Virataparvam Review: విరాటపర్వం రివ్యూ.. సాయిపల్లవి నట విశ్వరూపం-virataparvam movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virataparvam Review: విరాటపర్వం రివ్యూ.. సాయిపల్లవి నట విశ్వరూపం

Virataparvam Review: విరాటపర్వం రివ్యూ.. సాయిపల్లవి నట విశ్వరూపం

HT Telugu Desk HT Telugu
Jun 17, 2022 12:33 AM IST

Virataparvam Review : రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే...

సాయిపల్లవి
సాయిపల్లవి (twitter)

Virataparvam Review: 1980-90 ద‌శ‌కంలో నక్సలిజం తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.  ఈ న‌క్స‌లిజానికి  ఆక‌ర్షితులై ఎంద‌రో  ఉన్నత విద్యావంతులు విప్ల‌వోద్య‌మంలో భాగస్వాములయ్యారు. ఆనాడు జరిగిన అన్యాయాలు, అక్ర‌మాల‌ను ఎదుర్కొనే విషయంలో ప్ర‌భుత్వాల కంటే న‌క్స‌లైట్ల‌నే  ప్ర‌జ‌లు ఎక్కువ‌గా నమ్మారు.  అంత‌గా జ‌న‌జీవితంతో నక్సలైట్లు మ‌మేక‌మైపోయారు. అలాంటి ఉద్య‌మం నేడు ప‌త‌నావ‌స్థ‌కు చేరుకున్న‌ది. నేటి యువ‌త‌కు న‌క్స‌ల్ భావ‌జాలం, సిద్ధాంతాలు, వారి జీవితాల గురించి తెలియకుండా పోయింది. 

ఈ త‌రుణంలో ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల 1990ల దశకంలో జరిగిన యథార్థ సంఘటనతో న‌క్స‌లిజం నేప‌థ్యానికి ప్రేమ‌క‌థ‌ను జోడించి విరాట‌ప‌ర్వం సినిమాను తెర‌కెక్కించాడు.  రానా, సాయిప‌ల్ల‌వి తో పాటు ప‌లువురు అగ్ర‌న‌టీన‌టులు భాగ‌కావ‌డంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. నక్సలిజం సిద్ధాంతాలు నేటితరానికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు  ఈ సినిమాలో చెప్పారా? న‌క్స‌లిజం, ప్రేమకు మ‌ధ్య నెల‌కొన్న సంఘర్షణను  ఏ విధంగా చూపించారో తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

విరాట పర్వం కథ

వెన్నెల(సాయిపల్లవి) మొండిత‌నం, ప‌ట్టుద‌ల  కలగలసిన ప‌ల్లెటూరి యువ‌తి. త‌న‌కు న‌చ్చిన దానికోసం ఎంత దూర‌మైన వెళుతుంది. ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డుతుంది. న‌క్స‌ల్ నాయ‌కుడు అర‌ణ్య అలియాస్ ర‌వ‌న్న (రానా) రాసిన రచనలు చ‌దివి అత‌డితో ప్రేమ‌లో ప‌డుతుంది.  త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ అరణ్యకు  చెప్పాల‌ని అతడిని వెతుకుతూ ప్ర‌యాణం మొద‌లుపెడుతుంది వెన్నెల‌. అర‌ణ్య‌ను ఆమె క‌లిసిందా?  వెన్నెల ప్రేమ‌ను అర‌ణ్య ఎలా స్వీక‌రించాడు? ఈ ప్ర‌యాణంలో వెన్నెల‌కు ఎలాంటి సంఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి? ఆమె జీవితం చివ‌ర‌కు ఎలా ముగిసింది అన్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం. 

తూము సరళ జీవితం

1990వ ద‌శ‌కంలో కోవ‌ర్టుగా అనుమానిస్తూ న‌క్స‌లైట్ల చేతిలో హత్యకు గురైన తూము స‌ర‌ళ అనే మ‌హిళ జీవితం ఆధారంగా ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ఈ క‌థ‌ను రాసుకున్నారు. న‌క్స‌లిజానికి ప్రేమ‌క‌థ‌ను ముడిపెడుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. మీరాబాయి కృష్ణుడి ప్రేమ‌క‌థ నుంచి స్ఫూర్తి పొందుతూ వెన్నెల‌, ర‌వ‌న్న మ‌ధ్య ఉన్న అమ‌లిన ప్రేమ‌ను హృద్యంగా సినిమాలో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను అన్వేషిస్తూ ఓ యువ‌తి సాగించే ప్ర‌యాణాన్ని, ఆమె గ‌మ్యాన్ని మనసుల్ని కదిలించేలా ఎమోషనల్ గా చెప్పాలని తపించారు.  

