Run Baby Run Review: ర‌న్ బేబీ ర‌న్ మూవీ రివ్యూ - మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఎలా ఉందంటే-run baby run movie telugu review rj balaji aishwarya rajesh movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Run Baby Run Movie Telugu Review Rj Balaji Aishwarya Rajesh Movie Review

Run Baby Run Review: ర‌న్ బేబీ ర‌న్ మూవీ రివ్యూ - మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Mar 15, 2023 05:52 AM IST

Run Baby Run Review: ఆర్‌జే బాలాజీ, ఐశ్వ‌ర్య‌రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ర‌న్ బేబీ ర‌న్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజైంది.

ఆర్‌జే బాలాజీ, ఐశ్వ‌ర్య‌రాజేష్
ఆర్‌జే బాలాజీ, ఐశ్వ‌ర్య‌రాజేష్

Run Baby Run Review: ఆర్‌జే బాలాజీ, ఐశ్వ‌ర్య‌రాజేష్(Aishwarya Rajesh) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం ర‌న్ బేబీ ర‌న్‌. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు జియేన్ కృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇటీవ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ద్వారా త‌మిళంతో పాటు తెలుగులో రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...

కామ‌న్ మ్యాన్ క‌థ‌...

స‌త్య ( ఆర్ జే బాలాజీ) ఓ సాధార‌ణ బ్యాంక్ ఉద్యోగి. ప్రియాంక అనే అమ్మాయితో అత‌డికి పెళ్లి కుదురుతుంది. కాబోయే భార్య‌కు గిఫ్ట్ కొన‌డానికి షాపింగ్‌కు వెళ‌తాడు. ఆ స‌మ‌యంలో స‌త్య‌కే తెలియ‌కుండా అత‌డి కారులో తార (ఐశ్వ‌ర్య రాజేష్‌) అనే మెడిసిన్ చ‌దువుతోన్న అమ్మాయి దాక్కుటుంది. తాను స‌మ‌స్య‌ల్లో ఉన్నాన‌ని, రెండు గంట‌లు ఇంట్లో ఆశ్ర‌యం ఇవ్వ‌మ‌ని స‌త్య‌ను తార రిక్వెస్ట్ చేస్తుంది. ప‌రిచ‌యం లేని అప‌రిచితురాలికి త‌న ఇంట్లో ఆశ్ర‌యం ఇవ్వన‌ని అంటాడు స‌త్య‌.

తార బ‌తిమిలాడ‌టంతో ఒప్పుకుంటాడు. అదేరోజు అనూహ్యంగా స‌త్య‌ ఇంట్లోనే తార హ‌త్య‌కు గుర‌వుతుంది. త‌న‌పై ఆ హ‌త్యానేరం ప‌డుతుంద‌నే భ‌యంతో స్నేహితుడైన ఓ పోలీస్ కానిస్టేబుల్ స‌ల‌హాతో డెడ్‌బాడీని మాయం చేయాల‌ని అనుకుంటాడు స‌త్య‌. ఆ డెడ్‌బాడీని వ‌దిలించుకునే క్ర‌మంలో స‌త్య చేసిన పొర‌పాటు వ‌ల్ల ఓ అమాయ‌కుడు చ‌నిపోతాడు.

తార‌ను హ‌త్య చేసిన హంత‌కుడు స‌త్య పెళ్లిని చెడ‌గొడ‌తాడు. అత‌డిని చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. ఈ నేరం చేస్తున్న‌ది ఎవ‌రో తెలుసుకోవాల‌ని స‌త్య నిర్ణ‌యించుకుంటాడు. తార గురించి అన్వేష‌ణ‌లో అత‌డు తెలుసుకున్న నిజాలేమిటి? తారను చంపింది ఎవ‌రు? అత‌డిని స‌త్య ఎలా ప‌ట్టుకున్నాడు? అన్న‌దే (Run Baby Run Review)ఈ సినిమా క‌థ‌.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ...

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ సినిమాల మెయిన్ స్టోరీలైన్ దాదాపు అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటుంది. త‌మ ఆప్తులు లేదా అయిన‌వాళ్లు చ‌నిపోవ‌డం, హంత‌కుల్ని హీరో త‌న తెలివితేట‌ల‌తో ప‌ట్టుకోవ‌డం అనే క‌థాంశం చుట్టూ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ సినిమాలు న‌డుస్తుంటాయి. ర‌న్ బేబీ ర‌న్ సినిమా థీమ్ ఇదే అయినా క‌థ‌ను న‌డిపించే విష‌యంలో ద‌ర్శ‌కుడు కొత్త‌గా అడుగులు వేశాడు.

