Puzhu review | పురు రివ్యూ...విల‌నిజంతో అద‌ర‌గొట్టిన మ‌మ్ముట్టి-mammootty puzhu movie telugu review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Puzhu Review | పురు రివ్యూ...విల‌నిజంతో అద‌ర‌గొట్టిన మ‌మ్ముట్టి

Puzhu review | పురు రివ్యూ...విల‌నిజంతో అద‌ర‌గొట్టిన మ‌మ్ముట్టి

HT Telugu Desk HT Telugu
May 14, 2022 06:43 AM IST

మ‌ల‌యాళ అగ్ర‌న‌టుడు మ‌మ్ముట్టి ఓటీటీలోకి అరంగేట్రం చేస్తూ న‌టించిన చిత్రం పురు(puzhu). సామాజిక ఇతివృత్తంతో తెర‌కెక్కిన ఈ సినిమాలో మ‌మ్ముట్టి నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా ఎలా ఉందంటే...

మ‌మ్ముట్టి, పార్వ‌తి
మ‌మ్ముట్టి, పార్వ‌తి (twitter)

పురు(puzhu) సినిమా రివ్యూ:మలయాళ అగ్ర నటుడు మ‌మ్ముట్టి నటప్ర‌తిభ‌ను గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఐదు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో నాలుగు వంద‌ల‌కుపైగా సినిమాల్లో న‌టించారు మమ్ముట్టి. ఏడు ప‌దుల వ‌య‌సులోనూ విభిన్న‌మైన క‌థాంశాల‌ను ఎంచుకుంటూ న‌వ‌త‌రం హీరోల‌కు గట్టి పోటీనిస్తున్నారు.

న‌టుడిగా మ‌రోసారి వైవిధ్య‌త‌ను చాటుకుంటూ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర‌లో మ‌మ్ముట్టి న‌టించిన చిత్రం పురు. ఈ సినిమాతోనే ఆయ‌న డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లోకి అరంగేట్రం చేశాడు. రథీనా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా సోనిలివ్ ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

కుట్టన్ జీవితం..

కుట్ట‌న్ (మమ్ముట్టి) రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్‌. భార్య చ‌నిపోవ‌డంతో ఆమె జ్ఞాప‌కాల్ని త‌ల్చుకుంటూ జీవిస్తుంటాడు. కొడుకు కిచ్చునే (వాసుదేవ్) అత‌డికి స‌ర్వ‌స్వం. క్రమశిక్షణ పేరుతో కొడుకును తన అదుపులో ఉంచుకోవడానికి కుట్టన్ అనుక్షణం ప్రయత్నిస్తుంటాడు. తండ్రి మితిమీరిన ఆంక్ష‌ల వ‌ల్ల కిచ్చు ఇబ్బంది ప‌డుతుంటాడు. లోప‌ల ద్వేషం ఉన్నా తండ్రి ప‌ట్ల ఉన్న భ‌యం కార‌ణంగా బ‌య‌ట‌కు వ్య‌క్తం చేయ‌లేక‌పోతాడు. కుట్ట‌న్ సోద‌రి భార‌తి(పార్వతి) పెద్ద‌ల‌ను ఎదురించి కేపీ అనే ఓ రంగ‌స్థ‌ల క‌ళాకారుడిని ప్రేమ‌వివాహం చేసుకుంటుంది. కేపీది త‌మ‌కంటే త‌క్కువ కులం కావ‌డంతో కుట్ట‌న్ కుటుంబ‌స‌భ్యులు ఆమెను దూరం పెడ‌తారు. అనుకోకుండా కుట్ట‌న్ ఉండే అపార్ట్‌మెంట్‌లోకి భ‌ర్త‌తో క‌ల‌సి భార‌తి కొన్నాళ్లు ఉండాల్సిన ప‌రిస్థితులు వ‌స్తాయి. మ‌రోవైపు కుట్ట‌న్ చంపేందుకు అత‌డి శ‌త్రువులు చాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. దాంతో ప్ర‌తిరోజు ప్రాణ‌భ‌యంతోనే అత‌డు బ‌తుకుంటాడు. అత‌డిని చంప‌డానికి ప్ర‌య‌త్నించిన‌దెవ‌రు? సోద‌రుడి అపార్ట్‌మెంట్‌లోకి దిగిన భార‌తి జీవితం ఏమైంది? చెల్లి ప్రేమ‌ను కుట్ట‌న్ అర్థం చేసుకున్నాడా? కుట్ట‌న్ తో పాటు భార‌తి జీవితం చివ‌ర‌కు ఏ మ‌లుపులు తిరిగింద‌న్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

కుల వివక్ష నేపథ్యంలో..

