిల్ కే ఆంటోనీ రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి అనిల్ కే ఆంటోనీ రాజీనామా (HT_Photo)

Anil K Antony Resigned from Congress: కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony) కుమారుడు, కాంగ్రెస్ నేత అనిల్ కే ఆంటోనీ (Anil K Antony).. పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని అనిల్ ఆంటోనీ వ్యతిరేకించారు. పార్టీ విధానానికి విభిన్నంగా ఈ విషయంలో స్పందించారు. అయితే, తన అభిప్రాయాన్ని చెప్పినందుకు సొంత పార్టీ నుంచే విద్వేషాన్ని, తిట్లను ఎదుర్కోవాల్సి వస్తోందని అనిల్ ఆంటోనీ పేర్కొన్నారు. ప్రేమను పంచాలని చెబుతూ నడుస్తున్న వారి మద్దతుదారులు తనపై విద్వేషాన్ని చిమ్ముతున్నారని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఉద్దేశించారు. బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా తాను చేసిన ట్వీట్‍ను వెనక్కి తీసుకోవాలని సొంత పార్టీ నుంచి అసహనపూరితమైన కాల్స్ వచ్చాయని, అయితే అలా చేయలేక పార్టీనే వీడుతున్నానని అనిల్ కే ఆంటోనీ పేర్కొన్నారు. వివరాలివే..

అందుకే రాజీనామా

Anil K Antony Resigned from Congress: “నిన్న జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకొని, కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు నేను రాజీనామా చేయడమే సరైనది నేను నమ్ముతున్నా” అని రాజీనామా లేఖను రాశారు అనిల్ కే ఆంటోనీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. లేఖను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు నేను రాజీనామా చేశా. వాక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారే, ట్వీట్‍ను ఉపసంహరించుకోవాలని నాకు అసహనంతో కూడిన కాల్స్ చేస్తున్నారు. అందుకు నేను నిరాకరించా. ఫేస్‍బుక్ వాల్‍పై విద్వేషపూరిత, అభ్యంతరకర కామెంట్లు చేస్తున్నారు. ప్రేమను పంచాలని ప్రమోట్ చేస్తూ నడుస్తున్న వారికి మద్దతునిస్తున్న వారు ఇలా చేస్తున్నారు” అని అనిల్ కే ఆంటోనీ ట్వీట్ చేశారు.

‘మీకు అలాంటి వారే కావాలా!’

Anil K Antony Resigned from Congress: “పార్టీకి అనేక విధాలుగా తోడ్పడేందుకు నాకు ప్రత్యేకమైన సామర్థ్యముందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. అయితే, స్వప్రయోజనాల కోసం నాయకత్వం చుట్టూ తిరుగుతూ పొగిడేవారు, చెంచాలు, ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ఫాలో అయిపోతుండే వారితోనే పని చేసేందుకే మీరు మొగ్గుచూపుతున్నారని నేను తెలుసుకున్నా. పార్టీలో మెరిట్‍కు ఇదే ఏకైక అర్హతగా మారింది. బాధాకరం ఏటంటే.. నేను అలా చేయలేను” అని అనిల్ కే ఆంటోనీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీపై బీసీసీ రూపొందించిన డాక్యుమెంటరీ (BBC Documentary on PM Modi) సిరీస్‍ను అనిల్ కే ఆంటోనీ తీవ్రంగా వ్యతిరేకించారు. భారత సార్వభౌమత్వానికి బీబీసీ భంగం కలిగించేలా ప్రవర్తిస్తోందని మంగళవారం ట్వీట్ చేశారు. బీజేపీతో తనకు చాలా విబేధాలు ఉన్నప్పటికీ, బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ భారత్‍కు హానీ చేసేలా ఉందని తాను భావిస్తున్నానని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీబీసీ డాక్యుమెంటరీపై భిన్న వాదనను వినిపించింది. నిజం ఎప్పటికైనా బయటకి వస్తుందంటూ.. బీబీసీ డాక్యుమెంటరీని సమర్థించేలా ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు మాట్లాడుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం