Telugu News  /  Entertainment  /  Reiki Veyi Kallu Movie Telugu Review Arulnithi Mahima Nambiar
రేయికి వేయిక‌ళ్ళు
రేయికి వేయిక‌ళ్ళు (Twitter)

Reiki Veyi Kallu Movie Review: రేయికి వేయి క‌ళ్ళు మూవీ రివ్యూ - మైండ్ గేమ్ థ్రిల్ల‌ర్ సినిమా ఎలా ఉందంటే

02 October 2022, 10:04 ISTNelki Naresh Kumar
02 October 2022, 10:04 IST

Reiki Veyi Kallu Movie Review: అరుళ్‌నిధి, మ‌హిమా నంబియార్ జంట‌గా త‌మిళంలో 2018లో విడుద‌లైన ఇరవుక్కు ఆయిరం కనగల్ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను రేయికి వేయిక‌ళ్ళు పేరుతో ఆహ ఓటీటీ విడుద‌ల‌చేసింది.

Reiki Veyi Kallu Movie Review: అరుళ్‌నిధి, మ‌హిమా నంబియార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం ఇరవుక్కు ఆయిరం కనగల్. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు మార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2018లో కోలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుద‌లైన ఇర‌వుక్కు అయిరం క‌న‌గ‌ల్ పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమా తెలుగులో రేయికి వేయిక‌ళ్ళు పేరుతో ఇటీవ‌ల ఆహా ఓటీటీలో (Aha ott)విడుద‌లైంది. స‌మ‌కాలీన స‌మ‌స్య‌కు ల‌వ్ స్టోరీ, మిస్ట‌రీ అంశాలు జోడించి తెర‌కెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...

ట్రెండింగ్ వార్తలు

క్యాబ్ డ్రైవ‌ర్ క‌థ‌

భ‌ర‌త్ (అరుళ్ నిధి) ఓ కాల్ టాక్సీ డ్రైవ‌ర్. హాస్పిట‌ల్‌లో న‌ర్స్‌గా ప‌నిచేసే సుశీల‌ను (మ‌హిమా నంబియార్‌) ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటారు. గ‌ణేష్ (అజ్మ‌ల్‌)అనే ఆక‌తాయి ప్రేమించ‌మంటూ సుశీల వెంట‌ప‌డుతుంటాడు. గ‌ణేష్ వ‌ల్ల సుశీల‌తో పాటు చాలా మంది అమ్మాయిలు ఇబ్బందులు ప‌డుతున్నార‌నే నిజం భ‌ర‌త్‌కు తెలుస్తుంది. గ‌ణేష్‌కు వార్నింగ్ ఇవ్వ‌డం కోసం అత‌డి ఇంటికి వెళ్తాడు భ‌ర‌త్‌. కానీ ఆ ఇంటిలో మాయ (సుజా వ‌రుణి) అనే అమ్మాయి మ‌ర్డ‌ర్ చేయ‌బ‌డి ఉంటుంది. ఆ హ‌త్య‌ కేసు భ‌ర‌త్‌పై ప‌డుతుంది. తాను చేయ‌ని హ‌త్య‌లో భ‌ర‌త్ ఎలా ఇరుక్కున్నాడు. మాయ‌ను హ‌త్య చేసింది ఎవ‌రు? అస‌లైన హంత‌కుడిని భ‌ర‌త్ ఎలా ప‌ట్టుకున్నాడు. ఈ హ‌త్య కేసుతో శోభ‌న, వ‌సంత్‌, మ‌హేష్‌, న‌రేన్‌ల‌కు ఉన్న సంబంధం ఏమిటి? అన్న‌దే రేయికి వేయిక‌ళ్ళు క‌థ‌.

ఆక‌ట్టుకునే ట్విస్ట్‌లు(Reiki Veyi Kallu Movie Review)