అప‌రిచితురాలి కోసం...

త‌న‌కు ఏ మాత్రం సంబంధంలేని ఓ అప‌రిచుతురాలైన అమ్మాయి హ‌త్య వెనుక దాగున్న మిస్ట‌రీని ఓ కామ‌న్ మ్యాన్‌ ఎలా ఛేదించాడ‌నే పాయింట్‌తో ర‌న్ బేబీ ర‌న్ రూపొందింది. మెడిక‌ల్ కాలేజీల‌లో జ‌రిగే దారుణాల్ని సందేశాత్మ‌కంగా చూపించారు. హంత‌కుల్ని ప‌ట్టుకొనే విష‌యంలో హీరో ఇంటిలిజెన్స్‌ను చూపించ‌డం, అడ్డొచ్చిన విల‌న్స్ అంద‌రిని త‌క్కురేగ్గొట్ట‌డం లాంటి క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా సీన్స్‌లో సినిమాలో(Run Baby Run Review) లేవు. రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో ద‌ర్శ‌క‌డు చివ‌రి వ‌ర‌కు సినిమాను న‌డిపించాడు.

పిరికివాడు...ధైర్య‌వంతుడిగా...

స‌మ‌స్య‌ల‌కు భ‌య‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని స‌త్య నిర్ణ‌యించుకునే సీన్‌తోనే సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత అత‌డి జీవితంలో ఏం జ‌రిగింద‌న్న‌ది ప్లాష్‌బ్యాక్ ద్వారా చూపించాడు. స‌త్య ఇంట్లోనే ఆమె హ‌త్య‌కు గుర‌వ్వ‌డం, ఆమె డెడ్‌బాడీని దాచేందుకు స‌త్య చేసేప్ర‌య‌త్నాల చుట్టూ ఫ‌స్ట్ హాఫ్ సాగుతుంది.

పిరికివాడిగా ఉన్న హీరోలో అమ్మ ఎలా ధైర్యం నూరిపోసింద‌నే సెంటిమెంట్‌ను సీన్‌ను వ‌ర్క‌వుట్ చేసుకుంటూ స‌త్య మ‌ర్డ‌ర్ ఇన్వేస్టిగేష‌న్ మొద‌ల‌వుతుంది. తార హ‌త్య‌కు సంబంధించి ఒక్కో ఆధారాన్ని ఛేదిస్తూ స‌త్య ముందుకు వెళ్లే సీన్స్‌తో ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ స‌న్నివేశాల‌ను స‌స్పెన్స్ రివీల్ కాకుండా రాసుకోవ‌డం బాగుంది.

నాచుర‌ల్ యాక్టింగ్‌...

స‌త్య అనే సాధార‌ణ యువ‌కుడిగా ఆర్ జే బాలాజీ యాక్టింగ్ నాచుర‌ల్‌గా ఉంది. స‌హాయం చేయ‌బోయి ఆప‌ద‌లో ప‌డే వ్య‌క్తిగా అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్ ను రాసుకున్న తీరు బాగుంది. తారగా ఐశ్వ‌ర్య‌రాజేష్ అతిథి పాత్రే అని చెప్పుకోవ‌చ్చు.

సినిమాలో ఐశ్వ‌ర్య రాజేష్‌ స్క్రీన్ ప్ర‌జెన్స్ త‌క్కువే అయినా ఆమెపాత్ర చుట్టే సినిమా తిరుగుతుంది. రాధికా శ‌ర‌త్‌కుమార్‌, జ‌య‌ప్ర‌కాష్‌తో పాటు మిగిలిన న‌టీన‌టుల యాక్టింగ్ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా కుదిరింది.

Run Baby Run Review:-మంచి ప్ర‌య‌త్నం...

ర‌న్ బేబీ ర‌న్ ఆద్యంతం థ్రిల్లింగ్‌ను పంచ‌క‌పోయినా మంచి ప్ర‌య‌త్నంగా మాత్రం ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది. క్రైమ్ జోన‌ర్ సినిమాల్ని ఇష్ట‌ప‌డేవారిని ఈ త‌మిళ సినిమా మెప్పిస్తుంది.

IPL_Entry_Point