1990 నాటి తెలంగాణం

 అల‌నాటి తెలంగాణ గ్రామీణ జీవితాన్ని, వారు ఎదుర్కొంటున్న అణిచివేత‌ను ఆవిష్క‌రిస్తూ  సినిమాను ఆస‌క్తిక‌రంగా మొద‌లుపెట్టారు ద‌ర్శ‌కుడు. ఈ అణిచివేత‌తో పాటు అంత‌ర్లీనంగా వెన్నెల క‌థ‌ను న‌డిపించారు. అర‌ణ్య రాసిన పుస్త‌కాల ద్వారా వెన్నెల అత‌డి ప‌ట్ల ఆక‌ర్షితురాల‌వ్వ‌డం, ప్రేమ‌మైకంలో మునిగిపోయి ఊహాలోకంలో విహ‌రించే స‌న్నివేశాల‌ను అందంగా మలిచారు. అర‌ణ్య‌ను వెతుక్కుంటూ వెన్నెల ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టే సీన్ నుంచి కథ‌ ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. అర‌ణ్య‌ను క‌ల‌వ‌డానికి ఆమె ప్ర‌య‌త్నించే ప్ర‌తిసారి పోలీసులు ఎదుర‌వ్వ‌డం, వారి నుంచి త‌ప్పించుకుంటూ వెన్నెల చూపించే తెగువ‌తో ప్ర‌థ‌మార్థం ఆస‌క్తిక‌రంగా సాగిపోతుంది

ఎమోషనల్ క్లైమాక్స్..

అర‌ణ్య‌తోనే త‌న జీవిత‌మ‌ని న‌మ్మి అత‌డి అడుగుజాడాల్లో ఎలా న‌డిచిందో సెకండ్ హాఫ్ లో దర్శకుడు చూపించారు. ప్రేమ‌, అనురాగాల కంటే స‌మాజ‌ సంక్షేమ‌మే మిన్నగా భావించే అర‌ణ్య‌లో వెన్నెల ప్రేమ ఎలా మార్పుతెచ్చిందో చాటారు.  అల‌నాడు పోలీసులు చేసిన బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లు, కోవ‌ర్టు ఆప‌రేష‌న్స్ క‌థ‌లో భాగం  చేస్తూ ద్వితీయార్థాన్ని చ‌క్క‌గా అల్లుకున్నారు. క్లైమాక్స్ ఎమోష‌న‌ల్ కు గురిచేస్తుంది.  తూము స‌ర‌ళ గురించి తెలిసిన వారికి కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ  ఆమె జీవితం పట్ల ఎలాంటి అవ‌గాహ‌న లేని వారిని మాత్రం ఆక‌ట్టుకుంటుంది. 

రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు..

విరాట‌ప‌ర్వం ఓ భిన్న‌మైన ప్రేమ‌క‌థ‌. రెగ్యుల‌ర్ ల‌వ్ స్టోరీస్ లో క‌నిపించే  డ్యూయెట్లు, ఫైట్లు, రొమాన్స్ లాంటి హంగులేవి ఇందులో కనిపించవు  ప్రేమ‌లోని స్వ‌చ్ఛ‌త‌ను, నిజాయితీని చాటుతూ ఫీల్ గుడ్ గా దర్శకుడు  ఈ సినిమాను తెరకెక్కించారు.  1990ల కాలం నాటి నేప‌థ్యాన్ని, అలనాటి సాంఘిక, సామాజిక పరిస్థితులను సహజంగా చూపించారు .   ఇళ్లు, మ‌నుషులు, వారు మాట‌తీరు అన్ని అప్పటి కాలాన్ని త‌ల‌పించేలా చ‌క్క‌గా డిజైన్ చేసుకున్నారు. 

