Avatar 2 new trailer: మరోసారి పండోరా ప్రపంచంలోకి.. విజువల్ వండర్‌గా అవతార్ 2 కొత్త ట్రైలర్
Avatar 2 new trailer: మరోసారి మనల్ని పండోరా ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి వచ్చేస్తోంది అవతార్ 2 మూవీ. 2009లో వచ్చిన అవతార్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా కొత్త ట్రైలర్ విజువల్ వండర్‌గా ఉంది.

Avatar 2 new trailer: అవతార్ మూవీ ఓ సంచలనం. జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2009లో రిలీజై ఇప్పటికీ ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ఈ మధ్యే మరోసారి థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ సీక్వెల్ అయిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16న రానుండటంతో ప్రమోషన్లలో భాగంగా అవతార్‌ను రీరిలీజ్ చేశారు.
ఇక బుధవారం (నవంబర్ 2) అవతార్ 2 కొత్త ట్రైలర్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 13 ఏళ్ల నిరీక్షణకు న్యాయం చేసేలా ఈ సీక్వెల్ ట్రైలరే కళ్లు చెదిరేలా ఉంది. పదేళ్లుగా చిత్రీకరణ కొనసాగుతున్న ఈ సినిమా ఓ విజువల్ వండర్‌గా ప్రేక్షకులను మరోసారి పండోరా ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. ఈ కొత్త ట్రైలర్ స్టన్నింగ్ విజువల్స్‌తో మూవీపై అంచనాలను మరింత పెంచేసింది.
ఇందులో జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్) తన కూతురిని ఇంట్రడ్యూస్ చేశాడు. అవతార్‌లో .తమ పండోరా ప్రపంచాన్ని మనిషి నుంచి కాపాడుకోవడానికి అక్కడి జీవులు భూమిపై ఫైట్ చేయగా.. ఈ రెండో పార్ట్‌లో అది కాస్త నీళ్లలోకి మారింది. తొలి పార్ట్‌లో కంటే అద్భుతమైన విజువల్స్ ఈ సీక్వెల్‌లో ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
పండోరా ప్రపంచంలోని సరికొత్త అందాలను అవతార్: ది వే ఆఫ్ వాటర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అత్యాధునిక అండర్ వాటర్ ఫొటోగ్రఫీ టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమా జేమ్స్ కామెరాన్ తెరకెక్కించాడు. అవతార్ 2తోపాటు అవతార్ 3 షూటింగ్‌ను కూడా ఒకేసారి అతడు తెరకెక్కించడం విశేషం. అయితే ఈ ఫ్రాంఛైజీలో రావాల్సిన నాలుగు, ఐదు భాగాల షూటింగ్‌లు మాత్రం ఈ రెండు సినిమాల సక్సెస్‌పై ఆధారపడి ఉంటుంది.
డిసెంబర్ 16న రానున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అవతార్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో అవతార్ 2 మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అవతార్‌ను మించిన కలెక్షన్లతో అవతార్: ది వే ఆఫ్ వాటర్ దూసుకెళ్లనుంది. మరోవైపు ఇక తన కెరీర్ మొత్తం అవతార్ మూవీలనే తీస్తానని ఇప్పటికే కామెరాన్ చెప్పాడు. అయితే అవతార్‌లో తన ప్రధాన కథను తీసిన తర్వాత మిగతా భాగాలను వేరే దర్శకులు తీసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.