Khushbu Faces Sexual Abuse: నా తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. నటి షాకింగ్ కామెంట్స్-khushbu sundar syas her father sexually abused her when she was 8 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Khushbu Sundar Syas Her Father Sexually Abused Her When She Was 8

Khushbu Faces Sexual Abuse: నా తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. నటి షాకింగ్ కామెంట్స్

Maragani Govardhan HT Telugu
Mar 06, 2023 08:31 AM IST

Khushbu Faces Sexual Abuse: సౌత్ నటి, రాజకీయ నేత ఖుష్బూ తన చిన్నతనం గురించి షాకింగ్ విషయాలను తెలియజేశారు. తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని, తీవ్రంగా కొట్టేవాడని తెలిపారు. ఈ విషయం గురించి చెబితే తల్లి నమ్మదేమోనని భయపడినట్లు పేర్కొన్నారు.

ఖుష్బూ సుందర్
ఖుష్బూ సుందర్ (Ayush Sharma)

Khushbu Faces Sexual Abuse: లైంగిక వేధింపుల గురించి ఇటీవల కాలంలో చాలా మంది ముందుకు వచ్చి దైర్యంగా తమకు జరిగిన చేదు అనుభవాలను గురించి తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు ఈ విషయంలో బహిరంగంగా తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. తాజాగా సౌత్ నటి, రాజకీయనేత ఖుష్బూ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని పేర్కొన్నారు. అయితే అదెవరో బయట వ్యక్తి కాదని, తన సొంత తండ్రే ఆమె చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురి చేశారని స్పష్టం చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలా పాల్గొన్న ఖుష్బూ తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి వివరించారు. "చిన్నతనంలో ఎప్పుడైనా లైంగిక వేధింపులకు గురైతే ఆ పసివారికి జీవితాంతం భయం భయంగా ఉంటుంది. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా జీవితాంతం గుర్తుండిపోతుంది. మా అమ్మ వివాహ బంధం కూడా అత్యంత వేధనతో కూడుకుని ఉంది. ఆ మనిషి(ఖుష్బూ తండ్రి) భార్యను కొట్టడం తన జన్మ హక్కులా ఫీలయ్యేవాడు. పిల్లలను హింసించేవాడు, తన సొంత కూతురినే లైంగికంగా వేధించేవాడు. 8 ఏళ్ల వయస్సు నుంచే నాపై అతడి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. నాకు 15 ఏళ్లప్పుడు ఆ దాష్టికం గురించి బయటకు చెప్పే ధైర్యమొచ్చింది." అని ఖుష్బూ తన వేధనను తెలియజేశారు.

చిన్నతనంలో తనపై జరుగుతున్న అకృత్యాన్ని చెప్పుకునేందుకు ధైర్యముండేది కాదని, చాలా ఏళ్ల పాటు మౌనంగా ఉన్నానని ఖుష్బూ పేర్కొన్నారు. "నన్ను అన్నింటికంటే ఓ భయం ఎక్కువగా కలచి వేసేది. నేను చెప్పే విషయాన్ని మా అమ్మ నమ్మదేమోనని చాలా బాధపడేదాన్ని. ఎందుకంటే ఆమె.. తన భర్తే తనకు ప్రత్యక్ష దైవం అనే భావాన్ని కలిగి ఉండేది. కానీ 15 ఏళ్ల వయస్సులో బాధను భరించలేక అతడిపై తిరగబడ్డాను. నాకు 16 ఏళ్లు కూడా రాకముందే అతడు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పుడు మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే రేపటి భోజనం ఎక్కడ నుంచి వస్తుందో కూడా మాకు తెలియదు. అప్పుడే ధైర్యం కూడగట్టుకుని జీవితంలో పోరాడటం నేర్చుకున్నాను." అని ఖుష్బూ తెలియజేశారు.

జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఖుష్బూ తెలుగులో కలియుగ పాండవుల సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కోలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తమిళనాట ఆమెకు గుడి కూడా కట్టారంటే అక్కడ ఎంత పాపులర్ హీరోయిన్‌గా మారిందో తెలుసుకోవచ్చు. 2010లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఖుష్బూ.. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం