RBI's digital Rupee: డిసెంబర్ 1 నుంచి ఆర్బీఐ డిజిటల్ రూపీ-rbis first pilot of retail digital rupee from december 1 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Rbi's First Pilot Of Retail Digital Rupee From December 1

RBI's digital Rupee: డిసెంబర్ 1 నుంచి ఆర్బీఐ డిజిటల్ రూపీ

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 10:41 PM IST

RBI's digital Rupee: డిజిటల్ కరెన్సీ లోకి ఆర్బీఐ(RBI) ప్రవేశిస్తోంది. డిజిటల్ ఈ - రూపీని పైలట్ ప్రాజెక్టుగా డిసెంబర్ 1 వ తేదీ నుంచి మార్కెట్లో ప్రవేశపెడ్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

RBI's digital Rupee: డిసెంబర్ 1న పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ రూపీని ప్రవేశపెడ్తున్నట్లు ఆర్బీఐ(RBI) ప్రకటించింది. ఎంపిక చేసిన లొకేషన్లలో, ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా ఈ డిజిటల్ రూపీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే హోల్ సేల్ సెగ్మెంట్లో డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రారంభించిన విషయం తెలిసిందే.

RBI's digital Rupee: ప్రయోగాత్మకంగా..

డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని బ్యాంకుల ద్వారా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డిజిటల్ కరెన్సీ అందుబాటులో ఉండనుంది. డిజిటల్ కరెన్సీ క్రియేషన్, డిస్ట్రిబ్యూషన్ లను అధ్యయనం చేసిన అనంతరం పూర్తి స్థాయిలో ఈ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురానుంది.

RBI's digital Rupee: ఈ డిజిటల్ కరెన్సీ పూర్తి వివరాలు ఇవీ..

  • ప్రస్తుతం అమల్లో ఉన్న నగదు, నాణేల తరహాలోనే ఈ డిజిటల్ రూపీ సేవలు ఉంటాయి. వాటిలాగానే చెలామణి ఉంటుంది.
  • ప్రస్తుతానికి ఎంపిక చేసిన బ్యాంకులు జారీ చేసే డిజిటల్ వ్యాలెట్ ల ద్వారా డిజిటల్ కరెన్సీని చెలామణి చేస్తారు. మొబైల్ ఫోన్ లలో వీటిని స్టోర్ చేసుకోవచ్చు.
  • వ్యక్తిగత చెల్లింపులకు కానీ, వ్యాపార లావాదేవీలకు గానీ ఈ కరెన్సీని వాడవచ్చు. క్యూఆర్ కోడ్(QR code) ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు.
  • ఈ డిజిటల్ కరెన్సీ లావాదేవీలను ఆర్బీఐ బ్లాక్ చైన్ మెకానిజం ద్వారా లేదా ప్రస్తుతం కొనసాగిస్తున్నసంప్రదాయ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా లేదా ఈ రెండింటి అనుసంధానంతో నిర్వహించనుంది.
  • పైలట్ ప్రాజెక్టు కోసం నాలుగు బ్యాంకులను, నాలుగు నగరాలను ఆర్బఐ ఎంపిక చేసింది. ఎస్బీఐ(State Bank of India), ఐసీఐసీ బ్యాంక్(ICICI Bank), యెస్ బ్యాంక్(Yes Bank), ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్(IDFC First Bank) లను ఆర్బీఐ ఎంపిక చేసింది. అలాగే, ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కోసం ముంబై, డిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ లను ఎంపిక చేసింది.
  • తరువాత దశలో బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India), హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank), కొటక్ మహింద్ర బ్యాంక్(Kotak Mahindra Bank) లను ఈ ప్రాజెక్టులో చేరుస్తారు. అలాగే, హైదరాబాద్, అహ్మదాబాద్, గ్యాంగ్టక్, గువాహతి, ఇండోర్, కొచి, లక్నో, పట్నా, సిమ్లాలను చేరుస్తారు.

WhatsApp channel

టాపిక్