ఒకే సినిమా 292 సార్లు చూశాడు.. గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కాడు!-this us man watched spiderman movie 292 times to get into guinness book of world records ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  This Us Man Watched Spiderman Movie 292 Times To Get Into Guinness Book Of World Records

ఒకే సినిమా 292 సార్లు చూశాడు.. గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కాడు!

HT Telugu Desk HT Telugu
Apr 17, 2022 07:37 PM IST

ఒక సినిమాను మీరు ఎన్నిసార్లు చూడగలరు? పది, ఇరవై.. వంద.. కానీ ఈ వ్యక్తి మాత్రం ఒకే సినిమాను ఏకంగా 292 సార్లు చూసి గిన్సిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కాడు.

గిన్నిస్ రికార్డ్ సృష్టించిన రామిరో అలానిస్
గిన్నిస్ రికార్డ్ సృష్టించిన రామిరో అలానిస్ (Twitter)

న్యూఢిల్లీ: 2019లో ఒకే సినిమాను అతడు 191 సార్లు చూసి గిన్నిస్‌ రికార్డులకు ఎక్కాడు. కానీ రెండేళ్లకే ఆ రికార్డు మరుగున పడిపోయింది. మరో వ్యక్తి ఒకే సినిమాను 204 సార్లు చూసి ఆ రికార్డు బ్రేక్‌ చేశాడు. ఎలాగైనా తన రికార్డు తిరిగి పొందాలని కంకణం కట్టుకున్న ఆ వ్యక్తి ఈసారి ఒకే సినిమాను 292 సార్లు చూశాడు. ఆ పోయిన రికార్డును తిరిగి తెచ్చుకున్నాడు. ఆ వ్యక్తి పేరు రామిరో అలానిస్‌ కాగా.. అతడు అన్నిసార్లు చూసిన సినిమా పేరు స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌.

30 రోజులు.. రూ.2.59 లక్షలు

గతేడాది రిలీజైన ఈ మూవీని 2021, డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి 15 మధ్యలో అలానిస్‌ ఏకంగా 292 సార్లు చూశాడు. అంటే ఈ సినిమా చూడటానికి ఈ మూడు నెలల కాలంలో అతడు వెచ్చించిన సమయం 720 గంటలు లేదా 30 రోజులు కావడం విశేషం. అంతేకాదు టికెట్ల కోసమే అతడు 3400 డాలర్లు (సుమారు రూ.2.59 లక్షలు) ఖర్చు చేశాడు. అతని పట్టుదలను చూసి గిన్నిస్‌ బుక్‌ వాళ్లు రికార్డును కట్టబెట్టారు.

2019లో అలానిస్‌ అవెంజర్స్‌:ఎండ్‌గేమ్‌ సినిమాను 191 సార్లు చూసి రికార్డు సృష్టించాడు. అయితే గతేడాది అర్నాడ్‌ క్లీన్‌ అనే వ్యక్తి కామెలాట్‌: ఫస్ట్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ మూవీని 204సార్లు చూసి ఆ రికార్డు బ్రేక్‌ చేశాడు. అప్పటి నుంచీ తన రికార్డును తిరిగి పొందాలన్న పట్టుదల అలానిస్‌లో పెరిగింది. 2019లో తాను రికార్డు పొందే ముందే తన నానమ్మ చనిపోయింది. ఆమె కోసమైనా ఆ రికార్డును తిరిగి పొందాలనుకొని ఈసారి స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌ మూవీపై దండయాత్ర చేశాడు.

ఈ రికార్డు కోసం మొదట్లో కొన్ని వారాల పాటు రోజుకు ఐదు షోలు చూశాడట. నిజానికి ఈ రికార్డు అంత ఈజీగా ఏమీ ఇవ్వరు. ఏదో ఇన్నిసార్లు సినిమా చూశానని చెప్పినా కుదరదు. సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు సినిమా మాత్రమే చూడాలి. అలా కాకుండా టికెట్‌ కొన్నాం కదా అని ఫోన్‌ చూడటం, టాయిలెట్‌కు వెళ్లడం, ఇతర పనులు వంటివి చేయకూడదు. ప్రతిసారీ సినిమా పూర్తై, ఎండ్‌ క్రెడిట్స్‌ పడే వరకూ చూడాలి. 2019లో అలానిస్‌ ఇలాగే మధ్యలో బాత్‌రూమ్‌ బ్రేక్స్‌ తీసుకోవడంతో 11సార్లు సినిమా చూసినా.. వాటిని డిస్‌క్వాలిఫై చేయడం విశేషం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్