ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు? అంచనాల విశ్లేషణకు ఎన్నో ప్రశ్నలు-unraveling the ap assembly election puzzle key questions and predictions ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు? అంచనాల విశ్లేషణకు ఎన్నో ప్రశ్నలు

ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు? అంచనాల విశ్లేషణకు ఎన్నో ప్రశ్నలు

HT Telugu Desk HT Telugu
Apr 18, 2024 12:43 PM IST

‘ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ‘గెలిచేదెవరు?’ అనే విశ్లేషణల జోరు అమలాపురం నుంచి అమెరికా వరకు ఊపందుకుంది. ఎవరికి నచ్చిన కూర వాళ్లు వండుకున్నట్టు, తమకు నచ్చిన పార్టీ, నచ్చిన కులానికి అనుగుణంగా వారు విశ్లేషణలు చేసుకుంటున్నారు..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చర్ ఐవీ మురళీకృష్ణ శర్మ విశ్లేషణ.

మార్చి 17న పల్నాడులో జరిగిన ఎన్డీయే కూటమి బహిరంగ సభలో ప్రధాన మంత్రి మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులు
మార్చి 17న పల్నాడులో జరిగిన ఎన్డీయే కూటమి బహిరంగ సభలో ప్రధాన మంత్రి మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులు (BJP Andhra Pradesh - X)

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎవరికి అనుగుణంగా వారు విశ్లేషణలు చేసుకుంటున్నారు. కానీ, ఏ విశ్లేషణ అయినా, నిష్పక్షపాతంగా, నిర్దాక్షిణ్యంగా చేస్తేనే నిజం బయటపడుతుంది. దీన్నొక రచ్చబండ చర్చలా, టీ స్టాల్‌ దగ్గర ముచ్చటలాగా కాకుండా, ప్రైమరీ, సెకండరీ డేటా సేకరించి, దానిని శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించాలి. ఏ గణాంకాలను, ఏ ప్రాతిపదికన విశ్లేషిస్తే వాస్తవిక పరిస్థితికి అది అద్దం పడుతుంది? అన్నది ఓ శాస్త్రం.

పీపుల్స్‌ పల్స్‌ బృందం గత నాలుగున్నరేళ్లుగా క్షేత్రస్థాయిలో చేస్తున్న పరిశోధన, సదరు సమాచారాన్ని పాత గణాంకాలతో అన్వయించే పద్దతుల తాలూకు విశేషాలు పంచుకునే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.

వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు... ‘గ్రామీణ ప్రాంతాల్లో బాగున్నాం, పట్టణ ప్రాంతాల్లో మాకు కొంత వ్యతిరేకత ఉంద’ని చెప్పుకుంటున్నారు. ప్రయివేటు సంభాషణల్లోనయినా ఒప్పుకుంటున్నారు.

తెలుగుదేశం మద్దతుదారులు, పట్టణ ప్రాంతాల్లో బాగున్నాం, పల్లెల్లో నాడీ పసిగట్టలేకపోతున్నామని అంటున్నారు. దీనికి వారిరువురు చూపే కారణం...

తాము అందించే పథకాలకు గ్రామీణ ప్రాంతాల్లో అధిక లబ్దిదారులు ఉన్నారని.. వారే మా స్టార్‌ క్యాంపెయినర్లు అని జగన్‌ కూడా తన లబ్దిదారుల ఓట్ల మీదే ఆశలు పెట్టుకున్నారు.

కానీ, ఇలాంటి విశ్లేషణలు చేసేటప్పుడు, 2019 ఎన్నికల్లో తెలుగుదేశానికో, బీజేపీకో, జనసేనకో, కమ్యూనిస్టులకో ఓటు వేసిన ఒక ఓటరు, జగన్‌ చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలు నచ్చి ఈసారి వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారా? లేదా? అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు వాస్తవిక సమాధానమే... ఓటర్లు ఎటువైపు నిలబడ్డారో అన్నది తెలిసిపోతుంది.

