Mukhbir Web Series Review: ముఖ్‌బీర్ వెబ్‌సిరీస్ రివ్యూ - స్పై థ్రిల్ల‌ర్ సిరీస్ ఎలా ఉందంటే-mukhbir web series telugu review prakashraj spy thriller web series review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mukhbir Web Series Telugu Review Prakashraj Spy Thriller Web Series Review

Mukhbir Web Series Review: ముఖ్‌బీర్ వెబ్‌సిరీస్ రివ్యూ - స్పై థ్రిల్ల‌ర్ సిరీస్ ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Nov 17, 2022 06:45 AM IST

Mukhbir Web Series Review: ప్ర‌కాష్‌రాజ్‌, జైన్‌ఖాన్ దురానీ, ఆదిల్ హుస్సేన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన హిందీ వెబ్ సిరీస్ ముఖ్‌బీర్‌. 1965 ఇండియా పాకిస్థాన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సిరీస్ ఇటీవ‌ల జీ5 ఓటీటీ ద్వారా విడుద‌లైంది.

ముఖ్‌బీర్ వెబ్‌సిరీస్‌
ముఖ్‌బీర్ వెబ్‌సిరీస్‌

Mukhbir Web Series Review: టాలీవుడ్‌, బాలీవుడ్ అనే భేదాలు లేకుండా ప్ర‌స్తుతం స్పై థ్రిల్ల‌ర్ ట్రెండ్ న‌డుస్తోంది. ఈ స్పై థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సినిమాల‌తో పాటు ప‌లు వెబ్‌సిరీస్‌లు రూపొందుతోన్నాయి. ఈ జోన‌ర్‌లో వ‌చ్చిన తాజా సిరీస్ ముఖ్‌బీర్‌. ప్ర‌కాష్‌రాజ్‌, జైన్‌ఖాన్ దురానీ, ఆదిల్ హుస్సేన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సిరీస్‌కు శివ‌మ్ నాయ‌ర్‌, జ‌య్‌ప్ర‌ద్ దేశాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 1965 ఇండియా- పాకిస్థాన్ యుద్ధం నేప‌థ్యంలో ఎనిమిది ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్ జీ5 ఓటీటీలో విడుద‌లైంది. ఈ సిరీస్ ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా లేదా చూద్దాం…

Mukhbir Story ఆప‌రేష‌న్ జిబ్రాల్ట‌ర్…

ఆప‌రేష‌న్ జిబ్రాల్ట‌ర్ పేరుతో క‌శ్మీర్‌లో భారీ కుట్ర‌ల‌కు పాకిస్థాన్ వ్యూహ‌ర‌చ‌న చేస్తుంది. క‌శ్మీర్‌తో పాటు భారత‌దేశంలోని ప‌లు ప్రాంతాల‌పై మెరుపు దాడులు చేసేందుకు కుట్ర‌లు ప‌న్నుతుంది . పాక్ ప‌న్నాగాల గురించి ఇంటెలిజెన్స్‌ ఆఫీస‌ర్స్ మూర్తి (ప్ర‌కాష్ రాజ్‌), బ‌ర్మ‌న్‌ల‌కు (సునీల్‌) తెలుస్తుంది. శ‌త్రుదేశం చేస్తోన్న ప్లాన్స్ గురించి తెలుసుకోవ‌డానికి క‌మ్ర‌న్ బ‌క్ష్ (జైన్ ఖాన్ దురానీ) అనే సామాన్యుడిని గూఢ‌చారిగా పాకిస్థాన్‌కు పంపిస్తాడు మూర్తి.

హ‌ర్ఫ‌న్‌ బుకారీ అనే మారుతో పాకిస్థాన్‌లోకి ఎంట‌రైన క‌మ్ర‌న్ త‌న తెలివితేట‌ల‌తో పాకిస్థాన్ ఆర్మీ మేజ‌ర్ జ‌న‌ర‌ల్‌తో పాటు బ్రిగేడియ‌ర్ హ‌బీబుల్లాను బోల్తా కొట్టిస్తూ అవ‌స‌ర‌మైన స‌మాచారం సేక‌రిస్తాడు. ఈ క్ర‌మంలో త‌న అవ‌స‌రాల కోసం గ‌జ‌ల్ సింగ‌ర్ బేగ‌మ్ అన‌ర్‌తో (బ‌ర్కా బిస్త్‌) పాటు ఫొటోగ్రాఫ‌ర్ జ‌మీలా అహ్మ‌ద్‌ను (జోయా అఫ్రోజ్‌) క‌మ్రన్ ఎలా వాడుకున్నాడు. క‌మ్ర‌న్ స్పై అనే విష‌యాన్ని పాకిస్థాన్ సైన్యం క‌నిపెట్టిందా? అత‌డు ప్రాణాల‌తో పాకిస్థాన్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా? పాకిస్థాన్‌పై భార‌త విజ‌యానికి అత‌డు అందించిన స‌మాచారం ఉప‌యోగ‌ప‌డిందా లేదా అన్న‌దే ముఖ్‌బీర్ సిరీస్ క‌థ‌.

సూప‌ర్ హీరో క‌థ ...

సాధార‌ణంగా స్పై థ్రిల్ల‌ర్ క‌థ‌లు ఎక్కువ‌గా యాక్ష‌న్‌తో ముడిప‌డిఉంటాయి. సూప‌ర్ హీరో త‌ర‌హాలో టైటిల్ పాత్ర‌ధారి చేసే సాహ‌సాలు, ఫైట్స్‌తో ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేస్తుంటాయి. సిరీస్‌, సినిమా ఏదైనా ఫార్మెట్‌ మాత్రం ఒకేలా ఉంటుంది. కానీ ముఖ్‌బీర్ మాత్రం అందుకు భిన్న‌మైన సిరీస్‌గా చెప్ప‌వ‌చ్చు.