నెమ్మదిగా సాగే సెకండ్ హాఫ్

అర‌ణ్య‌ను వెన్నెల గాఢంగా ప్రేమించ‌డానికి గ‌ల కార‌ణాల్ని కొంత బ‌లంగా చూపిస్తే బాగుండేది. అలాగే అర‌ణ్య‌ను క‌లిసిన త‌ర్వాత వెన్నెల జీవితం ఎలా మారింది? వెన్నెల ప్రేమ అత‌డిలో ఏ విధంగా మార్పు తెచ్చింద‌నే స‌న్నివేశాల‌పై లోతుగా క‌స‌ర‌త్తులు చేసుంటే సినిమా మ‌రో స్థాయిలో ఉండేది. ద్వితీయార్థంలో చాలా సన్నివేశాలు సాగ‌దీసిన అనుభూతి క‌లుగుతుంది. సాయిప‌ల్ల‌వికి పోటీగా మిగిలిన పాత్ర‌ల‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా తీర్చిదిద్ద‌లేక‌పోయారు. 

గుర్తుండిపోయే పాత్రలో సాయిపల్లవి

సాయిప‌ల్ల‌వి ఈ సినిమాకు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. అన్నీతానై విరాటపర్వం చిత్రాన్ని ముందుకు న‌డిపించింది. వెన్నెల‌గా ప్ర‌తి సీన్‌లో త‌న హావ‌భావాలు, డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకున్న‌ది. చ‌క్క‌టి ఎమోష‌న్స్ పలికించింది.  త‌న పాత్ర‌కు పూర్తిగా న్యాయం చేసింది.  త‌న‌ను త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేనంత‌గా ఈ పాత్ర‌లో ఒదిగిపోయింది. ఉద్య‌మ‌మే ఊపిరిగా బ‌తికే విప్ల‌వ‌నాయ‌కుడిగా రానా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో అద్భుతమైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. త‌న శైలికి భిన్నంగా కొత్త‌గా ఈ సినిమాలో క‌నిపించాడు. శ‌కుంత‌ల టీచ‌ర్‌గా నందితాదాస్‌, రానా త‌ల్లి పాత్ర‌లో జ‌రీనా వ‌హాబ్, సాయిప‌ల్ల‌వి త‌ల్లిదండ్రులుగా సాయిచంద్‌, ఈశ్వ‌రీరావుల న‌ట‌న ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. త‌మ అనుభ‌వంతో పాత్ర‌ల‌కు ప్రాణంపోశారు. ప్రియ‌మ‌ణి, న‌వీన్‌చంద్ర ప‌ర్వాలేద‌నిపించారు. అతిథి పాత్రలో నివేథా పెతురాజ్ కనిపించింది. 

ద‌ర్శ‌కుడిగానే కాకుండా డైలాగ్ రైట‌ర్‌గా వేణు ఊడుగుల ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. ఒక యుద్దం అనేక మంది ప్రాణాల‌ను తీస్తుంది కానీ ఈ యుద్దం నా ప్రాణాల‌ను పోసింది... ప్రేమించ‌డానికి కార‌ణాలు ఉండ‌వు. ఫ‌లితాలే అంటూ సాగే ఎమోష‌న‌ల్ డైలాగ్స్ మెప్పించాయి. సురేష్ బొబ్బిలి నేప‌థ్య సంగీతం, పాట‌లు సినిమాలోని ఫీల్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేశాయి. డానీ శాంచెజ్ లోఫెజ్‌, దివాక‌ర్ మ‌ణి చాయాగ్ర‌హ‌ణం బాగుంది. 

నవ్యమైన అనుభూతి..

క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాకు అల‌వాటుప‌డిపోయిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌వ్య‌మైన అనుభూతిని పంచే చిత్ర‌మిది.  విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌గా మెప్పిస్తుంది. న‌క్స‌ల్ భావ‌జాలం గురించి నేటి యువ‌త‌కు తెలిసిందే త‌క్కువే. వారు ఈ కథతో ఎంత‌వ‌ర‌కు క‌నెక్ట్ అవుతార‌న్న‌దానిపైనే ఈ సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 

రేటింగ్- 2.75/5

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్