మైండ్ గేమ్ ఆధారంగా సాగే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఇది. ఊహ‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో రేయికి వేయిక‌ళ్ళు కథ‌ను బాగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు మారాన్‌. త‌న జీవితంలో ఎదురైన క్లిష్ట స‌మ‌స్య నుంచి క్యాబ్ డ్రైవ‌ర్ తెలివితేట‌ల‌తో ఎలా బ‌య‌ట‌ప‌డ్డడ‌నే పాయింట్‌కు స‌స్పెన్స్‌, థ్రిల్ జోడించి సినిమాను తెర‌కెక్కించాడు. మంచివారిగా న‌టిస్తూ అశ్లీల వీడియోల‌తో కొంద‌రు ఆక‌తాయిలు అమ్మాయిల‌ను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తూ డ‌బ్బులు దండుకుంటున్నార‌నే స‌మ‌కాలీన స‌మ‌స్య‌ను ద‌ర్శ‌కుడు మార‌న్ ఇందులో చ‌ర్చించారు. ఆక‌తాయిల వ‌ల‌లో ప‌డిన మ‌హిళ‌ల జీవితాలు చివ‌ర‌కు ఎలా ముగిసిపోతాయో చూపించారు. ప్రేమ‌క‌థను మెయిన్ పాయింట్‌గా తీసుకుంటూ చివ‌ర‌కు వ‌ర‌కు ట్విస్ట్ రివీల్ కాకుండా ఉత్కంఠ‌భ‌రితంగా సినిమాను న‌డిపించాడు.

ఫ‌స్ట్ హాఫ్ మైన‌స్‌...

రేయికి వేయిక‌ళ్ళు సినిమా మెయిన్ పాయింట్ బాగున్నా క‌థ‌లోని వెళ్ల‌డానికి ద‌ర్శ‌కుడు ఎక్కువ స‌మ‌యం తీసుకోవ‌డ‌మే ఇబ్బంది పెడుతుంది. ఫ‌స్ట్‌హాప్ మొత్తం పాత్ర‌ల ప‌రిచ‌యానికే కేటాయించారు.

భ‌ర‌త్‌, సుశీల ప్రేమ‌క‌థ‌లో ఆస‌క్తి లోపించింది క‌థ ఎంత‌కు ముందుకు క‌ద‌ల‌క ఇబ్బంది పెడుతుంది. హ‌త్య కేసులో భ‌ర‌త్ ఇరుక్కున్న త‌ర్వాత నుంచే సినిమా చ‌క చ‌కా ప‌రుగులు పెడుతుంది.

మాయను హ‌త్య చేసిన వ్య‌క్తి గురించి అన్వేషించే క్ర‌మంలో ఒక్కో కొత్త పాత్ర ఎంట్రీ ఇవ్వ‌డం ఆస‌క్తిని పంచుతుంది. ప్ర‌తి ఒక్క‌రిని హంత‌కుడు అని అనుమానించేలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపించారు ద‌ర్శ‌కుడు. చివ‌ర్లో వ‌చ్చే ట్విస్ట్ మాత్రం బాగుంది. అస‌లు హంత‌కుడు ఎవ‌రో ర‌చ‌యిత్రి ద్వారా చెప్పించ‌డం ఆక‌ట్టుకుంటుంది. ఆ త‌ర్వ‌త మ‌రో మ‌లుపుతో రేయికి వేయిక‌ళ్ళు సినిమాను ముగించారు. .

పోటాపోటీగా...

క్యాబ్ డ్రైవ‌ర్ భ‌ర‌త్‌గా అరుళ్‌నిధి(Arulnithi) న‌ట‌న రేయికి వేయిక‌ళ్ళు సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ప్రియురాలిని కాపాడ‌టం కోసం ప్రాణాల‌కు తెగించి పోరాడే ప్రేమికుడిగా సెటిల్డ్‌గా న‌టించాడు. మోసాలు చేస్తూ బ‌తికే ప్లేబోయ్ త‌ర‌హా క్యారెక్ట‌ర్‌లో రంగం ఫేమ్ అజ్మ‌ల్ క‌నిపించాడు. అరుళ్‌నిధి, అజ్మ‌ల్ పాత్ర‌లు పోటాపోటీగా సినిమాలో సాగుతాయి. సుశీల‌గా మ‌హిమా నంబియార్ అందంగా క‌నిపించింది. కానీ యాక్టింగ్ ప‌రంగా తేలిపోయింది. ఆనంద్‌రాజ్ కామెడీ కొన్ని చోట్ల వ‌ర్క‌వుట్ అయ్యింది.

డీసెంట్ థ్రిల్ల‌ర్‌...)Reiki Veyi Kallu Movie Review)

రేయికి వేయిక‌ళ్లు డిఫ‌రెంట్‌ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఆక‌ట్టుకుంటుంది. ఫ‌స్ట్ హాఫ్‌ను ఓపిక‌గా భ‌రిస్తే సెకాండాఫ్‌ను మాత్రం ఎంజాయ్ చేసేయ‌చ్చు.

రేటింగ్ : 2.5/5