ప్రాంతాన్ని బట్టి ఫలితమా?

దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా... పథకాల పేర్లే మారుతున్నాయి కానీ, ఇంచుమించు అన్ని ప్రభుత్వాలు జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాల్లాంటి పథకాలనే అమలు చేస్తున్నాయి. పైగా, ప్రభుత్వం మారితే పథకాలు పోతాయానే భయం-ఆందోళన ప్రజల్లో మాయమై రెండు దశాబ్దాలు దాటింది.

ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు పెరుగుతాయే తప్ప, తగ్గుతాయనే భయం ఎవరికీ లేదు. 2019లో చంద్రబాబు అమలు చేసిన పథకాలు పోతాయనే భయం లేకపోవడం వల్లే, నిర్భయంగా వైఎస్సార్సీపీకి ఓటు వేశారు.

అలాగే, తెలంగాణలో కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు పోతాయేమోననే భయాలేవిటినీ ప్రజలు ఓటేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి, పథకాల కోణంలో చూసినప్పుడు, కేవలం నవరత్నాల్ని చూసే గ్రామీణ ప్రాంతాల ప్రజలు జగన్‌కి మళ్లీ పట్టం కడతారా? అని విశ్లేషకులు ఆలోచించుకోవాలి.

ప్రజల మూడ్‌ ఒక ప్రాంతంలో ఒకలాగా, ఇంకో ప్రాంతంలో మరోలాగా ఉండదు. అది ఒక అల లాగ ఒకేలా ఉంటుంది. ఏదో కొంత వ్యత్యాసం తప్ప, దాదాపు అంతటా ఒకేలా ప్రతిబింబిస్తుంది. బాహుబలి సినిమా గ్రామాల్లో ఒకలా, పట్టణాల్లో ఒకలా ఆడిందా? హిట్టు లేదా ఫ్లాఫ్‌ అయిన ఒక సినిమా, రూరల్‌ లో హిట్‌ అయ్యి అర్బన్‌‌లో ఫెయిల్‌ అవడం, కాకపోతే అర్బన్‌లో హిట్టయి రూరల్‌లో ఫెయిలవడం ఉంటుందా? ఒకప్పుడు హైదరాబాద్‌‌లో దొరికే బిర్యానీ, చైనీస్‌ ఫుడ్‌ ఇప్పుడు గ్రామాలకు కూడా చేరింది. నగరం, పట్టణం, గ్రామం.. ప్రాంతం వేరైనా, ప్రజల మూడ్‌, టేస్ట్‌ దాదాపు ఒకే విధంగా ఉంటుందని చెప్పడానికి ఇవే తార్కాణాలు.

కెనడా తత్వవేత్త, ప్రొఫెసర్‌ మార్షల్‌ మెక్లూహన్‌ సిద్ధాంతం ప్రకారం టీవీ, ఇంటర్నెట్‌, కనెక్టివిటీ పెరిగిన తర్వాత ప్రపంచం ఒక చిన్న కుగ్రామంగా మారిపోయింది. నగరాలకు, గ్రామాలకు మధ్య వ్యత్యాసం తగ్గిపోయింది. బతుకుదెరువు కోసం పట్టణాలకు వచ్చిన ఎంతోమంది తమ తమ ఊరుకెళ్లే ఓటేస్తుంటారు. మరి వీళ్లను అర్బన్‌ ఓటర్‌ అనాలా? లేక రూరల్‌ ఓటర్‌ అనాలా?

