Sarath Babu Passes Away: టాలీవుడ్‌లో వరుస విషాదాలు.. సీనియర్ నటుడు శరత్ బాబు మృతి-tollywood senior actor sarath babu passes away in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tollywood Senior Actor Sarath Babu Passes Away In Hyderabad

Sarath Babu Passes Away: టాలీవుడ్‌లో వరుస విషాదాలు.. సీనియర్ నటుడు శరత్ బాబు మృతి

Maragani Govardhan HT Telugu
May 22, 2023 03:03 PM IST

Sarath Babu Passes Away: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు(71) నేడు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో గత నెలరొజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన కన్నుమూశారు. 300కి పైగా సినిమాల్లో నటించిన ఆయన హీరోగా 70 చిత్రాలు చేశారు.

శరత్ బాబు
శరత్ బాబు

Sarath Babu Passes Away: టాలీవుడ్‌లో వరుస విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం నాడు ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందగా.. ఈ రోజు సీనియర్ నటుడు శరత్ బాబు(71) కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం నాడు ఆరోగ్యం విషమించడంతో మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం వల్ల కోలుకోలేక ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు.

శరత్ బాబు మరణ వార్తతో చిత్రసీమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై స్పందించిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. శరత్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన భౌతిక కాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన విజయ శంకర దీక్షితులు, సుశిలాదేవిలకు ఆయన జన్మించారు. ప్రముఖ నటి రమప్రభను వివాహం చేసుకున్న ఆయన.. కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆమె నుంచి విడిపోయారు.

సినీ ప్రస్థానం..

1973లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన శరత్ బాబు తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. చాలా సినిమాల్లో కథానాయకుడిగా, ద్వితీయ నాయకుడిగా నటించారు. శరత్ బాబు తన 40 ఏళ్ల సినీ జీవితంలో 300కు పైగా పాత్రల్లో నటించారు. ఇటీవల చిత్ర పరిశ్రమకు కాస్త దూరంగా ఉన్న శరత్ బాబు చివరిసారిగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన వకీల్ సాబ్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. 70 కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు.

హీరోగా కంటే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లు ఆయ‌న‌కు ఎక్కువ‌గా గుర్తింపు తీసుకొచ్చాయి. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్ రూపొందిన గుప్పెడు మ‌న‌సు, ఇది క‌థ కాదు, పంతుల‌మ్మ‌తో పాటు ప‌లు సినిమాలు శ‌ర‌త్‌బాబు నటనను వెలుగులోకి తీసుకొచ్చాయి. సీతాకోక‌చిలుక‌, క్రిమిన‌ల్‌, కోకిల‌, సితార‌, సింహ‌గ‌ర్జ‌న‌, తోడు, స్వాతి, అన్వేష‌ణ‌, సంసారం ఓ చ‌ద‌రంగం, అభినంద‌న‌, నీరాజ‌నంతో పాటు ప‌లు తెలుగు సినిమాలు శ‌ర‌త్‌బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి సీతాకోక‌చిలుక‌, ఓ భార్య క‌థ‌, నీరాజ‌నం సినిమాల‌కుగాను నంది అవార్డుల‌ను అందుకున్నారు శరత్ బాబు.

IPL_Entry_Point

టాపిక్