డ్రామా ప్ర‌ధానంగా సాగే స్పై థ్రిల్ల‌ర్ సిరీస్ ఇది. స‌హ‌జ‌త్వానికి ప్రాధాన్య‌మిస్తూ ద‌ర్శ‌కులుశివ‌మ్ నాయ‌ర్, జ‌య్‌ప్ర‌ద్‌దేశాయ్ ముఖ్‌బీర్ సిరీస్ తెర‌కెక్కించారు. 1965 యుద్ధంలో ఇండియా గెలుపుకు కార‌ణ‌మైన స్పై జీవితాల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ క‌థ‌ను రాసుకున్నారు. తాము పేప‌ర్‌పై ఏదైతే రాసుకున్నారో దానిని నిజాయితీగా తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

ఎంగేజింగ్‌...

ముఖ్‌బీర్ క‌థ‌ను ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఎంగేజింగ్‌గా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కులు. శ‌త్రుదేశం వేస్తోన్న ప్లాన్స్ తెలుసుకోవ‌డానికి మారుపేరుతో పాకిస్థాన్‌లోకి క‌మ్ర‌న్ అడుగుపెట్ట‌డం, అక్క‌డ అత‌డికి ఎదురైన ప‌రిణామాల్ని ఊహ‌ల‌కు అంద‌ని మ‌లుపుల‌తో ఉత్కంఠ‌భ‌రితంగా చూపించారు. త‌న మాట‌ల గార‌డితో బ్రిగేడియ‌ర్‌ను క‌మ్ర‌న్ బోల్తా కొట్టించే సీన్స్‌ను గ్రిప్పింగ్‌గా ఆవిష్క‌రించారు.

త‌న‌కు కావాల్సిన స‌మాచారం తెలుసుకోవ‌డం కోసం క‌మ్ర‌న్ గ‌జ‌ల్ సింగ‌ర్ తో పాటు ఫొటోగ్రాఫ‌ర్‌ను ప్రేమిస్తున్న‌ట్లుగా నాట‌కం ఆడే స‌న్నివేశాల‌ను క‌న్వీన్సింగ్‌గా చూపించారు. ముఖ్యంగా బేగ‌మ్ ఆన‌ర్ క్యారెక్ట‌ర్ విషాదాంతంగా ముగిసే సీన్ నుంచి ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ అయ్యాయి. మారుపేరుతో ఓ కుటుంబంలోకి ఎంట‌రైన క‌మ్ర‌న్ వారి ప్రేమ‌కు, క‌ర్త‌వ్యానికి మ‌ధ్య న‌లిగిపోయే సీన్స్ ఆక‌ట్టుకుంటాయి.

అలియాభ‌ట్ సినిమాతో పోలిక‌...

ముఖ్‌బీర్ సిరీస్ అలియా భ‌ట్ రాజీ సినిమాకు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. చాలా చోట్ల రాజీ క‌థ‌తో పోలిక‌లు క‌నిపిస్తాయి. క‌మ్ర‌న్ మాట‌ల‌ను పాక్ ఆర్మీ జ‌న‌ర‌ల్ మేజ‌ర్ కూడా తొంద‌ర‌గా న‌మ్మేయ‌డం, తాను అనుకున్న‌వ‌న్ని క‌మ్ర‌న్ సులువుగా చేసేయ‌డం కొన్ని చోట్ల లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. క‌థాగ‌మ‌నం చాలా నెమ్మ‌దిగా సాగుతుంది. క‌మ్ర‌న్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాగ‌దీసిన‌ట్లుగా అనిపిస్తాయి. ఫొటోగ్రాఫ‌ర్‌తో క‌మ్ర‌న్ ల‌వ్ స్టోరీలో ఆస‌క్తి లోపించింది.

దురాని మెప్పించాడు…

క‌మ్ర‌న్ పాత్ర‌లో జైన్‌ఖాన్ దురానీ అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. త‌న డైలాగ్ డెలివ‌రీ, ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. సిరీస్ మొత్తం అత‌డి పాత్ర చుట్టే తిరుగుతుంది. మూర్తి అనే ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌గా ప్ర‌కాష్‌రాజ్‌కు ఇలాంటి క్యారెక్ట‌ర్స్ కొట్టిన పిండే. సింపుల్‌గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. బేగ‌మ్ అన‌ర్‌గా బ‌ర్కా బిస్త్ స‌హ‌జ రియ‌లిస్టిక్ యాక్టింగ్‌తో మెప్పించింది. పాక్ ఆర్మీ మేజ‌ర్‌గా హ‌ర్ష్ ఛ‌య్యా డైలాగ్స్‌తోనే విల‌నిజాన్ని చ‌క్క‌గా ప‌డించాడు.

Mukhbir Web Series Review -ఓవ‌రాల్‌గా ఒకే…

ముఖ్‌బీర్ రియ‌లిస్టిక్ సై థ్రిల్ల‌ర్ సిరీస్‌గా ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది. అయితే క‌థ‌, క‌థ‌నాల్లో వేగం త‌గ్గ‌డం, ఎక్కువ‌గా ట్విస్ట్‌లు లేక‌పోవ‌డంతో కొంత ఇబ్బంది పెడుతుంది. ఓవ‌రాల్‌గా మంచి స్పై థ్రిల్ల‌ర్ సిరీస్ చూసిన ఫీలింగ్‌ను మాత్రం ఇస్తుంది.

రేటింగ్‌: 2.75/5

IPL_Entry_Point