Manipur: 40 మంది తిరుగుబాటుదారులను భద్రతా దళాలు హతమార్చాయి: మణిపూర్ సీఎం.. కొనసాగుతున్న ఆపరేషన్స్!-40 suspected militants killed by security forces in manipur cm biren singh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  40 Suspected Militants Killed By Security Forces In Manipur Cm Biren Singh

Manipur: 40 మంది తిరుగుబాటుదారులను భద్రతా దళాలు హతమార్చాయి: మణిపూర్ సీఎం.. కొనసాగుతున్న ఆపరేషన్స్!

Chatakonda Krishna Prakash HT Telugu
May 28, 2023 09:12 PM IST

Manipur: మణిపూర్‌లో భారీ ఎన్‍కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా దళాల ఆపరేషన్లలో ఇప్పటి వరకు సుమారు 40 మంది మిలిటెంట్లు హతమైనట్టు ఆ రాష్ట్ర సీఎం బిరెన్ సింగ్ తెలిపారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మణిపూర్ సీఎం బిరెన్ సింగ్
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ (ANI )

Manipur: అల్లర్లు చెలరేగుతున్న మణిపూర్ రాష్ట్రంలో భద్రత దళాల భారీ ఆపరేషన్స్ జరుగుతున్నట్టు వెల్లడైంది. ఆయుధాలతో ఉన్న 40 మంది తిరుగుబాటుదారులను (మిలిటెంట్లు) గత కొన్ని గంటల్లో భద్రతా దళాలు, రాష్ట్ర పోలీసులు హతమార్చారని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ చెప్పారు. హతమైన వారు కుకీ మిలిటెంట్ గ్రూప్‍నకు చెందిన వారిగా అనుమానిస్తున్నట్టు ఆయన ఆదివారం ఇంఫాల్‍లో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకు మణిపూర్ రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లో ఎన్‍కౌంటర్లు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఆయుధాలతో ఉన్న మిలిటెంట్ల కోసం వేట సాగుతోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం రాత్రి మరోసారి అల్లర్లు రేగాయి. ఈ ఘర్షణల్లో నలుగురు పౌరులు, ఓ పారా మిలటరీ జవాన్ చనిపోయారు. దీంతో అల్లర్లకు పాల్పడిన తిరుగుబాటుదారుల కోసం భద్రతా దళాలు, మణిపూర్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. “హానికర ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు ఆపరేషన్స్ చేస్తున్నారు. పౌరులపై అధునాతన ఆయుధాలను ఉపయోగిస్తున్న ఉగ్రవాదుల (మిలిటెంట్లు) గ్రూప్‍లను నిలువరించే, రక్షణాత్మక చర్యలలో భాగంగా ఎన్‍కౌంటర్లు జరిగాయి. వివిధ ప్రాంతాల్లో సుమారు 40 మంది ఉగ్రవాదులు చనిపోయారు. పలువురిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి” అని సీఎం బెరెన్ సింగ్ తెలిపారు.

పౌరులపై తుపాకులు

“పౌరులపై ఎం-16, ఏకే-47 తుపాకులు, స్నిపర్ గన్‍లను ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారు. చాలా ఇళ్లను దగ్ధం చేసేందుకు వారు చాలా గ్రామాలకు వచ్చారు. ఆర్మీ, ఇతర భద్రతా దళాల సాయంతో వారిపై మేం చాలా కఠినమైన చర్యలను తీసుకుంటున్నాం” అని బిరెన్ సింగ్ చెప్పారు.

మణిపూర్‌లోని సెక్మై, సుగ్ను, కుంబీ, ఫయెంగ్, సెరోయూ ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లోని వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నట్టు రిపోర్టులు బయటికి వస్తున్నాయి. కాగా, సెక్మైలో ఆయుధాలతో ఉన్న తిరుగుబాటుదారుల ఏరివేత పూర్తయినట్టు తెలుస్తోంది.

ఇంఫాల్ లోయ సరిహద్దుల్లో గత రెండు రోజుల్లో పౌరులపై దాడులు జరిగాయని, ఇవి ప్రణాళిక ప్రకారమే జరిగనట్టు తాము అనుమానిస్తున్నామని సీఎం సింగ్ చెప్పారు. ప్రభుత్వం శాంతి కోసం కృషి చేస్తుండగా.. ఇలాంటి అల్లర్లు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పౌరులపై ఆయుధాలతో దాడులకు పాల్పడుతున్న వారి కోసం భద్రతా దళాలు ఆపరేషన్లు చేస్తున్నాయని వెల్లడించారు.

రేపు మణిపూర్‌కు అమిత్ షా

మణిపూర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు (మే 29) పర్యటించాల్సి ఉంది. మైటీలు, కుకీలు శాంతిగా ఉండాలని, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు సహరించాలని ఆయన కూడా విజ్ఞప్తి చేశారు. కాగా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే.. రెండు రోజుల పర్యటన కోసం శనివారమే మణిపూర్‌లో అడుగుపెట్టారు. భద్రతా పరిస్థితులను పర్యవేక్షించారు.

తాజా అల్లర్లతో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో కర్ఫ్యూను ప్రభుత్వం మరింత కుదించింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్వూ సడలింపు ఇప్పటి వరకు ఉండగా.. ఆదివారం దాన్ని ఉదయం 11.30 గంటలకే తగ్గించింది. బిష్ణుపూర్‌లో కర్ఫ్యూ సడలింపు మధ్యాహ్నం 12 గంటల వరకు తగ్గింది.

మే 3వ తేదీన మైటీలు, కుకీ వర్గాలకు మధ్య మణిపూర్‌లో ఘర్షణలు మొదలయ్యాయి. అప్పటి నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 70 మంది చనిపోయారు. మైటీలను ఎస్‍టీల్లో చేర్చాలన్న ప్రతిపాదనను కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతోనే ఆ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

IPL_Entry_Point