ఇటు అటు తిరిగే క్రమంలో పట్టణాల్లో ఉండే వాళ్ల అభిప్రాయలు, గ్రామాలను ప్రభావితం చేయవా? గ్రామాలకు, పట్టణాలకు మధ్య ఉన్న గోడలు తొలగిపోయాయి. ఇప్పుడు ఇడుపులపాయలో పప్పు ధర ఎంత ఉంటుందో, ఇచ్చాపురంలో కూడా అంతే ఉంటుంది. పులివెందులలో ఒక యూనిట్‌కి ఎంత కరెంటు బిల్లు వస్తుందో, కుప్పంలో కూడా అంతే వస్తుంది. దీనిపై ప్రజా స్పందన కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. ఐదు వేళ్లలో ఏ వేలికి దెబ్బ తాకినా బాధ ఒకేలా ఉంటుందన్న రావిశాస్త్రీగారి మాట, ప్రజల మూడ్‌ కి అద్దం పడుతుంది.

విశ్లేషణ చేసేవారు ఎవరయినా సరే, ముఖ్యంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులు 2019 ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన మద్దతు ఇప్పటికీ కొనసాగుతోందా? అప్పటితో పోలిస్తే అదేమైనా తగ్గిపోయిందా? పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీకి 2019లో వచ్చిన మద్దతు ఈసారి ఇంకా పెరిగిందా? తగ్గిందా? అని తెలుసుకోవాలి.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 2019 ఎన్నికలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మద్దతు పెరిగిందా? తగ్గిందా? అన్న విషయాన్ని విశ్లేషణలకు పరిగణనలోకి తీసుకోవాలి. కలిసి కూటమిగా పోటీ చేస్తున్నందున, ఒకరి మద్దతుదారులు భాగస్వాములు మరొకరికి అనుకూలంగా ఓటేస్తారా? ఆ మేర, సజావుగా ఓటు బదిలీ అవుతుందా? అన్న కోణంలో ఆలోచించాలి.

2019లో అలా

సీఎస్డీఎస్‌-లోక్‌నీతి డేటా ప్రకారం 2019లో గ్రామీణ ప్రాంతంలో వైఎస్సార్సీపీకి 56, టీడీపీ 37, కాంగ్రెస్‌ కి 1.7, బీజేపీకి 0.3, ఇతరులకు 5 శాతం మద్దతు లభించింది. పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే వైఎస్సార్సీపీ 35, టీడీపీ 44, కాంగ్రెస్‌ 1, బీజేపీకి 3 శాతం, ఇతరులకు 17 శాతం మద్దతు లభించింది. జనసేనకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎంత శాతం ఓట్లు లభించాయో వారు వెల్లడించలేదు.

అయితే, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి మొత్తమ్మీద దాదాపు 6 శాతం ఓట్లు వచ్చాయి. ఈ డేటా ప్రకారం 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గ్రామీణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీపై 19 శాతం ఆధిక్యంలో ఉంది. పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ 9 శాతం వైసీపీపై ఆధిక్యత సాధించింది. మొత్తంగా చూసినపుడు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి దాదాపు 50 శాతం, టీడీపీకి 40 శాతం ఓట్లు, జనసేనకు 6 శాతం, బీజేపీకి 0.9, కాంగ్రెస్‌ కి 1 శాతం ఓట్లు వచ్చాయి.

స్థూలంగా చూసినపుడు, వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ, పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఆదరణ అన్నది, పై గణాంకాల ప్రకారం ఆనాటి పరిస్థితే! కొత్తదేమీ కాదు. అందుకు భిన్నమైన పరిస్థితి టీడీపీది. స్థూలాభిప్రాయాలు కాకుండా.... ఎక్కడైనా కొత్తగా పెరిగారా? తగ్గారా? అలా జరిగితే అందుకు ఆధారాలేమిటి? అన్నదే ప్రశ్న! దాన్ని బట్టే విశ్లేషణ సాధ్యమౌతుంది.

2024లో పల్స్ ఏంటి?