కుల వివ‌క్ష, ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో తెలుగుతో పాటు వివిధ భాష‌ల్లో అనేక సినిమాలు రూపొందాయి. కులాల మ‌ధ్య ఉండే అంత‌రాల‌ను, అస‌మాన‌త‌ల‌ను భిన్న కోణాల్లో ఆవిష్క‌రిస్తూ ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. ఈ సినిమా కూడా ఆ పాయింట్‌తోనే తెర‌కెక్కింది. అట్ట‌డుగు వ‌ర్గాల్లోమాత్ర‌మే కాకుండా ఉన్న‌త కుటుంబాల్లో ఈ కుల వివ‌క్ష ఎక్కువ‌గానే ఉంటుంద‌ని ద‌ర్శ‌కురాలు ఇందులో చూపించారు. ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యానికి రివేంజ్ డ్రామాను జోడించి సినిమాను తెర‌కెక్కించారు. కుటుంబ ప్ర‌తిష్ట, కుల గౌర‌వం ముఖ్య‌మ‌ని న‌మ్మే ఓ వ్య‌క్తి జీవితం చివ‌ర‌కు ఎలా ముగిసిందో హృద్యంగా ఆవిష్క‌రించారు.

కామెడీ ఉండదు..

రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా సాగుతుంది. ఇందులో హీరోయిన్ క్యారెక్ట‌ర్ ఉండ‌దు. పాట‌లు, రొమాన్స్, కామెడీ ట్రాక్ ల ఊసు క‌నిపించ‌దు. ఆద్యంతం నాట‌కీయ‌త‌, థ్రిల్లింగ్ అంశాల‌తో సీరియ‌స్‌గా సినిమా సాగుతుంది.

క్లైమాక్స్ బలం..

ప్ర‌థ‌మార్థం మొత్తం కుట్ట‌న్‌తో పాటు అత‌డి కొడుకు కిచ్చు పాత్ర‌ల నేప‌థ్యంలో క‌థ నడుస్తుంది. తండ్రీకొడుకుల రొటీన్ జీవితాల్ని చూపిస్తూనే త‌న ప్రాణాల‌ను కాపాడుకోవ‌డానికి కుట్ట‌న్ ప‌డే తాప‌త్ర‌యాన్ని ఆస‌క్తిక‌రంగా చూపించారు. ద్వితీయార్థం కుట్ట‌న్‌లో మార్పు కోసం సోద‌రి భార‌తి ప్ర‌య‌త్నాలు చేయ‌డం, త‌న‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నించే శ‌త్రువు ఎవ‌రో తెలుసుకోవ‌డానికి కుట్ట‌న్ వేసే ప్లాన్స్ తో ఉత్కంఠను పంచుతుంది. ప్రీక్లైమాక్స్ తో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో దర్శకురాలు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. ఎండింగ్ ఈ సినిమాకు ప్ర‌ధాన‌బ‌లంగా నిలిచింది.

మమ్ముట్టి సాహసం

మ‌మ్ముట్టి(mammootty) న‌ట‌న‌, క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి. నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఇలాంటి క్యారెక్ట‌ర్‌ను స్టార్‌డ‌మ్ ఉన్న న‌టుడు చేయ‌డం అంటే సాహ‌స‌మ‌నే చెప్పుకోవాలి. కానీ క‌థ‌, పాత్ర‌ను న‌మ్మి మ‌మ్ముట్టి ఈ సినిమాను అంగీక‌రించారు. అనుక్ష‌ణం చావు భ‌యంతో బ‌తికే రిటైర్డ్ పోలీస్ పాత్ర‌లో జీవించాడు. చివ‌ర‌కు త‌న సొంత కొడుకుతో పాటు సోద‌రిని కూడా అనుమానించే వ్య‌క్తిగా అసమాన నటనతో సినిమాను నిల‌బెట్టారు. మ‌మ్ముట్టి సోద‌రి పాత్ర‌లో పార్వ‌తి యాక్టింగ్ బాగుంది. కులం కంటే ప్రేమ గొప్ప‌ద‌ని న‌మ్మే యువ‌తిగా సందేశాత్మ‌కంగా ఆమె క్యారెక్ట‌ర్ సాగుతుంది. మ‌మ్ముట్టి కొడుకు పాత్ర‌లో బాలనటుడు వాసుదేవ్ కూడా చ‌క్క‌టి అభిన‌యాన్ని క‌న‌బ‌రిచాడు.

వేగం లోపించింది...

వేగం లోపించ‌డ‌మే సినిమాలో పెద్ద మైన‌స్ గా చెప్ప‌వ‌చ్చు. సినిమా మొత్తం నత్తనడకన సాగుతుంది. మ‌మ్ముట్టి, అత‌డి కొడుకు మ‌ధ్య వ‌చ్చే సీన్స్ రిపీటెడ్ ఫీలింగ్ ను కలిగిస్తాయి. సోద‌రిపై కుట్ట‌న్ ద్వేషం పెంచుకోవ‌డానికి, ఆమె జీవితం విష‌యంలో క‌ఠిన నిర్ణ‌యాల్ని తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల్ని స‌రిగా చూపించ‌లేదు. తెలుగు డబ్బింగ్ బాగాలేదు.

ఓపిక‌తో చూస్తే మంచి సినిమా చూసిన అనుభూతి క‌లుగుతుంది. మ‌మ్ముట్టి, పార్వ‌తి యాక్టింగ్ కోసం ఈ సినిమా చూడ‌వ‌చ్చు.

సినిమా రేటింగ్‌-2.5/5

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్