Salman Khan |విభేదాలతో తప్పుకున్న దర్శకుడు..మెగాఫోన్ పట్టిన సల్మాన్...-salman khan turns director for kabhi eid kabhi diwali movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Salman Khan Turns Director For Kabhi Eid Kabhi Diwali Movie

Salman Khan |విభేదాలతో తప్పుకున్న దర్శకుడు..మెగాఫోన్ పట్టిన సల్మాన్...

HT Telugu Desk HT Telugu
May 22, 2022 01:27 PM IST

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కభీ ఈద్ కభీ దివాలీ మరోమారు బాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి ఫర్హాద్ సమ్జీ తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ (twitter)

సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దివాళీ సినిమా ఆరంభం నుంచి వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ తో విభేదాలు నెలకొనడంతో దర్శకుడు ఫర్హాద్ సమ్జీ ఈ సినిమా నుంచి వైదొలిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

2021 అక్టోబర్ లో సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాళీ సినిమా చేయబోతున్నట్లుగా నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా ప్రకటించారు. ఫర్హాద్ సమ్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. కానీ కొవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. చాలా రోజుల పాటు సల్మాన్ ఖాన్ తో పాటు టీమ్ నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. వీటిని చిత్ర యూనిట్ కొట్టిపడేసింది. 

ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది. చిత్రీకరణ మొదలైన తొలిరోజునే పొడవైన క్రాఫ్ తో కూడిన సల్మాన్ ఖాన్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా సల్మాన్ ఖాన్ తో పాటు నిర్మాతలతో ఏర్పడిన విభేదాల కారణంగా దర్శకుడు ఫర్హాద్ సమ్జీ ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

ఫస్ట్ షెడ్యూల్ లో అతడు తెరకెక్కించిన సీన్స్ రషెస్ చూసిన సల్మాన్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి. వాటిని మళ్లీ రీషూట్ యూనిట్ కు సూచించినట్లు తెలిసింది.  సల్మాన్  నిర్ణయంతో కలత చెందిన ఫర్హాద్ షూటింగ్ కు రావడం లేదని అంటున్నారు. దాంతో ఫర్హాద్ స్థానంలో దర్శకత్వ బాధ్యతల్ని సల్మాన్ ఖాన్ చేపట్టినట్లు తెలిసింది. గత రెండు, మూడు రోజులుగా డైరెక్షన్ వ్యవహారాలను అతడే స్వయంగా చూసుకుంటున్నట్లుగా తెలిసింది. 

అక్షయ్ కుమార్ హీరోగా ఫర్హాద్ సమ్జీ దర్శకత్వంలో రూపొందిన బచ్చన్ పాండే చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.   వంద కోట్లకుపైగా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది. ఆ సినిమా పరాజయం కూడా దర్శకుడి తొలగింపునకు ఓ కారణమని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్స్ సహకారంతో సల్మాన్ ఈ సినిమాను పూర్తిచేయబోతున్నట్లు చెబుతున్నారు.

 ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు అతడి సోదరి భర్త ఆయుష్ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆయుష్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 30న కభీ ఈద్ కభీ దివాళీ సినిమా విడుదలకానుంది. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది.  

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్