ప్రస్తుతం 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి. వాటికి 2019లో వచ్చిన ఓట్ల శాతం కలిపితే, దాదాపు 47 శాతానికి చేరుతుంది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు కలిసి మరో కూటమిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీరు, వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో పాటు, సాధారణంగా ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత ఉన్నప్పుడు బలంగా ఉండే విపక్ష కూటమికి అనుకూలంగా తోడవుతుంది. అంటే, వైఎస్సార్సీపీ ఓట్లు 41-43 శాతం దగ్గర ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అధికార పక్షం కంటే, 4 నుంచి 5 శాతం ఆధిక్యంలో ఎన్డీయే కూటమి ఉండే అవకాశం కనబడుతోంది.

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌ లెక్క ప్రకారం... గతంలో ఓట్లు వేసిన వర్గాల మద్దతు అలాగే ఉందా? లేక తేడా ఉందా? అనేదే విశ్లేషణకు ప్రాతిపదిక కావాలి. ఇది కేవలం ఒక గ్రామీణ ప్రాంతానికో, పట్టణ ప్రాంతానికో సంబంధించినది కాదు. వివిధ సమూహాలు, లింగం, వయసు అన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. 2019లో మద్దతు ఇచ్చిన సమూహాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాలు అదే పార్టీకి లేదా కూటమికి ఇప్పుడు ఇంకా ఎక్కువ మద్దతు ఇస్తున్నారా? లేదా అవి ప్రత్యర్థి పక్షం వైపు చూస్తున్నాయా? అన్న గణాంకాల ఆధారంగా విశ్లేషించాలి.

ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులు వేసే పోస్టల్‌ బ్యాలెట్స్‌ 2019లో వైఎస్సార్సీపీకి 45.55 శాతం, టీడీపీ 23.32 శాతం, జనసేనకు 3.76, బీజేపీకి 1.40, కాంగ్రెస్‌ కి 0.42 శాతం పోలయ్యాయి. ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉన్నారు?

పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధమా?

సీఎం జగన్‌ ఏడాది కింద ‘క్లాస్‌ వార్‌’ నినాదం అందుకున్నారు. ఈ ఎన్నికలను పేదవాళ్లకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంగా అభివర్ణించారు. అయితే, ఇప్పుడు ఎవరినైతే తన లబ్దిదారులు అనుకుంటున్నారో, 2019లో మద్దతిచ్చిన 50 శాతం మంది ఓటరల్లో ఈ లబ్దిదారులు ఉన్నారా? లేరా? వారు కాకుండా అదనంగా వచ్చి చేరే ఓటర్లు ఎవరు? అప్పటి మద్దతుదారుల్లో ఇప్పుడు జారిపోయే వారెవరు? ఇలా, వేర్వేరు హేతుబద్దమైన ప్రశ్నలు వేసుకుంటూ సమీకరణాలను విశ్లేషిస్తే, పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడానికి వీలుంటుంది.

పీపుల్స్‌ పల్స్‌ రీసర్చ్‌ ప్రకారం... ఈ ఎన్నికలు కూడా 2014 ఎన్నికల్లాగే హోరా హోరిగా జరిగే అవకాశం ఉంది. విడతలుగా క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేల ప్రకారం... కచ్చితంగా కాంగ్రెస్‌ కు కొంత ఓటు శాతం పెరిగే అవకాశాలు ఉండటంతో అది ఎవరికి? ఏ మేర నష్టం చేస్తుంది?

2014తో పోలిస్తే, బీజేపీ మీద, మోడీ మీద ముస్లింల్లో వ్యతిరేకత అధికమైంది. అయితే, 2019లో మోదీని వ్యతిరేకిస్తూ చంద్రబాబు బీజేపీకి ఎదురు తిరిగినట్టుగా జగన్‌ ఎదురు తిరగడం లేదు. కాబట్టి, ముస్లింలు పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అనేది ఆసక్తికరమైన అంశం.

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ప్రజల నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయాలే, రేపటి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయన్నది సుస్పష్టం.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్
ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్

(disclaimer: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగువి కావు.)

WhatsApp channel